32
1 హిజ్కియా ఈ పనులను నమ్మకంగా జరిగించిన తరువాత అష్షూరు రాజు సన్‌హెరీబు✽ యూదామీదికి దండెత్తి వచ్చాడు. కోటలూ, గోడలూ ఉన్న పట్టణాలను స్వాధీనం చేసుకోవడానికి వాటిని చుట్టుముట్టాడు. 2 సన్‌హెరీబు వచ్చి జెరుసలం మీద యుద్ధం తలపెడుతున్నాడని హిజ్కియా తెలుసుకొన్నప్పుడు తన అధికారులతో, సైన్యం సిబ్బందితో సమాలోచన జరిపాడు. 3 నగరం వెలుపల ఉన్న ఊటలనుంచి నీళ్ళు సరఫరా కాకుండా చేయాలని వారు నిర్ణయానికి వచ్చారు. వారు అతనికి తోడ్పడ్డారు. 4 “అష్షూరు రాజులు వచ్చినప్పుడు వాళ్ళకు పుష్కలంగా నీళ్ళెందుకు దొరకాలి?” అని చెప్పుకొని చాలామంది ప్రజలు సమకూడి ఊటలన్నిటినీ, ఆ ప్రాంతంలో పారే కాలువను కట్టివేశారు.5 హిజ్కియా ధైర్యం తెచ్చుకొని ప్రాకారంలో పాడైన స్థలాలను తిరిగి కట్టించాడు. ప్రాకారం మీద బురుజులు కట్టించాడు. వెలుపల ఇంకో గోడను నిర్మించాడు. దావీదునగరంలో ఉన్న “మిల్లో” కోటను దిట్టం చేశాడు. అతడు చాలా ఆయుధాలు, డాళ్ళు చేయించాడు. 6 అతడు ప్రజల మీద సైనిక అధిపతులను నియమించాడు. నగరద్వారం దగ్గర ఉన్న విశాల స్థలంలో వారిని సమకూర్చి, వారిని ప్రోత్సహిస్తూ ఈ మాటలు చెప్పాడు.
7 ✝“నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. అష్షూరు రాజును అతడితో ఉన్న పెద్దసైన్యాన్ని చూచి భయపడకండి. హడలిపోకండి, మనతో ఉన్న బలం అతడితో ఉన్న బలం కంటే గొప్పది. 8 ✝అతడిది శరీర సంబంధమైన సహాయం మాత్రమే. మన సహాయం మనతో ఉన్న మన దేవుడు యెహోవా. ఆయనే మన యుద్ధాలలో పోరాడుతాడు.” యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలు ప్రజలకు ఆధారం అయ్యాయి.
9 ✝తరువాత అష్షూరు రాజైన సన్‌హెరీబు, అతడి సైన్యమంతా లాకీషును చుట్టుముట్టారు. అతడు యూదా ప్రజలందరిదగ్గరికీ తన మనుషులను ఈ కబురుతో పంపాడు: 10 “అష్షూరురాజైన సన్‌హెరీబు చెప్పేదేమిటంటే, ముట్టడితో ఉన్న జెరుసలంలో మీరు నిలిచి ఉండేట్టు మీరు నమ్ముకొన్న ఆధారం ఎంత మాత్రం? 11 ‘అష్షూరు రాజు చేతిలో నుంచి మన దేవుడు యెహోవా మనల్ని రక్షిస్తాడు’ అని హిజ్కియా చెప్తున్నాడుగా! మీరు ఆకలికీ దప్పికకూ చచ్చిపోయేట్టు మిమ్మల్ని అతడు తప్పుదారి పట్టిస్తున్నాడు. 12 హిజ్కియా తానే యెహోవా ఎత్తయిన పూజాస్థలాలను, బలిపీఠాలను తీసివేశాడు గదా! యూదావాళ్ళతో జెరుసలంవాళ్ళతో ‘ఒకే బలిపీఠం ఎదుట మీరు పూజించాలి, దానిమీదే మీరు ధూపం వేయాలి’ అంటూ ఆదేశించాడు గదా! 13 ఇతర దేశాల జనాలన్నిటినీ నేను, నా పూర్వీకులు ఏం చేశామో మీకు తెలియదా? ఆ జనాల దేవుళ్ళు వాళ్ళ దేశాన్ని ఎప్పుడైనా నా చేతినుంచి విడిపించగలిగారా? 14 నా పూర్వీకులు నాశనం చేసిన జనాల దేవుళ్ళలో ఏ దేవుడు తన జనాన్ని నా చేతి నుంచి విడిపించగలిగాడు, చెప్పండి? అలాంటప్పుడు మీ దేవుడు నా చేతినుంచి మిమ్మల్ని ఎలా విడిపిస్తాడు? 15 హిజ్కియా చేత మీరు మోసపోకండి, తప్పు దారి పట్టకండి, అతణ్ణి నమ్మకండి. ఎందుకంటే, ఏ జనం దేవుడూ, ఏ రాజ్యం దేవుడూ నా చేతినుంచి గానీ నా పూర్వీకుల చేతినుంచి గానీ తన ప్రజను విడిపించలేకపోయాడు. అలాంటప్పుడు మీ దేవుడు నా చేతినుంచి మిమ్మల్ని ఏ మాత్రం విడిపించలేకపోతాడు.”
16 సన్‌హెరీబు మనుషులు యెహోవాదేవునికి, ఆయన సేవకుడైన హిజ్కియాకు వ్యతిరేకంగా ఇంకా మాట్లాడారు.
