10
1 ఎజ్రా ఏడుస్తూ, దేవుని ఆలయం ఎదుట సాష్టాంగపడుతూ, దోషాలు ఒప్పుకొంటూ, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఇస్రాయేల్ ప్రజలలో పురుషులూ, స్త్రీలూ చిన్నవాళ్ళూ చాలా పెద్ద గుంపుగా అతని చుట్టూ గుమికూడారు. వారు కూడా భోరున ఏడ్చారు. 2 అప్పుడు ఏలాం కొడుకులలో ఒకడైన యెహీయేలు కొడుకు షెకనయా ఎజ్రాతో ఇలా అన్నాడు: “ఈ ప్రదేశాలలో ఉన్న పరాయి స్త్రీలను పెళ్ళి చేసుకొని మేము మా దేవుని మీద ద్రోహం చేశాం. అయినా ఇస్రాయేల్ ప్రజల విషయం ఆశాభావం ఇంకా ఉంది. 3 గనుక ఈ స్త్రీలందరినీ వాళ్ళ పిల్లలతోపాటు పంపిస్తామని మన దేవుని ఎదుట ఒడంబడిక చేసుకొంటాం. అది నా యజమాని నీ ఆలోచనప్రకారం, మన దేవుని ఆజ్ఞలంటే భయభక్తులు ఉన్నవారి ఆలోచనప్రకారం ధర్మశాస్త్రానుసారంగా జరగాలి. 4 లెండి! ఈ పని మీ చేతిలో ఉంది. మేము మీకు సాయం చేస్తాం, గనుక ధైర్యం వహించి అలా జరిగించండి.”
5 అప్పుడు ఎజ్రా లేచి, యాజులలో నాయకులూ, లేవీగోత్రికులూ, ఇస్రాయేల్ ప్రజలందరూ ఆ మాట ప్రకారం చేసేలా వారి చేత ప్రమాణం చేయించాడు. వారు ప్రమాణం చేసినతరువాత, 6 ఎజ్రా దేవుని ఆలయం ఎదుటనుంచి బయలుదేరి, ఎల్‌యాషీబ్ కొడుకైన యోహానాను గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఉండి, చెరనుంచి వచ్చినవారి అపరాధం కారణంగా దుఃఖిస్తూ ఉన్నాడు. అతడు భోజనమేమీ చేయలేదు. నీళ్ళు త్రాగలేదు. 7 చెరనుంచి వచ్చినవారందరూ జెరుసలంలో సమకూడాలని యూదా అంతటా జెరుసలం అంతటా ప్రకటన చేశారు. 8 మూడు రోజులలోపల ఎవడైతే రాకపోతాడో, నాయకులూ పెద్దలూ చేసిన ఏర్పాటు ప్రకారం, వాడి ఆస్తి అంతా జప్తు చేయడమూ, చెరనుంచి వచ్చినవారి సమాజంలో నుంచి వాణ్ణి వెలి వేయడమూ జరుగుతుందని కూడా ప్రకటించారు. 9 ఆ మూడు రోజులలోపల యూదావారంతా, బెన్యామీనువారంతా జెరుసలంలో సమకూడారు. అది తొమ్మిదో నెల, ఇరవైయో రోజు. ప్రజలంతా దేవుని ఆలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో కూర్చుని ఉన్నారు. సమకూడిన సంగతి కారణంగానూ పెద్ద వాన పడడంవల్లనూ వారు వణకుతూ ఉన్నారు.
10 ఎజ్రాయాజి లేచి వారితో ఇలా అన్నాడు: “మీరు ద్రోహం చేశారు. పరాయి దేశ స్త్రీలను పెళ్ళిచేసుకొని, ఇస్రాయేల్ ప్రజల అపరాధాన్ని ఎక్కువ చేశారు. 11 గనుక ఇప్పుడు పూర్వీకుల దేవుడైన యెహోవా సన్నిధిలో మీ అపరాధం ఒప్పుకోండి. ఆయన చిత్తానుసారంగా జరిగించండి. దేశంలో ఉన్న ఇతర జనాలనుంచి, పరాయి స్త్రీలనుంచి వేరుపడి ప్రత్యేకంగా ఉండండి.”
12 అందుకు, సమకూడిన వారంతా అతనితో బిగ్గరగా చెప్పారు “సరే నీవు చెప్పినట్టే మేము చేయాలి. 13 అయితే సమకూడిన ప్రజలు చాలామంది. ఇది వర్షకాలం. మేము బయట నిలబడి ఉండలేము. అదిగాక, ఈ పని ఒకటి రెండు రోజుల్లో జరిగేది కాదు. ఈ విషయంలో మాలో చాలామంది అపరాధం చేశారు. 14 మన నాయకులు సమాజమంతటి కోసం ప్రతినిధులుగా ఉండాలి. మన ఊళ్ళలో ఎవరెవరైతే పరాయిదేశ స్త్రీలను పెండ్లి చేసుకొన్నారో వాళ్ళంతా నిర్ణీతకాలంలో రావాలి. వాళ్ళ ఊళ్ళ పెద్దలూ న్యాయాధిపతులూ వాళ్ళతోకూడా రావాలి. ఈ సంగతి కారణంగా మన మీదికి వచ్చిన దేవుని తీవ్ర కోపం తొలగిపోయేవరకు ఇలా జరగాలి.”
