34
1 ✝యోషీయా రాజయినప్పుడు అతడి వయస్సు ఎనిమిది సంవత్సరాలు. అతడు జెరుసలంలో ముప్ఫయి ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు. 2 అతడు యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించేవాడు. తన పూర్వీకుడైన దావీదు జీవిత విధానాలను అనుసరించేవాడు. వాటినుంచి కుడివైపుకు గానీ, ఎడమవైపుకు గానీ తొలిగినవాడు కాడు. 3 ✝✽అతడు పరిపాలిస్తున్న ఎనిమిదో సంవత్సరంలో ఇంకా బాలుడుగా ఉండగానే తన పూర్వీకుడైన దావీదు యొక్క దేవుణ్ణి వెదకడం మొదలు పెట్టాడు. పన్నెండో సంవత్సరంలో ఎత్తయిన పూజాస్థలాలను, అషేరాదేవి స్తంభాలను, చెక్కిన విగ్రహాలను, పోత విగ్రహాలను తీసివేయడం, యూదాను జెరుసలంనూ శుద్ధం చేయడం మొదలు పెట్టాడు. 4 అతని కళ్ళెదుటే ప్రజలు బయల్‌దేవుళ్ళ బలిపీఠాలను పడగొట్టారు. వాటికి పైగా ఉన్న ధూపవేదికలను అతడు నరికివేయించాడు. అషేరాదేవి స్తంభాలనూ చెక్కిన విగ్రహాలనూ పోత విగ్రహాలనూ ముక్కలు చేయించాడు. వాటిని చూర్ణం చేయించి, వాటికి బలులు అర్పించినవాళ్ళ గోరీల మీద చల్లివేశాడు. 5 ఆ దేవతల పూజారుల ఎముకలు వాళ్ళ బలిపీఠాలమీద కాల్పించాడు. ఈ విధంగా అతడు యూదానూ, జెరుసలంనూ శుద్ధం చేశాడు. 6 అంతే గాక, మనష్షే, ఎఫ్రాయిం, షిమ్యోను పట్టణాలలో, నఫ్తాలి✽ పట్టణాలలో కూడా, వాటి చుట్టుపట్ల ఉన్న శిథిలాలలో కూడా ఉన్న బలిపీఠాలనూ అషేరాదేవి స్తంభాలనూ పడగొట్టించాడు. 7 ✝చెక్కిన విగ్రహాలను చూర్ణం చేశాడు. ఇస్రాయేల్ దేశమంతట్లో ధూపవేదికలన్నిటినీ ముక్కలుగా నరికివేయించాడు. ఆ తరువాత అతడు జెరుసలంకు తిరిగి వచ్చాడు.8 ✝యోషీయా పరిపాలిస్తున్న పద్ధెనిమిదో సంవత్సరంలో దేశాన్ని పవిత్రం చేశాక తన దేవుడైన యెహోవా ఆలయాన్ని బాగు చేయించడానికి కొంతమందిని పంపాడు. వారు అజల్యా కొడుకు షాఫాను, నగరాధికారి మయశేయా, లేఖకుడూ యోహహాజు కొడుకూ అయిన యోవా. 9 వారు ప్రముఖయాజి అయిన హిల్కీయాదగ్గరికి వెళ్ళి, అంతకుముందు దేవుని ఆలయానికి తెచ్చిన డబ్బంతా అతనికి అప్పగించారు. ఆ డబ్బును మనష్షేవారు, ఎఫ్రాయింవారు, ఇస్రాయేల్ ప్రజలో మిగిలినవారు✽ అందరూ, యూదావారు, బెన్యామీనువారు, జెరుసలం నగరవాసులు ఇస్తూ ఉంటే, ద్వారపాలకులైన లేవీగోత్రికులు దానిని జమ చేశారు. 10 అప్పుడు వారు ఆ డబ్బును యెహోవా ఆలయంమీద పని చేసే తనిఖీదారుల చేతికి అప్పచెప్పారు. ఆలయాన్ని మరమ్మత్తు చేస్తూ, బాగు చేస్తూ ఉండే పనివారికి తనిఖీదారులు ఆ డబ్బును జీతంగా ఇచ్చారు.
