35
1 ✝✝యోషీయా జెరుసలంలో యెహోవాకు పస్కా పండుగ ఆచరించాడు. మొదటి నెల పద్నాలుగో రోజు ప్రజలు పస్కా గొర్రెపిల్లలనూ వధించారు. 2 ✝యోషీయా యాజులకు వారి వారి పనులను నిర్ణయించి యెహోవా ఆలయ సేవ జరిగించడానికి వారిని ప్రోత్సాహపరిచాడు. 3 ఇస్రాయేల్ ప్రజలందరికీ ఉపాధ్యాయులుగా, యెహోవాకు ప్రతిష్ఠితులుగా ఉన్న లేవీగోత్రికులకు అతడు ఇలా ఆదేశించాడు✽:“ఇస్రాయేల్ ప్రజల రాజైన దావీదు కొడుకు సొలొమోను కట్టించిన ఆలయంలో పవిత్రమైన పెట్టెను✽ ఉంచండి. ఇక నుంచి మీరు భుజాలమీద దానిని మోయకూడదు. మీ దేవుడైన యెహోవాకు, ఆయన ఇస్రాయేల్ ప్రజకు సేవ చేయండి. 4 ✝ఇస్రాయేల్ ప్రజల రాజు దావీదు, అతని కొడుకు సొలొమోను వ్రాసి ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీ కుటుంబాలకు ఏర్పాటైన వరుసలను అనుసరించి మిమ్ములను సిద్ధం చేసుకోండి. 5 మీ సోదరులైన ఇస్రాయేల్ ప్రజలలో ఆయా వంశాలలో ప్రతి గుంపుకోసం లేవీగోత్రికుల కుటుంబాలలో ఒక గుంపుచొప్పున మీరు పవిత్ర స్థలంలో నిలబడండి. 6 ✝పస్కా గొర్రెపిల్లలను వధించి, మిమ్ములను పవిత్రం చేసి, మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి, ఆ బలులను మీ స్వదేశీయుల కోసం సిద్ధం చేయండి.”
7 యోషీయా తన సొంత మందలో నుంచి ముప్ఫయి వేల గొర్రెపిల్లలనూ, మేకపిల్లలనూ, మూడు వేల కోడెదూడలనూ అక్కడ ఉన్న ప్రజలందరికీ పస్కాబలికోసమని ఇచ్చాడు. 8 అతని అధిపతులు కూడా ప్రజలకూ యాజులకూ లేవీగోత్రికులకూ మనసారా ఇచ్చారు. యెహోవా ఆలయం అధికారులైన హిల్కీయా, జెకర్యా, యెహీయేల్, యాజులకు పస్కాబలికోసం రెండు వేల ఆరు వందల గొర్రెపిల్లలనూ మూడు వందల కోడె దూడలనూ ఇచ్చారు. 9 కొననయా, అతని తోబుట్టువులైన షెమయా, నేతనేల్, లేవీగోత్రికులలో నాయకులైన హషబయా, యెహీయేల్, యోజాబాదు, లేవీగోత్రికులకు పస్కా బలికోసం అయిదు వేల గొర్రె పిల్లలనూ అయిదు వందల కోడెలనూ ఇచ్చారు.
10 సేవకు అంతా సిద్ధంగా ఉన్నప్పుడు, రాజాజ్ఞప్రకారం యాజులు తమ స్థలాలలో, లేవీగోత్రికులు తమ వరుసలలో నిలబడ్డారు. 11 లేవీగోత్రికులు పస్కా గొర్రెపిల్లలను వధించి, రక్తాన్ని యాజుల చేతికి అందించారు. యాజులు దానిని చల్లారు✽. లేవీగోత్రికులు జంతువుల చర్మాన్ని ఒలిచారు. 12 మోషే వ్రాసిన గ్రంథంలో ఉన్నదాని ప్రకారం ప్రజల వంశాల గుంపులు యెహోవాకు అర్పణగా ఇచ్చేందుకు వారికి ఇవ్వడానికి యాజులు హోమబలుల మాంసాన్ని ప్రక్కన ఉంచారు. పశు మాంసాన్ని కూడా అలా చేశారు. 13 ✝వారు యథావిధిగా పస్కా జంతువుల మాంసాన్ని నిప్పుమీద కాల్చారు. ఇతర పవిత్రమైన అర్పణలను కుండలలో, బొరుసులలో, బిందెలలో ఉడకబెట్టి, ప్రజలందరికీ త్వరగా వడ్డించారు. 14 ఆ తరువాత లేవీగోత్రికులు తమకోసం, యాజులకోసం మాంసం సిద్ధం చేశారు. అహరోను వంశంవారైన యాజులు హోమబలులనూ క్రొవ్వునూ✽ రాత్రివరకు అర్పిస్తూ వచ్చారు, గనుక లేవీగోత్రికులు తమకోసం, అహరోను వంశంవారైన యాజులకోసం సిద్ధం చేశారు.
