30
1 ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించడానికి జెరుసలంలో యెహోవా ఆలయానికి రమ్మని హిజ్కియా ఇస్రాయేల్ ప్రజలకూ యూదా ప్రజలకూ అందరికీ కబురు పంపాడు. ఎఫ్రాయిం, మనష్షే గోత్రాలకు కూడా లేఖలు వ్రాసి పంపాడు. 2 ఆ పండుగ దాని నియామక కాలంలో జరపలేకపోయారు. ఎందుకంటే, అప్పుడు తమను తాము పవిత్రం చేసుకొన్న యాజులు చాలినంతమంది లేరు, ప్రజలంతా జెరుసలంలో సమకూడలేదు. 3 గనుక రెండో నెలలో పస్కాపండుగ చేద్దామని రాజు, అతని అధికారులు, జెరుసలంలో ఉన్న సమాజమంతా నిర్ణయించారు. 4 ఆ విషయం రాజుకూ, సమాజం వారందరికీ అంగీకారం. 5 చాలా కాలం నుంచి లేఖనం ప్రకారం ప్రజలు ఆ పండుగ ఆచరించలేదు. గనుక వారు బేర్‌షెబానుంచి దానువరకు ఇస్రాయేల్‌దేశం అంతటా ప్రకటన చేసి ప్రజలను ఇస్రాయేల్‌వారి దేవుడు యెహోవాకు పస్కాపండుగ ఆచరించడానికి జెరుసలంకు ఆహ్వానించాలని నిర్ణయానికి వచ్చారు. 6 రాజు, అతని అధికారులు వ్రాసిన లేఖలతో వార్తాహరులు రాజాజ్ఞప్రకారం యూదా, ఇస్రాయేల్ ప్రాంతాలంతటా వెళ్ళారు. ఆ లేఖలలో ఇలా వ్రాసి ఉంది:
“ఇస్రాయేల్ ప్రజలారా, మీరు అష్షూరు రాజు చేతిలోనుంచి తప్పించుకొని మిగిలారు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు యెహోవా మీవైపుకు తిరిగేలా మీరు ఆయనవైపు తిరగండి. 7 మీ పూర్వీకులు, మీ సోదరులు వారి పూర్వీకుల దేవుడు యెహోవామీద ద్రోహం చేశారు. అందుచేత ఆయన వారిని నాశనానికి గురి చేశాడు. అది మీకు కనిపించిన విషయమే. మీరు వారిలాంటివారు కాకండి. 8 మీ పూర్వీకులలాగా తలబిరుసుగా ప్రవర్తించకండి. యెహోవాకు విధేయులు కండి. ఆయన ఎప్పటికీ పవిత్రం చేసిన పవిత్రాలయానికి రండి. మీ దేవుడు యెహోవా తీవ్ర కోపం మీమీదనుంచి మళ్ళేట్టు ఆయనను సేవించండి. 9 ఒకవేళ మీరు యెహోవావైపు తిరిగితే, మీ సోదరులను, సంతానాన్ని బందీలుగా తీసుకుపోయినవాళ్ళు వారిమీద జాలి చూపుతారు; వారు ఈ దేశానికి తిరిగి రాగలుగుతారు. మీ దేవుడు యెహోవా దయగలవాడు, కరుణామయుడు గనుక మీరు ఆయనవైపు తిరిగితే ఆయన మీ వైపు నుంచి తన ముఖం త్రిప్పుకోడు.”
10 వార్తాహరులు ఎఫ్రాయింలో, మనష్షేలో, పట్టణం తరువాత పట్టణం జెబూలూను ప్రదేశం వరకు వెళ్ళారు. అయితే ఆ ప్రజలు వారిని తృణీకరించి నవ్వులపాలు చేశారు. 11 కాని, ఆషేరు, మనష్షే, జెబూలూను గోత్రాలలో కొంతమంది వినయభావం కలిగి జెరుసలం వచ్చారు. 12 యెహోవా ఆదేశం ప్రకారం రాజు, అతని అధికారులు ఆజ్ఞాపించినవాటిని నెరవేర్చేలా యెహోవా హస్తం యూదావారి మీద ఉంది. ఆయన వారికి ఏక మనస్సు కలిగించాడన్నమాట.