11 యూదా రాజులు పాడైపోనిచ్చిన కట్టడాలకోసం చెక్కిన రాళ్ళనూ, దూలాలనూ, జోడింపు పనికి మ్రానులనూ కొనడానికి వడ్రంగులకూ, కట్టేవారికీ కూడా డబ్బిచ్చారు. 12 ఆ మనుషులు నమ్మకంగా✽ పని చేశారు. వారిమీద తనిఖీదారులుగా ఉన్నవారు ఎవరంటే, మెరారి వంశంలో లేవీగోత్రికులు యహతు, ఓబద్యా; కహాతు వంశంవారు జెకర్యా, మెషుల్లాం. పని నడిపించడానికి ఏర్పాటైన లేవీగోత్రికులందరూ వాయిద్యాలు వాయించడంలో ఆరితేరినవారు. 13 వారు బరువులు మోసేవారిమీదా, ప్రతిరకమైన పనీ చేసే వారిమీదా తనిఖీదారులుగా ఉన్నారు. లేవీగోత్రికులలో కొంతమంది లేఖకులుగా, కార్యదర్శులుగా, ద్వారపాలకులుగా సేవ చేసేవారు.
14 యెహోవా ఆలయంలోకి తేబడ్డ డబ్బును వారు బయటికి తీసుకువస్తూ ఉన్నప్పుడు, యెహోవా మోషేద్వారా అనుగ్రహించిన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం హిల్కీయాయాజికి కనిపించింది. 15 హిల్కీయా లేఖకుడైన షాఫానుతో “యెహోవా ఆలయంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది” అన్నాడు. ఆ గ్రంథం షాఫాను చేతికిచ్చాడు.
16 షాఫాను ఆ గ్రంథం రాజుదగ్గరికి తీసుకువెళ్ళి ఇలా తెలియజెప్పాడు: “నీ సేవకులకు నీవు అప్పచెప్పిన పనులన్నీ వారు చేస్తున్నారు. 17 వారు యెహోవా ఆలయంలో ఉన్న డబ్బును జమ చేసి, ఆలయంలో పని చేస్తున్న తనిఖీదారుల చేతికీ పనివారి చేతికీ ఇచ్చారు.” 18 హిల్కీయాయాజి తనకు ఒక గ్రంథం ఇచ్చాడని కూడా రాజుకు చెప్పి, లేఖకుడైన షాఫాను దానిని రాజు ఎదుట చదివి వినిపించాడు.
19 ✝ధర్మశాస్త్రం మాటలు విన్నప్పుడు రాజు తన బట్టలు చింపుకొన్నాడు. 20 తరువాత రాజు హిల్కీయాకు, షాఫాను కొడుకు అహీకాంకు, మీకా కొడుకు అబదోనుకు, లేఖకుడైన షాఫానుకు, అశాయా అనే తన సన్నిహిత సేవకుడికి ఇలా ఆజ్ఞాపించాడు: 21 “మీరు వెళ్ళి, దొరికిన ఈ గ్రంథంలో ఉన్న మాటలను గురించి నాకోసం ఇస్రాయేల్‌లో యూదాలో మిగిలిన వారికోసం యెహోవాదగ్గర విచారణ చేయండి. యెహోవా మనమీద కుమ్మరించిన కోపం✽ అధికం. ఎందుకంటే, మన పూర్వీకులు యెహోవా వాక్కును పాటించలేదు, ఈ గ్రంథంలో వ్రాసినవాటన్నిటి ప్రకారం ప్రవర్తించలేదు.”
