36
1 ✝✽ అప్పుడు దేశ ప్రజలు యోషీయా కొడుకైన యెహోయాహాజును అతని తండ్రి స్థానంలో జెరుసలంలో రాజుగా చేశారు. 2 యెహోయాహాజు రాజయినప్పుడు అతడు ఇరవై మూడేళ్ళవాడు. అతడు జెరుసలంలో మూడు నెలలు పరిపాలించాడు. 3 ఈజిప్ట్✽ చక్రవర్తి జెరుసలంకు వచ్చి అతణ్ణి సింహాసనంనుంచి తొలగించి, యూదామీద మూడు వేల నాలుగు వందల కిలోగ్రాముల వెండిని, ముప్ఫయి నాలుగు కిలోగ్రాముల బంగారాన్ని కప్పంగా నిర్ణయించాడు. 4 ✝ఈజిప్ట్ చక్రవర్తి, యెహోయాహాజు తోబుట్టువు ఎల్‌యాకీంను యూదామీద, జెరుసలంమీద రాజుగా చేశాడు. అతడి పేరు యెహోయాకీంగా మార్చాడు. నెకో ఎల్‌యాకీం తోబుట్టువు యెహోయాహాజును ఈజిప్ట్‌కు తీసుకుపొయ్యాడు.5 ✽యెహోయాకీం రాజయినప్పుడు అతడు ఇరవై అయిదేళ్ళవాడు. అతడు జెరుసలంలో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతడు తన దేవుడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. 6 బబులోను రాజైన నెబుకద్‌నెజరు✽ అతడిమీదికి వచ్చి అతణ్ణి కంచు సంకెళ్ళతో బంధించి బబులోనుకు తీసుకుపోయాడు. 7 ✝అంతేగాక, యెహోవా ఆలయంలో ఉన్న కొన్ని వస్తువులను నెబుకద్‌నెజరు బబులోనుకు తీసుకుపోయి అక్కడున్న తన గుడిలో ఉంచాడు. 8 యెహోయాకీంను గురించిన ఇతర విషయాలు, అతడు జరిగించిన అసహ్యమైన కార్యాలు, అతడి అపకీర్తి విషయం తెలిసినవన్నీ ఇస్రాయేల్, యూదా రాజుల గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. అతడి కొడుకు యెహోయాకీను అతడి స్థానంలో రాజయ్యాడు.
9 యెహోయాకీను రాజయినప్పుడు పద్ధెనిమిదేళ్ళవాడు. అతడు జెరుసలంలో మూడు నెలల పది రోజులు పరిపాలించాడు. అతడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. 10 ✝క్రొత్త సంవత్సరం వచ్చినప్పుడు నెబుకద్‌నెజరు రాజు మనుషులను పంపి అతణ్ణి బబులోనుకు రప్పించాడు. యెహోవా ఆలయంలో ఉన్న విలువైన వస్తువులను కూడా అతడితోపాటు తెప్పించాడు. యెహోయాకీను రక్తసంబంధి సిద్కియాను యూదామీద, జెరుసలంమీద రాజుగా చేశాడు.
11 ✝సిద్కియా రాజయినప్పుడు అతడి వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు. అతడు జెరుసలంలో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. 12 అతడు తన దేవుడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. యెహోవా నియమించిన యిర్మీయా✽ ప్రవక్త మాట సిద్కియా వినలేదు, వినయంగా మెడ వంచుకోలేదు.✽ 13 నెబుకద్‌నెజరురాజు దేవుని పేర అతడిచేత శపథం✽ చేయించుకొన్నాడు గాని, అతడు నెబుకద్‌నెజరుమీద తిరుగుబాటు చేశాడు. అతడు తలబిరుసుగా✽ ప్రవర్తించి, ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవావైపు తిరగక తన గుండె బండబారిపోయేలా చేసుకొన్నాడు. 14 యాజులలో, ప్రజలలో నాయకులంతా ఇతర జనాలు పూజించే అసహ్యమైనవాటిని అనుసరిస్తూ, యెహోవా విషయం అధికంగా ద్రోహం✽ చేశారు, యెహోవా జెరుసలంలో పవిత్రం చేసిన ఆలయాన్ని అశుద్ధం చేశారు.
