33
1 ✝మనష్షే రాజయినప్పుడు అతడి వయస్సు పన్నెండేళ్ళు. అతడు జెరుసలంలో యాభై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. 2 అతడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. ఇస్రాయేల్ ప్రజల దగ్గరనుంచి యెహోవా వెళ్ళగొట్టిన జనాల తీరు అనుసరించి నీచ కార్యాలు చేసేవాడు. 3 తన తండ్రి హిజ్కియా పడగొట్టిన ఎత్తయిన పూజాస్థలాలను అతడు తిరిగి కట్టించాడు. బయల్‌దేవుడికి బలిపీఠాలు కట్టించాడు. అషేరాదేవి స్తంభాలు నిలిపాడు, సూర్య చంద్ర నక్షత్రాల సమూహాన్ని పూజించి కొలిచాడు. 4 యెహోవా తన ఆలయాన్ని ఉద్దేశించి “జెరుసలంలో నా పేరు ఎప్పటికీ ఉంటుంద”ని చెప్పిన ఆలయంలో కూడా మనష్షే వేరు వేరు బలిపీఠాలను కట్టించాడు. 5 యెహోవా ఆలయం రెండు ఆవరణాలలో సూర్యచంద్ర నక్షత్రాల సమూహానికి అతడు బలిపీఠాలను కట్టించాడు. 6 బెన్‌హిన్నోం లోయలో తన కొడుకులను మంట గుండా✽ దాటించాడు. శకునాలు చూడడం, సోదె వినడం అభ్యాసం చేసుకొన్నాడు. మంత్రవిద్య ప్రయోగించాడు. కర్ణపిశాచం ఉన్న వ్యక్తులను, పూనకం వచ్చి పలికే వ్యక్తులను సంప్రదించాడు. అతడు యెహోవా దృష్టిలో చాలా చెడ్డగా ప్రవర్తిస్తూ, యెహోవాకు కోపం రేపాడు. 7 యెహోవా తన ఆలయాన్ని గురించి దావీదుకూ, అతని కొడుకు సొలొమోనుకూ “ఇస్రాయేల్ గోత్రాలన్నిటిలో నేను ఎన్నుకొన్న జెరుసలంలో, ఈ దేవాలయంలో నా పేరు ఎప్పుడూ ఉంచుతాను” అని చెప్పిన ఆ దేవాలయంలోనే మనష్షే విగ్రహాన్ని చెక్కించి ఉంచాడు.8 యెహోవా “నేను ఇస్రాయేల్ ప్రజలను మోషేద్వారా ఇచ్చిన అన్ని ఉపదేశాలు, చట్టాలు, న్యాయ నిర్ణయాలను అనుసరించి వారు శ్రద్ధతో ప్రవర్తిస్తూ ఉంటే, నేను వారి పూర్వీకులకు నియమించిన ఈ దేశం నుంచి వారిని తొలగించను” అన్నాడు. 9 అయితే మనష్షే యూదావారిని, జెరుసలం ప్రజలను తప్పుదారి పట్టించి ఇస్రాయేల్ ప్రజల ముందు నుంచి యెహోవా నాశనం చేసిన జనాలకంటే ఎక్కువ దుర్మార్గం చేసేలా వారిని పురికొలిపాడు.
10 యెహోవా మనష్షేకు, అతడి ప్రజలకు తన వాక్కు పంపాడు గాని వారు పెడచెవిని పెట్టారు. 11 అందుచేత యెహోవా అష్షూరు రాజు సైన్యాధిపతులను అతడిపైకి రప్పించాడు. వాళ్ళు మనష్షేను బందీగా పట్టుకొని, అతడి ముక్కుకు కొక్కెం✽ తగిలించి, కంచు గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకుపోయారు. 12 ✽బాధతో అతడు తన పూర్వీకుల దేవుని ఎదుట చాలా వినయంగా మెడ వంచుకొన్నాడు.✽ తన దేవుడైన యెహోవాను దయ చూపమని ప్రాధేయపడ్డాడు. 13 అతడు ప్రార్థించినప్పుడు యెహోవా అతడి విన్నపం ఆలకించి అతడి ప్రార్థన అంగీకరించాడు. అతడు జెరుసలంకు, అతడి రాజ్యానికి తిరిగి వచ్చేలా చేశాడు. అప్పుడు యెహోవాయే దేవుడు అని మనష్షే తెలుసుకొన్నాడు.
