31
1 ✝ఇదంతా ముగిసిన తరువాత అక్కడ ఉన్న ఇస్రాయేల్ ప్రజలంతా యూదా పట్టణాలకు వెళ్ళి విగ్రహాలను చితుకగొట్టి, అషేరాదేవి స్తంభాలను నరికివేసి, ఎత్తయిన పూజాస్థలాలనూ, బలిపీఠాలనూ పడగొట్టారు. వారు యూదాలో బెన్యామీనులో అంతటా ఎఫ్రాయిం, మనష్షేలలో కూడా అలా చేశారు. వాటన్నిటినీ పాడు చేశాక ఇస్రాయేల్‌ప్రజలు తమ సొంత పట్టణాలకు, ఆస్తుల దగ్గరికి వెళ్ళిపోయారు.2 హిజ్కియా యాజులకు, లేవీగోత్రికులకు వారి వారి సేవాధర్మం ప్రకారం వరుసలను✽ నియమించాడు. వారు వారి సేవాధర్మాలు జరిగించాలని, హోమబలులు, శాంతి బలులు అర్పించాలని, ఇతర పరిచర్యలు చేయాలని, యెహోవా శిబిర✽ ద్వారాల దగ్గర కృతజ్ఞతలు, స్తుతులు అర్పించాలని హిజ్కియా వారిని నియమించాడు. 3 యెహోవా ధర్మశాస్త్రంలో వ్రాసిన ప్రకారం ఉదయం, సాయంకాలం అర్పించవలసిన✽ హోమబలులకోసం, విశ్రాంతి దినాలూ అమావాస్య రోజులూ నియామకమైన పండుగల కాలాలూ అర్పించవలసిన హోమబలులకోసం రాజు తన సొంత ఆస్తినుంచి ఇచ్చాడు. 4 ✝యాజులు, లేవీగోత్రికులు యెహోవా ధర్మశాస్త్రంలో వ్రాసి ఉన్న సేవ శ్రద్ధగా జరిగించేలా, వారికి చెందవలసిన భాగం ఇవ్వాలని రాజు జెరుసలం నగరవాసులను ఆదేశించాడు. 5 ✝అలా ఆజ్ఞ జారీ చేయడంతోనే ఇస్రాయేల్ ప్రజలు కానుకలు ధారాళంగా ఇచ్చారు. ధాన్యంలో మొదటి పంట, క్రొత్త ద్రాక్షరసంలో, నూనెలో, తేనెలో, పొలంలో పండేవాటిలో, కలిగిన వాటన్నిటిలో పదో భాగాన్ని వారు తెచ్చారు. అది చాలా పెద్ద మొత్తం. 6 యూదా ఊళ్ళలో కాపురం ఉంటున్న యూదావారు, ఇస్రాయేల్‌వారు తమ పశువుల మందలోనుంచి, గొర్రెల, మేకల మందలలోనుంచి పదో భాగాన్ని తెచ్చారు. తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ చేసిన పవిత్ర వస్తువులలోనుంచి కూడా పదో భాగాన్ని తెచ్చారు. వాటిని కుప్పలుగా పేర్చారు. 7 ✽ఈ విధంగా చేయడం వారు మూడో నెలలో ఆరంభించారు, ఏడో నెలలో ముగించారు. 8 ✽హిజ్కియా, అతని అధికారులు వచ్చి ఆ కుప్పలు చూచినప్పుడు వారు యెహోవాను స్తుతించారు, ఆయనకు చెందిన ఇస్రాయేల్ ప్రజను దీవించారు. 9 హిజ్కియా యాజులను, లేవీగోత్రికులను ఆ కుప్పలను గురించి అడిగాడు. 10 ✝సాదోకు వంశంవాడూ ప్రముఖ యాజీ అయిన అజర్యా అతనికి ఇలా జవాబిచ్చారు:
“యెహోవా ఆలయానికి ప్రజలు కానుకలు తీసుకురావడం ఆరంభించినప్పటినుంచి మాకు తినడానికి సమృద్ధిగా ఉంది. యెహోవా తన ప్రజకు ఆశీస్సులు ప్రసాదించాడు గనుక చాలా మిగిలిపోయింది కూడా. అదే ఈ కుప్పలు.”