15 వారి పూర్వీకుల దేవుడు యెహోవా తన ప్రజమీద, తన నివాసస్థలంమీద జాలి✽ పడ్డాడు గనుక వారికి తన దూతలచేత సందేశాలు పంపిస్తూవచ్చాడు. ఆయన పెందలకడ లేచి పంపిస్తూ వచ్చాడు.✽ 16 అయినా వారు దేవుని వార్తాహరులను ఎగతాళి✽ చేస్తూ, ఆయన వాక్కులను తృణీకరిస్తూ, ఆయన ప్రవక్తలను తిరస్కారం చేస్తూ వచ్చారు. నివారణ✽ లేక, యెహోవా ఆగ్రహం✽ తన ప్రజలమీదికి వచ్చేవరకూ వారు అలా చేస్తూ వచ్చారు. 17 ఆయన వారిమీదికి కల్దీయవాళ్ళ రాజును రప్పించాడు✽. అతడు వారి పవిత్రాలయంలో కూడా వారి యువకులను కత్తిపాలు చేశాడు. యువకులమీద గానీ, కన్యలమీద గానీ, ముసలివారిమీద గానీ, నెరసిన వెండ్రుకలున్న వారి మీద గానీ అతడు ఏమీ జాలి చూపలేదు. దేవుడు వారందరినీ అతడి వశం చేశాడు. 18 ✝బబులోను రాజు దేవుని ఆలయంలోనుంచి పెద్దవీ చిన్నవీ వస్తువులన్నిటినీ యెహోవా ఆలయం నిధులను, రాజు నిధులను, రాజు అధిపతుల నిధులను బబులోనుకు తీసుకుపొయ్యాడు.
19 అంతే గాక, బబులోనువాళ్ళు దేవుని ఆలయాన్ని తగులబెట్టారు, జెరుసలం గోడలను పడగొట్టారు, దాని భవనాలన్నిటినీ కాల్చివేశారు, అక్కడున్న విలువైనవాటన్నిటినీ నాశనం చేశారు. 20 కత్తిపాలు కాకుండా తప్పించుకొన్నవారిని అతడు బబులోనుకు తీసుకుపొయ్యాడు. రాజ్యం పారసీక రాజులది✽ అయ్యేవరకూ వారు అక్కడే ఉండి అతడికీ అతడి కొడుకులకూ దాసులుగా✽ ఉన్నారు.
21 అప్పుడు దేశం తన విశ్రాంతి✽ కాలాలు అనుభవించింది. యిర్మీయా పలికిన యెహోవా వాక్కు నెరవేరడానికి దేశం పాడుగా ఉన్న డెబ్భై సంవత్సరాల కాలం దానికి విశ్రాంతి కాలంగా ఉంది.
22 ✝యెహోవా తాను యిర్మీయాద్వారా పలికిన వాక్కును నెరవేర్చడానికి పారసీక చక్రవర్తి అయిన కోరెషు పరిపాలనలో మొదటి సంవత్సరంలో అతడి మనసును పురికొలిపాడు. తద్వారా పారసీక చక్రవర్తి కోరెషు రాజ్యమంతటా ఒక ప్రకటన చేయించి వ్రాయించాడు. ఏమంటే, 23 “పారసీక చక్రవర్తి కోరెషు ఇలా ఆజ్ఞ ఇస్తున్నాడు: పరలోకంలో ఉన్న యెహోవాదేవుడు లోకంలో ఉన్న అన్ని రాజ్యాలను నా వశం చేశాడు. యూదాలో ఉన్న జెరుసలంలో తనకోసం ఆలయాన్ని కట్టించమని ఆయన నాకు ఆజ్ఞాపించాడు. మీలో ఆయన ప్రజలుగా ఉన్నవారికి వారి దేవుడు తోడుగా వుంటాడు గాక! అలాంటి వారు జెరుసలంకు వెళ్ళవచ్చు.”