14 ఇది జరిగిన తరువాత మనష్షే లోయలోని గీహోను ఊటకు పడమరగా ఉన్న దావీదు నగర ప్రాకారాన్ని “చేపల ద్వారం” వరకు, ఓపెల్ కొండ చుట్టు కట్టించాడు. దానిని చాలా ఎత్తు చేశాడు. యూదాలో కోటలూ గోడలూ గల ప్రతి పట్టణంలో అతడు సైనిక అధికారులను ఉంచాడు. 15 ✽అతడు యెహోవా ఆలయంలోనుంచి విదేశీయ దేవుళ్ళనూ ఆ విగ్రహాన్నీ తొలగించాడు. జెరుసలంలో, యెహోవా ఆలయం ఉన్న కొండమీద తాను కట్టించిన బలిపీఠాలను తీసివేశాడు. నగరం వెలుపలికి వాటిని పారవేయించాడు. 16 అప్పుడతడు యెహోవా బలిపీఠాన్ని మరమ్మత్తు చేయించి, దానిమీద శాంతి బలులు, కృతజ్ఞత అర్పణలు✽ అర్పించాడు. ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవానే సేవించాలని యూదా ప్రజను ఆదేశించాడు. 17 అయినా ప్రజలు ఇంకా ఎత్తయిన పూజాస్థలాలలో బలులు అర్పిస్తూనే ఉన్నారు గాని అవి వారి దేవుడైన యెహోవాకే అర్పించారు.
18 మనష్షే గురించిన ఇతర విషయాలు, అతడు తన దేవునికి చేసిన ప్రార్థన, ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా పేర అతనితో మాట్లాడిన దీర్ఘదర్శుల మాటలు, అవన్నీ ఇస్రాయేల్ రాజుల గ్రంథం✽లో వ్రాసి ఉన్నాయి. 19 అతడు చేసిన ప్రార్థన, దేవుడు అతని విన్నపం ఎలా ఆలకించినది, వినయంగా మెడ వంచుకోకముందు అతడి పాపాలన్నీ, అతడు చేసిన ద్రోహం, కట్టించిన ఎత్తయిన పూజాస్థలాలచోట్లు, అషేరాదేవి స్తంభాలనూ చెక్కిన విగ్రహాలనూ నిలిపిన చోట్లు – ఇవన్నీ దీర్ఘదర్శులు✽ వ్రాసిన గ్రంథాలలో ఉన్నాయి. 20 మనష్షే కన్ను మూసి✽ తన పూర్వీకులదగ్గరికి చేరాడు. అతని నగరులోనే అతణ్ణి సమాధి చేశారు. అతడి స్థానంలో అతడి కొడుకు ఆమోను రాజయ్యాడు.
21 ✽ ఆమోను రాజయినప్పుడు అతడి వయస్సు ఇరవై రెండేళ్ళు. అతడు జెరుసలంలో రెండేళ్ళు పరిపాలించాడు. 22 తన తండ్రి మనష్షేలాగా ఆమోను యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. తన తండ్రి మనష్షే చేయించిన విగ్రహాలన్నిటికీ ఆమోను బలులు అర్పిస్తూ మ్రొక్కుతూ ఉండేవాడు. 23 అయితే తన తండ్రి మనష్షేలాగా ఆమోను యెహోవా ఎదుట వినయంతో మెడ వంచుకోలేదు. అసలు ఆమోను తన అపరాధం పెంచుకొన్నాడు. 24 ఆమోను సేవకులు అతడిమీద కుట్రపన్ని, అతడి సొంత భవనంలో అతణ్ణి చంపారు. 25 అప్పుడు దేశప్రజలు ఆమోనురాజుమీద కుట్ర పన్నినవాళ్ళను హతమార్చారు, ఆమోను స్థానంలో అతడి కొడుకు యోషీయాను రాజుగా చేశారు.