3
1 ఏడో నెలలో, ఇస్రాయేల్ ప్రజలు తమ ఊళ్ళలో కాపురమేర్పరచుకొన్న తరువాత, వారు ఏకంగా జెరుసలంలో సమకూడారు. 2 దేవుని మనిషి అయిన మోషే ధర్మశాస్త్రంలో వ్రాసి ఉన్న ప్రకారం హోమబలులు అర్పించడానికి యోజాదాక్ కొడుకు యేషూవ, అతడి సాటి యాజులు, షయల్‌తీయేల్ కొడుకు జెరుబ్బాబెల్, అతడి సంబంధులు ఇస్రాయేల్ ప్రజలు దేవుని బలిపీఠాన్ని కట్టారు. 3 ఆ ప్రాంతాలలో ఉన్న జనాలకు భయపడుతూ ఉన్నా వారు ఆ బలిపీఠాన్ని దాని పునాది మీద నిర్మించి, ప్రొద్దున, సాయంత్రం యెహోవాకు హోమబలులు సమర్పిస్తూ వచ్చారు. 4 అంతేగాక, లేఖనాలప్రకారం వారు పర్ణశాలల పండుగను ఆచరించారు, ఏ రోజుకు నియమించబడ్డ హోమబలులన్నీ ఆ రోజున అర్పించారు.
5 తరువాత ఎప్పటికీ అర్పించవలసిన హోమబలులు, అమావాస్యలకూ యెహోవా యొక్క నియామకమైన పండుగలకూ అర్పించవలసిన హోమబలులు అర్పిస్తూ వచ్చారు. ఒక్కొక్కరు తెచ్చిన స్వేచ్ఛార్పణలను కూడా అర్పిస్తూవచ్చారు. 6 ఏడో నెల మొదటి రోజున, యెహోవా ఆలయానికి పునాది ఇంకా వేయకపోయినా, వారు యెహోవాకు హోమబలులు అర్పించడం ఆరంభించారు. 7 వారు తాపీ పనివాళ్ళకూ వడ్రంగులకూ డబ్బు ఇచ్చారు. పారసీక దేశం చక్రవర్తి కోరెషు అనుమతి ప్రకారం, సీదోను, తూరు నగరాలకు వారు దేవదారు మ్రానులను లెబానోను నుంచి సముద్రంమీద యొప్పేకు తెప్పించాలని వారికి భోజన పదార్థాలను, పానాన్ని, నూనెను ఇచ్చారు.
8 జెరుసలంలో దేవుని ఆలయం ఉన్న స్థలానికి వారు వచ్చిన రెండో సంవత్సరం రెండో నెలలో షయల్‌తీయేల్ కొడుకు జెరుబ్బాబెల్, యోజాదాక్ కొడుకు యేషూవ, వారితో ఉన్నవారంతా– యాజులూ, లేవీగోత్రికులూ చెరలోనుంచి జెరుసలంకు తిరిగి వచ్చినవారంతా – ఆ పని మొదలు పెట్టారు. ఇరవై సంవత్సరాలు మొదలుకొని పైవయసు గల లేవీగోత్రికులను యెహోవా ఆలయాన్ని కట్టే పనిని తనిఖీ చేయడానికి వారు నియమించారు. 9 యేషూవ, అతడి కొడుకులూ సోదరులూ, కద్‌మీయేల్, అతడి కొడుకులు, హోదవ్యా కొడుకులు, హేనాదాదు సంతానం, వారి కొడుకులూ సోదరులూ – ఈ లేవీ గోత్రికులు దేవుని ఆలయాన్ని కట్టేవారిని పైవిచారణ చేయడానికి ఏకీభవించారు. 10 కట్టేవారు యెహోవా ఆలయానికి పునాదిని వేసినప్పుడు, తమ ప్రత్యేక వస్త్రాలు తొడుక్కొన్న యాజులు బాకాలను చేతపట్టుకొని నిలబడ్డారు. వారితోకూడా లేవీ గోత్రికులలో ఆసాపు వంశీయులు చేతితాళాలను పట్టుకొని నిలబడ్డారు. ఇస్రాయేల్ రాజు దావీదు నిర్ణయించినట్టు వారంతా యెహోవాను కీర్తించారు. 11 స్తుతితో, కృతజ్ఞతతో వారు యెహోవాను ఇలా సంకీర్తనం చేశారు: “ఆయన మంచివాడు. ఆయన అనుగ్రహం ఇస్రాయేల్ ప్రజలమీద ఎప్పటికీ నిలిచి ఉంటుంది.” యెహోవా ఆలయం పునాదిని వేయడం చూచి ప్రజలంతా యెహోవాను పెద్ద పెద్ద కేకలతో స్తుతించారు.
12 అయితే యాజులలో, లేవీగోత్రికులలో, వంశ నాయకులలో మునుపటి ఆలయాన్ని చూచిన అనేకమంది వృద్ధులు ఈ ఆలయం పునాది వేయడం చూచి భోరున ఏడ్చారు. ఇతరులు అనేకమంది సంతోషంతో కేకలు పెట్టారు. 13 ప్రజలు పెద్ద ధ్వని చేస్తూ ఉండడం వల్ల ఏది సంతోష శబ్దమో, ఏది విలాప శబ్దమో వారు తెలుసుకోలేకపోయారు. ఆ ధ్వని చాలా దూరం వినబడింది.