15 అశాహేల్ కొడుకు యోనాతాను, తిక్వా కొడుకు యాహజియా మాత్రమే ఆ మాటను వ్యతిరేకించారు. మెషుల్లాం, లేవీవాడైన షబ్బెతయి వాళ్ళకు తోడ్పడ్డారు. 16 చెరనుంచి వచ్చినవారు ఆ ఏర్పాటుప్రకారం చేశారు. ఎజ్రాయాజి, పూర్వీకుల వంశాల నాయకులను కొందరిని పేర్ల ప్రకారం ఎన్నుకొన్నాడు. పదో నెల మొదటి రోజున ఆ విషయాన్ని పరిశీలన చేయడానికి వారు సభగా కూడారు. 17 పరాయి దేశ స్త్రీలను పెండ్లి చేసుకొన్న వారందరి సంగతి మొదటి నెల మొదటి రోజున వారు ముగించారు.
18 యాజుల వంశాలలో పరాయి దేశ స్త్రీలను పెండ్లి చేసుకొన్న వారెవరంటే, యోజాదాక్ కొడుకు యేషూవ వంశంలో, అతని సోదరులలో మయశేయా, ఎలియాజరు, యారీబ్, గెదలయా 19 (వారు భార్యలను పంపివేస్తామని మాట ఇచ్చారు. తాము అపరాధులు కావడంచేత అపరాధంకోసం మందలో ఒక పొట్టేలును అర్పించారు); 20 ఇమ్మేరు వంశంలో హనానీ, జెబదయా; 21 హారీం వంశంలో మయశేయా, ఏలీయా, షెమయా, యెహీయెల్, ఉజ్జియా; 22 పషూరు వంశంలో ఎల్ యోయేనయి, మయశేయా, ఇష్మాయేల్, నెతనేల్, జోజాబాదు, ఎల్‌యాశా, 23 లేవీగోత్రికులలో యోజాబాదు, షిమీ, కెలిథా (అంటే కెలాయా), పెతహయా, యూదా, ఎలియాజరు, 24 గాయకులలో ఎల్‌యాషీబ్‌; ద్వారపాలకులలో షల్లూం, తేలెం, ఊరి.
25 మిగతా ఇస్రాయేల్ ప్రజలలో వీరు ఉన్నారు: పరోషు వంశంలో రమయా, యిజ్జియా, మల్కీయా, మియామీను, ఎలియాజరు, మిల్కియా, బెనాయా; 26 ఏలాం వంశంలో మత్తనయా, జెకర్యా, యెహీయేల్, అబ్దీ, యెరేమోతు, ఏలీయా; 27 జత్తూ వంశంలో ఎల్‌యోయేనై, ఎల్‌యాషీబ్, మత్తనయా, యెరేమోతు, జాబాదు, అజీజా; 28 బేబయి వంశంలో యెహోహానాను, హననయా, జబ్బయి, అత్లాయి; 29 బానీ వంశంలో యెషూల్లాం, మల్లూకు, అదాయా యాషూబ్, షెయాల్, రామోతు; 30 పహత్‌మోయాబు వంశంలో అద్నా, కెలాల్, బెనాయా, మయశేయా, మత్తనయా, బసెలేల్, బిన్నూయి, మనష్షే; 31 హరీం వంశంలో ఎలియాజరు, ఇష్షీయా, మల్కీయా, షెమయా, షిమియోను, 32 బెన్యామీను, మల్లూకు, షెమరయా 33 హాషుం వంశంలో మెత్తనయి, మత్తాత్తా, జాబాదు, ఎలీపలెటు, యెరేమయి, మనష్షే, షిమీ; 34 బానీ వంశంలో మయదయి, అమ్రాం, ఊయేల్‌; 35 బెనాయా, బేదయా, కెలూహు, 36 వనయా, మెరేమోదతు, ఎల్‌యాషీబు, 37 మత్తనయా, మత్తెనయి, యాశావు, 38 బానీ, బిన్నూయి, షిమీ, 39 షెలెమయ, నాతాను, ఆదాయా, 40 మక్నద్భయి, షాషయి, షారాయి 41 ఆజరేల్, షెలెమయా, షెమరయా, 42 షల్లూం, అమరయా యోసేపు; 43 నెబో వంశంలో యెహీయేల్, మత్తితయా, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేల్, బెనాయా. 44 వీరందరూ పరాయిదేశ స్త్రీలను పెండ్లి చేసుకొన్నవారు. ఆ స్త్రీలలో కొంతమంది పిల్లలను కన్నారు కూడా.