13 రెండో నెలలో పొంగని రొట్టెల పండుగ ఆచరించడానికి ప్రజలు గొప్ప సమూహంగా జెరుసలంలో సమకూడారు. 14 జెరుసలంలో ఉన్న ఇతర బలిపీఠాలను వారు తొలగించారు. ధూపవేదికలను తీసివేసి కిద్రోను లోయలో పడవేశారు. 15 రెండో నెల పద్నాలుగో రోజున వారు పస్కాబలి గొర్రెపిల్లను వధించారు. యాజులు, లేవీగోత్రికులు సిగ్గుపడి, తమను పవిత్రం చేసుకొని, యెహోవా ఆలయానికి హోమబలులు తెచ్చారు. 16 దేవుని మనిషి అయిన మోషేయొక్క ఉపదేశం ప్రకారం వారిని నియమించిన స్థలంలో యథావిధిగా వారు నిలబడ్డారు. లేవీగోత్రికులు యాజుల చేతికి బలిరక్తం అందించినప్పుడు దానిని వారు చల్లారు. 17 ఆ గుంపులో తమను శుద్ధం చేసుకోనివారు చాలామంది ఉన్నారు. అశుద్ధంగా ఉండి, తమ పస్కాబలి గొర్రెపిల్లలను యెహోవాకు ప్రతిష్ఠ చేయలేని ఆ వ్యక్తులందరికోసం లేవీగోత్రికులు వాటిని వధించవలసివచ్చింది. 18 ఎఫ్రాయిం, మనష్షే, ఇశ్శాకారు, జెబూలూను ప్రదేశాలనుంచి వచ్చినవారిలో చాలామంది తమను శుద్ధి చేసుకోలేదు. అయినా లేఖనాల విరుద్ధంగా వారు పస్కాను తిన్నారు. వారికోసం హిజ్కియా ఇలా ప్రార్థన చేశాడు:
“యెహోవా దయామయుడు. 19 పవిత్రాలయం నియమాల ప్రకారం అశుద్ధంగా ఉన్నవారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను వెదికితే అలాంటి వారందరినీ యెహోవా క్షమిస్తాడు గాక!” 20 యెహోవా హిజ్కియా ప్రార్థన విని ప్రజను బాగు చేశాడు.
21 జెరుసలంలో హాజరైన ఇస్రాయేల్‌వారు మహానందంతో పొంగని రొట్టెల పండుగ ఏడు రోజులు ఆచరించారు. ప్రతి రోజూ లేవీగోత్రికులు, యాజులు యెహోవాకు పాటలు పాడారు, యెహోవాను స్తుతిస్తూ వాయిద్యాలు వాయించారు. 22 యెహోవా సేవ విషయంలో మంచి తెలివితేటలు చూపిన లేవీగోత్రికులందరితో హిజ్కియా ప్రోత్సాహకరమైన మాటలు పలికాడు. ఏడు రోజులు వారు తమ నియమిత భాగాలు తింటూ, శాంతి బలులు అర్పిస్తూ, తమ పూర్వీకుల దేవుడు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు.
23 యూదా రాజైన హిజ్కియా సమకూడినవారికి వెయ్యి ఎద్దులను, ఏడు వేల గొర్రెలను ఇచ్చాడు. అధికారులు వెయ్యి ఎద్దులను, పదివేల గొర్రెలను ఇచ్చారు. యాజులు చాలామంది తమను పవిత్రం చేసుకొన్నారు. 24 గనుక మరో ఏడు రోజులు పండుగ జరపాలని సమకూడినవారంతా నిర్ణయానికి వచ్చారు. అలాగే ఇంకా ఏడు రోజులు సంతోషంతో పండుగ జరుపుకొన్నారు. 25 సమకూడిన యూదావారంతా, యాజులు, లేవీగోత్రికులు ఇస్రాయేల్ నుంచి వచ్చి సమకూడినవారంతా, మునుపు యూదాకు వచ్చి అక్కడ కాపురం ఉంటున్న ఇస్రాయేల్ వారంతా సంతోషించారు. 26 జెరుసలంలో ఎంతో సంతోషం ఉంది. ఇస్రాయేల్ రాజైన దావీదు కొడుకు సొలొమోను కాలంనుంచి అంతవరకు జెరుసలంలో ఇలాంటిది జరగలేదు. 27 యాజులు, లేవీగోత్రికులు నిలిచి ప్రజలను దీవించారు. వారి ప్రార్థన యెహోవా పవిత్ర నివాసమైన పరలోకానికి చేరింది. ఆయన వారి ప్రార్థన విన్నాడు.