11 అప్పుడు యెహోవా ఆలయంలో గదులు తయారు చేయాలని హిజ్కియా ఆదేశించాడు. వారు అలాగే చేశారు. 12 ఆ తరువాత కానుకలను, పదో భాగాలను, ప్రతిష్ఠ చేసిన వస్తువులను నమ్మకంగా✽ లోపలికి తెచ్చారు. వాటిమీద కొననయా అనే లేవీగోత్రికుడు అధికారిగా ఉన్నాడు. అతని సోదరుడు షిమీ రెండోవాడు. 13 కొననయా చేతిక్రింద, అతని సోదరుడు షిమీ చేతిక్రింద తనిఖీ చేసేవారుగా యెహీయేల్, అజజయా, నహతు, అశాహేల్, యెరీమోతు, యోజాబాదు, ఏలీయేల్, ఇసమకయా, మహతు, బెనాయా అనే వారున్నారు. హిజ్కియారాజు, దేవుని ఆలయానికి అధికారిగా ఉన్న అజర్యా వారిని నియమించారు. 14 ఇమ్నా కొడుకు కోరే అనే లేవీగోత్రికుడు తూర్పు ద్వారానికి పాలకుడు. ప్రజలు దేవునికి స్వేచ్ఛగా అర్పించిన అర్పణలమీద అతడు అధికారిగా ఉన్నాడు. ప్రజలు యెహోవాకు తెచ్చిన కానుకలను, అతి పవిత్ర వస్తువులను పంచిపెట్టడం అతని పని. 15 అతని చేతిక్రింద ఏదెను, మిన్‌యామీను, యేషువ, షెనుయా, అమరయా, షెకనయా అనేవారున్నారు. యాజుల పట్టణాలలో తమ సాటి యాజులకు – పెద్దలనీ, పిన్నలనీ ఏమీ భేదం చూపకుండా – వారి వారి వరుసక్రమాల ప్రకారం వారి భాగాలను నమ్మకంగా పంచిపెట్టారు. 16 అంతేగాక, మూడేళ్ళు, ఆపైన వయస్సుండి, వంశవృక్షాలలో నమోదైన మగపిల్లలకు కూడా వారు పంచిపెట్టారు. వారి వారి వరుసల ప్రకారం, బాధ్యతల ప్రకారం సేవ చేయడానికి ప్రతి రోజూ యెహోవా ఆలయంలోకి వచ్చేవారందరికీ కూడా వారి భాగాలను పంచిపెట్టారు. 17 వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం వంశవృక్షాలలో నమోదైన యాజులకూ, వారి వారి పనుల ప్రకారం, వరుసల ప్రకారం, ఇరవై ఏళ్ళు, అంతకంటే పై వయస్సున్న లేవీగోత్రికులకూ కూడా వారు పంచిపెట్టేవారు. 18 వారు నమ్మకంగా తమను దేవునికి ప్రతిష్ఠ చేసుకొన్నారు గనుక ఆ వంశవృక్షాలలో ఉన్నవారందరి పనివాళ్ళు, భార్యలు, కొడుకులు, కూతుళ్ళకోసం కూడా పంచిపెట్టారు. 19 ✝తమ పట్టణాల చుట్టుపట్ల భూములలో, ఇతర ఊళ్ళలో అహరోను సంతానమైన యాజులు కొందరు కాపురముండేవారు. వారిలో మగ వారందరికీ, వంశవృక్షాలలో నమోదైన లేవీగోత్రికులందరికీ వారి భాగాలను పంచడానికి పేరు పేరున మనుషులను నియమించారు.
20 హిజ్కియా ఆ విధంగా యూదా అంతటా జరిగించాడు. యెహోవా దృష్టిలో సరిగా, యథార్థంగా, నమ్మకంగా ప్రవర్తించాడు. 21 యెహోవా ఆలయం సేవకోసం, ధర్మశాస్త్రం ఆజ్ఞలకోసం మొదలుపెట్టిన ప్రతి పనిలోనూ అతడు తన దేవుణ్ణి వెదకి అనుసరించాడు. మనసారా పని చేశాడు గనుక వర్ధిల్లాడు✽.