17 ఇస్రాయేల్‌ప్రజల దేవుడైన యెహోవాను అవమాన పరచేలా ఆయనకు వ్యతిరేకంగా అష్షూరు రాజు లేఖలు కూడా వ్రాసి పంపాడు. వాటిలో “ఇతర దేశాల జనాల దేవుళ్ళు నా చేతినుంచి తమ ప్రజలను ఎలా విడిపించలేకపోయారో, అలాగే హిజ్కియా యొక్క దేవుడు కూడా తన ప్రజలను నా చేతినుంచి విడిపించలేకపోతాడు” అని వ్రాసి ఉంది. 18 జెరుసలం ప్రజలలో కొంతమంది గోడమీద ఉన్నారు. వారికి బీతి భయాలు కలిగించి నగరాన్ని పట్టుకోవాలనే ఉద్దేశంతో అష్షూరువారు యూదుల భాషలో బిగ్గరగా మాట్లాడారు. 19 ✽ లోకజనాల దేవుళ్ళ విషయం – మనుషులు చేతితో చేసిన ఆ దేవుళ్ళ విషయం మాట్లాడినట్టు జెరుసలం యొక్క దేవుని విషయం వాళ్ళు మాట్లాడారు.
20 దీన్ని గురించి హిజ్కియారాజు, ఆమోజు కొడుకూ ప్రవక్తా అయిన యెషయా యెహోవాను ప్రార్థిస్తూ ఆకాశంవైపు మొరపెట్టారు.✽ 21 ✽యెహోవా ఒక దేవదూతను పంపాడు. ఆ దేవదూత అష్షూరు రాజు శిబిరంలో శూరులను, సైన్యాధిపతులను, నాయకులను అందరినీ నాశనం చేశాడు. అష్షూరు రాజు అపకీర్తిపాలై, తన దేశానికి తిరిగి వెళ్ళి పోయాడు. అక్కడ అతడు తన దేవుడి గుడిలోకి వెళ్ళినప్పుడు అతడి సొంత కొడుకులలో కొందరు అతణ్ణి కత్తితో చంపారు.
22 అష్షూరు రాజైన సన్‌హెరీబు బారినుంచి ఇతరులందరి బారి నుంచి యెహోవా హిజ్కియారాజును, జెరుసలం ప్రజలను రక్షించాడు, అన్ని వైపులనుంచి ఆయన వారిని కాపాడాడు. 23 చాలామంది యెహోవాకు అర్పణలు, యూదా రాజు హిజ్కియాకు విలువైన వస్తువులు జెరుసలంకు తెచ్చారు. అప్పటినుంచి జనాలన్నీ అతణ్ణి ఘనంగా ఎంచాయి.
24 ఆ రోజులలో హిజ్కియాకు జబ్బు చేసింది. అతడు చావుబ్రతుకుల్లో ఉన్నాడు. అతడు యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు ఆయన అతనికి జవాబిచ్చి, సూచకమైన✽ అద్భుతం చూపించాడు. 25 ✽అయితే హిజ్కియా హృదయంలో గర్వించాడు✽. యెహోవా తనపట్ల చూపిన మంచికి తగినట్టుగా ప్రవర్తించలేదు. అందుచేత యెహోవా కోపం✽ అతనిమీద, యూదామీద, జెరుసలంమీద రవులుకొంది. 26 అయితే హిజ్కియా, జెరుసలంవారు తమ హృదయంలో ఉన్న గర్వాన్ని అణచుకొన్నారు✽ గనుక హిజ్కియా రోజులలో యెహోవా కోపం వారిమీదికి రాలేదు.
27 హిజ్కియాకు అత్యధిక ఐశ్వర్యం, ఘనత కలిగాయి. అతడు తన వెండి, బంగారం, విలువగల రాళ్ళు, సుగంధ ద్రవ్యాలు, డాళ్ళు, అన్ని రకాల విలువైన వస్తువులకోసం భద్రపరచే గదులను చేయించుకొన్నాడు. 28 ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, నూనె కూడబెట్టడానికి కట్టడాలను కట్టించుకొన్నాడు. ఆయా రకాల పశువులకు కొట్టాలు, మందలకు దొడ్లు కట్టించుకొన్నాడు. 29 దేవుడు అతనికి మహా గొప్ప సంపద ఇచ్చాడు. గనుక అతడు ఊళ్ళను కూడా కట్టించుకొన్నాడు. ఎన్నో మందలు, పశువులు సంపాదించు కొన్నాడు. 30 గీహోను ఊటమీది కాలువకు ఆనకట్ట కట్టించినది హిజ్కియాయే. ఆ నీళ్ళు దావీదునగరం పడమటి దిక్కుకు మళ్ళించాడు. హిజ్కియా జరిగించిన ప్రతి పనిలోనూ వర్ధిల్లాడు. 31 తరువాత ఆ దేశంలో జరిగిన అద్భుతాన్ని గురించి తెలుసుకోవడానికి బబులోను పరిపాలకులు రాయబారులను పంపారు. హిజ్కియా హృదయంలో ఏమి ఉన్నదో అదంతా గుర్తించాలని దేవుడు అతణ్ణి పరీక్ష✽కు గురి కానిచ్చాడు.
32 హిజ్కియాను గురించిన ఇతర విషయాలు, భక్తితో చేసిన క్రియలు “ఆమోజు కొడుకైన యెషయా ప్రవక్త దర్శనం”లో, యూదా, ఇస్రాయేల్ రాజుల గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 33 హిజ్కియా కన్ను మూసి✽ తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. దావీదు వంశంవారి సమాధులున్న భూమిమీది భాగంలో ప్రజలు అతణ్ణి సమాధి చేశారు. అతడు చనిపోయినప్పుడు యూదావారంతా, జెరుసలం నగరవాసులంతా అతణ్ణి గౌరవించారు. అతని స్థానంలో అతని కొడుకు మనష్షే రాజయ్యాడు.