15 ✝మునుపు దావీదు, ఆసాపు, హేమాను, రాజుకు దీర్ఘదర్శి అయిన యెదూతూను నియమించిన ప్రకారం, ఆసాపు సంతానమైన గాయకులు తమ స్థలాలలో ఉన్నారు. ప్రతి ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకులు తమ సేవను విడిచిరాకుండా ఉండేలా వారి బంధువులైన లేవీగోత్రికులు వారికోసం మాంసం సిద్ధం చేశారు.
16 ఈ విధంగా యోషీయారాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆ రోజున వారు పస్కా పండుగ ఆచరించారు. యెహోవా బలిపీఠం మీద హోమబలులు అర్పించారు. యెహోవా సేవ ఏమీ లోపం లేకుండా జరిగింది. 17 ✝హాజరైన ఇస్రాయేల్ ప్రజలు ఆ కాలంలో పస్కాను ఆచరించారు, పొంగని రొట్టెల పండుగ ఏడు రోజులు ఆచరించారు. 18 ✽ సమూయేలు ప్రవక్త రోజులనుంచి ఇస్రాయేల్‌లో పస్కాపండుగ ఆచరించడం అంత ఘనంగా జరగలేదు. యోషీయా, యాజులు, లేవీగోత్రికులు, హాజరై యూదా వారందరూ, ఇస్రాయేల్ వారందరూ, జెరుసలం కాపురస్తులు పస్కా ఆచరించిన ప్రకారం ఇస్రాయేల్ ప్రజల రాజులలో ఏ రాజూ ఎన్నడూ ఆచరించలేదు. 19 యోషీయా పరిపాలించిన పద్ధెనిమిదో సంవత్సరంలో ఈ పస్కా పండుగ జరిగింది.
20 ఇదంతా అయిన తరువాత, యోషీయా ఆలయాన్ని చక్కపెట్టిన తరువాత, ఈజిప్ట్ చక్రవర్తి నెకో యూఫ్రటీసు నది ఒడ్డున ఉన్న కర్కెమీష్✽ దగ్గర యుద్ధం చేయడానికి బయలుదేరాడు. యోషీయా అతడితో పోరాడడానికి బయలుదేరాడు. 21 అయితే నెకో అతని దగ్గరికి ఈ మాట చెప్పడానికి రాయబారులను పంపాడు: “యూదా రాజా! మీకూ నాకూ విరోధమేమి? ఇప్పుడు నేను మీమీదికి రాలేదు గాని, నాతో యుద్ధం చేస్తున్న రాజవంశంవారి✽ మీదికే వెళ్తున్నాను. త్వరపడమని దేవుడు✽ నాకాజ్ఞాపించాడు. గనుక నాతో ఉన్న దేవుడి జోలికి మీరు రావద్దు. లేకపోతే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు.” 22 ✽అయితే యోషీయా అతడిదగ్గరనుంచి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అతడితో యుద్ధం చేద్దామని మారు వేషం వేసుకొని, యెహోవా నోటి మాటగా నెకో చెప్పినది చెవిని పెట్టక, మెగిద్దోను మైదానాలలో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. 23 ✝విలుకాండ్రు యోషీయారాజు మీద బాణాలు వేశారు. రాజు తన సేవకులతో “నాకు గాయం బాగా తగిలింది. ఇక్కడనుంచి నన్ను తీసుకుపోండి” అన్నాడు. 24 అతని సేవకులు అతణ్ణి తన రథం మీద నుంచి దించి అతనికున్న వేరే రథంమీద ఉంచి జెరుసలంకు తీసుకువచ్చారు. అక్కడ అతడు చనిపోయాడు. అతని పూర్వీకుల సమాధులమధ్య అతణ్ణి పాతిపెట్టారు. అతని మృతికి యూదా, జెరుసలం ప్రజలంతా విలాపం చేశారు. 25 ✽యిర్మీయా యోషీయా విషయం విలాప వాక్కులు రచించాడు. ఈ రోజువరకు గాయకులంతా గాయకురాండ్రంతా తమ విలాప వాక్కులలో యోషీయాను ఉద్దేశించి పలుకుతూ ఉన్నారు. ఇలా చేయడం ఇస్రాయేల్‌లో ఆచారం అయింది. విలాప వాక్కులలో అలాంటివి వ్రాసి ఉన్నాయి. 26 యోషీయాను గురించిన ఇతర విషయాలు, యెహోవా ధర్మశాస్త్రంలో వ్రాసిన మాటలు అనుసరించి అతడు చూపిన భయభక్తులు, 27 మొదటినుంచి చివరి వరకు అతడు చేసిన చర్యలన్నీ ఇస్రాయేల్, యూదా రాజుల గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.