29
1 ✽ హిజ్కియా రాజయినప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు. అతడు జెరుసలంలో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అబీయా. ఆమె జెకర్యా కూతురు. 2 అతడు తన పూర్వీకుడు దావీదులాగే యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించేవాడు.3 అతడు తన పరిపాలనలో మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా ఆలయం ద్వారాలను తెరిచాడు. వాటిని మరమ్మత్తు చేయించాడు. 4 అప్పుడు అతడు యాజులను, లేవీగోత్రికులను పిలిపించి, వారిని ఆలయం తూర్పున ఉన్న విశాల స్థలంలో సమకూర్చాడు. 5 అతడు వారితో ఇలా చెప్పాడు:
“లేవీగోత్రికులారా! నేను చెప్పేది వినండి. ఇప్పుడు మిమ్ములను మీరు పవిత్రం చేసుకొని✽, మీ పూర్వీకుల దేవుడైన యెహోవా ఆలయాన్ని పవిత్రం చేయండి. పవిత్ర స్థలంలోనుంచి అపవిత్రమైన ప్రతిదానినీ తీసివేయండి. 6 ✝మన తండ్రులు యెహోవామీద ద్రోహం చేశారు. మన దేవుడైన యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించారు. ఆయనను విడిచిపెట్టారు. ఆయన నివాస స్థలం వైపు నుంచి ముఖం త్రిప్పుకొని వారి వీపులు చూపారు. 7 వసారా తలుపులు మూసివేశారు. దీపాలను ఆర్పివేశారు. ఇస్రాయేల్ ప్రజల దేవునికి పవిత్రాలయంలో ధూపం వేయకుండా, హోమబలులు చేయకుండా ఉన్నారు. 8 అందుచేత యెహోవా కోపం✽ యూదామీద, జెరుసలంమీద రవులుకొంది. ఆయన ఈ ప్రజలను బీతి భయాలకు, తిరస్కారానికి✽ గురి చేశాడు. ఇది మీరు చూడగలుగుతున్నారు గదా. 9 ✝మన తండ్రులు ఖడ్గంతో కూలినదీ, మన కొడుకులూ కూతుళ్ళూ భార్యలూ బందీలుగా వెళ్ళినదీ అందుకే. 10 ✽ ఇప్పుడు ఆయన కోపం మన మీదనుంచి మళ్ళేట్టు ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవాతో ఒడంబడిక చేయాలని ఉద్దేశించాను. 11 ✝నా కుమారులారా! తనకు పరిచారకులుగా ఉండి ధూపం వేయాలనీ, తన ఎదుట నిలబడి సేవ జరిగించాలనీ యెహోవా మిమ్ములను ఎన్నుకొన్నాడు. గనుక ఈ సమయంలో మీరు అశ్రద్ధ చేయకండి.”
12 అప్పుడు ఈ లేవీగోత్రికులు పనికి సంసిద్ధులయ్యారు: కహాతు వంశంలో అమాశై కొడుకు మహతు, అజరయా కొడుకు యోవేల్; మెరారి వంశంలో అబదీ కొడుకు కీషు, యెహల్లేలేల్ కొడుకు అజరయా; గెర్షోను వంశంలో జిమ్మా కొడుకు యోవాహు, యోవాహు కొడుకు ఏదేను; 13 ఎలీషాపాను సంతానంలో షిమ్రీ, యెహీయేల్; ఆసాపు సంతానంలో జెకర్యా, మత్తనయా; 14 హేమాను సంతానంలో యెహీయేల్, షిమయా; యెదూతూను సంతానంలో షెమయా, ఉజ్జీయేల్. 15 ✽వారు తమ సాటి గోత్రం వారిని సమకూర్చి తమను పవిత్రం చేసుకొన్నారు. అప్పుడు, యెహోవా మాట మేరకు రాజు ఆదేశించిన ప్రకారం, యెహోవా ఆలయం శుద్ధి చేయడానికి లోపలికి వెళ్ళారు. 16 యెహోవా గర్భగృహాన్ని శుద్ధి చేయడానికి యాజులే అక్కడికి వెళ్ళారు. యెహోవా ఆలయంలో కనిపించిన అశుద్ధమైన ప్రతిదానినీ వారు యెహోవా ఆలయంనుంచి ఆవరణంలోకి తెచ్చారు. లేవీగోత్రికులు దాన్నంతా కిద్రోను లోయకు తీసుకువెళ్ళి పారవేశారు. 17 ✽మొదటి నెల మొదటి రోజున పవిత్రం చేయడం వారు ఆరంభించారు. ఆ నెల ఎనిమిదో రోజున యెహోవా వసారాల వరకు చేరారు. మరో ఎనిమిది రోజులు వారు యెహోవా ఆలయాన్ని పవిత్రం చేస్తూ వచ్చారు. మొదటి నెల పదహారో రోజు ఆ పని ముగించారు.
18 అప్పుడు వారు హిజ్కియారాజుదగ్గరికి వెళ్ళి ఇలా చెప్పారు: “యెహోవా ఆలయమంతా మేము శుద్ధి చేశాం. హోమ బలిపీఠాన్ని, దాని సామానంతా, సన్నిధి రొట్టెలు ఉంచే బల్లను, దాని సామానంతా కూడా శుద్ధి చేశాం. 19 ✝ఆహాజురాజు తన పరిపాలనలో ద్రోహం చేసి తొలగించిన వస్తువులన్నిటినీ కూడా సిద్ధం చేసి పవిత్రపరచాం. అవి ఇప్పుడు యెహోవా బలిపీఠం ముందు ఉన్నాయి.”