22 జెరుసలంలో ఉన్న రెండో భాగంలో దేవునిమూలంగా పలికే స్త్రీ ఒకతె ఉంది. ఆమె షల్లూం భార్య హుల్దా (షల్లూం తికవా కొడుకు, హరహాషు మనుమడు. అతడు వస్త్రశాల అధికారి). హిల్కీయా, అతనితో కూడా రాజు పంపినవారు హుల్దా దగ్గరికి వెళ్ళి, ఆ సంగతిని గురించి ఆమెతో మాట్లాడారు. 23 ఆమె వారితో ఇలా చెప్పింది: “మిమ్మల్ని నాదగ్గరికి పంపినవానికి ఈ మాట తెలియజేయండి – 24 యెహోవా చెప్పేదేమిటంటే, ‘వినండి! యూదా రాజు సమక్షంలో చదివి వినిపించిన గ్రంథంలో వ్రాసి ఉన్న శాపాలన్నిటినీ✽ విపత్తునూ నేను ఈ స్థలంమీదికి, దీని కాపురస్థుల మీదికి రప్పిస్తాను. 25 ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టి, వేరే దేవుళ్ళకు ధూపం వేశారు. వారు చేతులతో చేసిన పనులన్నిటివల్ల నాకు కోపం రేపారు. అందుకనే ఈ స్థలంమీద నా కోపాగ్ని కుమ్మరిస్తాను. అది ఆరదు కూడా! 26 యెహోవాదగ్గర విచారణ చేయడానికి మిమ్మల్ని పంపిన యూదా రాజుతో ఇలా చెప్పండి: ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, నీవు నా మాటలు విన్నావు. 27 ఈ స్థలానికీ దీని కాపురస్థులకూ వ్యతిరేకంగా దేవుడు చెప్పిన మాటలు విని నీవు మెత్తని మనస్సుతో నా సముఖంలో తగ్గించుకొన్నావు✽. నీ బట్టలు చింపుకొని నా ఎదుట ఏడ్చావు. గనుక నీ ప్రార్థన విన్నాను.’ యెహోవా ఇలా చెపుతున్నాడు: 28 ‘నేను నిన్ను నీ పూర్వీకులదగ్గరికి చేరుస్తాను. శాంతితో నీవు నీ సమాధికి చేరుతావు. నేను ఈ స్థలంమీదికీ దాని కాపురస్థుల మీదికీ రప్పించే విపత్తుతో ఏమీ నీ కంటికి కనబడదు’.”
29 ✝అప్పుడు రాజు యూదాలోనూ జెరుసలంలోనూ ఉన్న పెద్దలందరినీ పిలిపించాడు. 30 అప్పుడు రాజు యెహోవా ఆలయానికి వెళ్ళాడు. అతనితో కూడా యూదా మనుషులంతా, జెరుసలం నగరవాసులంతా, యాజులు, లేవీగోత్రికులు, ఘనులే గానీ అల్పులే గానీ అయిన ప్రజలంతా వెళ్ళారు. అక్కడ వారంతా వినేలా యెహోవా ఆలయంలో దొరికిన ఒడంబడిక గ్రంథంలో ఉన్న మాటలన్నీ రాజు చదివి వినిపించాడు. 31 ✝ఆ తరువాత రాజు ఒక స్తంభం దగ్గర నిలుస్తూ, యెహోవాను అనుసరిస్తామని యెహోవా సన్నిధానంలో ఒప్పందం చేశాడు. దొరికిన గ్రంథంలో వ్రాసి ఉన్న ఒడంబడిక మాటలన్నీ నెరవేర్చడానికి యెహోవా ఆజ్ఞలను, శాసనాలను, చట్టాలను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అనుసరిస్తామని ఒప్పందం చేశాడు. 32 అప్పుడు జెరుసలంలో, బెన్యామీనులో ఉన్న వారందరినీ ఆ ఒప్పందానికి సమ్మతించేలా చేశాడు. జెరుసలం వాసులు దేవుని – తమ పూర్వీకుల దేవుని – ఒడంబడిక ప్రకారం అలా చేశారు.
33 యోషీయా ఇస్రాయేల్ ప్రజలకు✽ చెందిన ప్రాంత మంతటిలోనుంచి విగ్రహాలన్నిటినీ✽ తీసివేశాడు. అవి అసహ్యమైనవి. ఇస్రాయేల్‌లో ఉన్న వారందరినీ తమ దేవుడు యెహోవాను సేవించేలా చేశాడు. అతడు బ్రతికినన్నాళ్ళు వారు తమ పూర్వీకుల✽ దేవుడు యెహోవాను అనుసరించడం మానలేదు.