20 మరుసటి రోజు ఉదయమే లేచి హిజ్కియా నగర అధికారులను సమకూర్చి యెహోవా ఆలయానికి వెళ్ళాడు 21 వారు రాజ్యంకోసం, పవిత్రాలయంకోసం, యూదావారి కోసం బలిగా ఏడు కోడెలను, ఏడు పొట్టేళ్ళను, ఏడు గొర్రెపిల్లలను, ఏడు మేకపోతులను తెచ్చారు. అది పాపాలకోసం బలి✽. అహరోను వంశంవారైన యాజులను “యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించండి” అని రాజు ఆదేశించాడు. 22 అప్పుడు వారు కోడెలను వధించారు. యాజులు వాటి రక్తం✽ తీసుకొని బలిపీఠం మీద చల్లారు. తరువాత పొట్టేళ్ళను వధించి వాటి రక్తం బలిపీఠం మీద చల్లారు. తరువాత గొర్రెలను వధించి వాటి రక్తం బలిపీఠం మీద చల్లారు. 23 పాపాలకోసం బలిగా ఉన్న మేకపోతులను రాజు ఎదుటికి, సమకూడినవారి ఎదుటికీ తెచ్చారు. వారు వాటిమీద చేతులుంచారు✽. 24 అప్పుడు యాజులు వాటిని వధించి, ఇస్రాయేల్ ప్రజలందరి పాపాలను కప్పివేయడానికి✽ పాపాల కోసమైన బలిగా వాటి రక్తం బలిపీఠం మీద పోశారు. ఇస్రాయేల్ ప్రజలందరి విషయమూ హోమబలి, పాపాలకోసమైన బలి అర్పించాలని రాజు ఆదేశించాడు, గనుక వారు అలా చేశారు.
25 ✝మునుపు దావీదురాజు, అతని దీర్ఘదర్శి అయిన గాదు, ప్రవక్త అయిన నాతాను ఆదేశించే ప్రకారం హిజ్కియా లేవీగోత్రికులను తాళాలతో, స్వరమండలాలతో, తంతి వాద్యాలతో యెహోవా ఆలయంలో ఉంచాడు. ఇలా చేయాలని యెహోవా తన ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించాడు. 26 దావీదు చేయించిన వాద్యాలను లేవీగోత్రికులు, బూరలను యాజులు చేతపట్టుకొని నిలబడ్డారు. 27 బలిపీఠం మీద హోమబలులు✽ అర్పించండని హిజ్కియా ఆదేశించాడు. హోమబలులు అర్పించడం ఆరంభం కాగానే బూరలతో, ఇస్రాయేల్ రాజైన దావీదు యొక్క వాద్యాలతో యెహోవాకు పాటలు పాడడం కూడా ఆరంభం అయింది. 28 సమకూడినవారంతా ఆరాధిస్తూ ఉంటే, గాయకులు పాటలు పాడారు, బూరలూదారు. హోమబలి ముగిసేవరకు ఇలా జరుగుతూ ఉంది. 29 హోమబలులు ముగిసినప్పుడు రాజు, అతనితో ఉన్నవారంతా మోకరించి ఆరాధించారు✽. 30 దావీదు, దీర్ఘదర్శి అయిన ఆసాపు✽ వ్రాసిన కీర్తనలు ఎత్తి యెహోవాను స్తుతించాలని లేవీగోత్రికులకు హిజ్కియారాజు, అధికారులు ఆదేశించారు. వారు ఆనందంతో స్తుతులు గానం చేశారు. తలలు వంచి ఆరాధించారు.
31 అప్పుడు ప్రజలతో “యెహోవాకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకొన్నారు. దగ్గరికి రండి. యెహోవా ఆలయానికి బలులు, కృతజ్ఞత అర్పణలు✽ తీసుకురండి” అన్నాడు హిజ్కియా. అలాగే సమకూడినవారు బలులు, కృతజ్ఞత అర్పణలు తెచ్చారు. ఇష్టం ఉన్నవారంతా హోమబలులు కూడా తెచ్చారు. 32 సమకూడిన వారు తెచ్చిన హోమబలులు డెబ్భై ఎద్దులు, నూరు పొట్టేళ్ళు, రెండు వందల గొర్రెపిల్లలు. అవన్నీ యెహోవాకు హోమబలులు. 33 అవిగాక, వారు ప్రతిష్ఠ చేసినవి ఆరు వందల ఎద్దులు, మూడువేల గొర్రెలు. 34 యాజులు కొద్దిమందే ఉన్నారు గనుక హోమబలి పశువులన్నిటి చర్మం ఒలవలేకపోయారు. ఆ పని పూర్తి అయ్యేవరకూ, ఇతర యాజులు తమను తాము పవిత్రం చేసుకొనేవరకూ, వారి సొంత వంశీయులైన లేవీగోత్రికులు సహాయం చేశారు. యాజులకంటే లేవీగోత్రికులు తమను తాము పవిత్రం చేసుకోవడానికి యథార్థ హృదయం గలవారు. 35 హోమబలులు, వాటితో అర్పించిన పానీయార్పణలు, శాంతి బలి✽పశువుల క్రొవ్వు సమృద్ధిగా ఉన్నాయి.
ఆ విధంగా యెహోవా ఆలయంలో సేవ మళ్ళీ స్థాపించడం జరిగింది. 36 ✽దేవుడు ప్రజలకు జరిగించినదాని కారణంగా హిజ్కియా, ప్రజలంతా ఆనందించారు. ఎందుకంటే అదంతా త్వరగానే సంభవించింది.