28
1 ఆహాజు రాజయినప్పుడు అతడి వయస్సు ఇరవై సంవత్సరాలు. అతడు జెరుసలంలో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. అతడు తన పూర్వీకుడు దావీదులాగా కాక యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించేవాడు కాడు. 2 ఇస్రాయేల్ రాజుల జీవిత విధానాలనే అతడు అనుసరించేవాడు. అతడు బయల్‌దేవుడికి పోత విగ్రహాలు చేయించాడు. 3 బెన్‌ హిన్నోం లోయలో ధూపం వేశాడు. ఇస్రాయేల్ ప్రజల ఎదుటనుంచి యెహోవా ఏ జనాలనైతే వెళ్ళగొట్టాడో ఆ జనాల నీచమైన అలవాట్ల ప్రకారం చేసి, తన కొడుకులను మంటల్లో దాటించాడు. 4 అతడు ఎత్తయిన పూజాస్థలాలమీద, కొండలమీద, పచ్చని ప్రతి చెట్టు క్రింద బలులు చేస్తూ, ధూపం వేస్తూ ఉండేవాడు.
5 ఈ కారణాలచేత యెహోవా అతణ్ణి సిరియా రాజు చేతికి అప్పగించాడు. వాళ్ళు అతణ్ణి ఓడించి, అతడి ప్రజలలో చాలామందిని బందీలుగా పట్టుకొని, దమస్కుకు తీసుకుపోయారు. యెహోవా ఆహాజును ఇస్రాయేల్ రాజు చేతికి కూడా అప్పగించాడు. ఇస్రాయేల్ రాజు అతణ్ణి ఓడించాడు. 6 రెమలయా కొడుకు పెకహు ఒకే రోజున యూదాలో లక్ష ఇరవై వేలమంది యుద్ధవీరులను హతం చేశాడు. యూదావారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టినందుచేత అలా జరిగింది. 7 ఎఫ్రాయింవాడూ పరాక్రమశాలీ అయిన జిక్రీ రాజు కొడుకైన మయశేయాను చంపాడు. అతడు రాజభవనంమీద అధికారి అజ్రీకాంనూ, రాజు తరువాతివాడైన ఎల్కానానూ కూడా చంపాడు.
8 ఇస్రాయేల్‌వారు తమ సోదరులైన యూదావారి దగ్గరనుంచి వారి భార్యలనూ కొడుకులనూ కూతుళ్ళనూ రెండు లక్షలమందిని బందీలుగా తీసుకుపోయారు. వారిదగ్గరనుంచి చాలా దోపిడీ కూడా పట్టుకొని, దానిని షోమ్రోనుకు తీసుకుపోయారు.
9 షోమ్రోనులో యెహోవా ప్రవక్త ఒకడున్నాడు. అతని పేరు ఓదేదు. సైన్యం అక్కడికి తిరిగి వచ్చినప్పుడు అతడు దానికి ఎదురుగా వెళ్ళి వారితో ఇలా చెప్పాడు: “యూదావారిపై మీ పూర్వీకుల దేవుడు యెహోవా కోపించాడు. అందుకే ఆయన వారిని మీ చేతికి అప్పగించాడు. అయితే మీరు ఆకాశాన్ని అంటినంత ఆగ్రహంతో వారిని సంహారం చేశారు. 10 ఇప్పుడు యూదావారిని, జెరుసలంవారిని మీరు దాసులుగా దాసీలుగా చేసుకోవాలనుకుంటున్నారు. మీరు మాత్రం మీ దేవుడు యెహోవా ఎదుట అపరాధులు కాకుండా ఉన్నారా? 11 ఇప్పుడు నేను చెప్పేది వినండి. యెహోవా తీవ్ర కోపం మీమీద రవులుకొంది గనుక మీరు మీ సోదరులలో నుంచి బందీలుగా పట్టుకువచ్చిన వారిని విడిచిపెట్టండి.”
12 ఎఫ్రాయింవారి పెద్దలు కొంతమంది యుద్ధంనుంచి తిరిగి వస్తున్నవారికి ఎదురుగా నిలబడ్డారు. వారెవరంటే, యోహానాను కొడుకు అజరయా. మెషిల్లేమోతు కొడుకు బెరెకయా, షల్లూం కొడుకు యెహిజ్కియా, హదలాయి కొడుకు అమాశా.
13 వారు ఇలా చెప్పారు: “మీరు ఈ బందీలను లోపలికి తీసుకురాకూడదు – యెహోవా ఎదుట అపరాధులమవుతాం. మీరు మన పాపాలకూ అపరాధాలకూ ఇంకో అపరాధం చేర్చాలనుకొంటున్నట్టుంది. ఇప్పటికే మన అపరాధం గొప్పది. ఇస్రాయేల్ మీద యెహోవా తీవ్ర కోపంతో మండిపడుతున్నాడు.”
14 అందుచేత పెద్దల సమక్షంలో, సమకూడిన వారందరి సమక్షంలో ఆ సైనికులు ఆ బందీలను, దోపిడీని విడిచిపెట్టారు. 15 పెద్దలు దోపిడీలో నుంచి, నగ్నంగా ఉన్న బందీలందరికీ బట్టలు కట్టబెట్టడానికి కొందరిని పేర్లతో పిలిచి నియమించారు. వారు అలా చేసి, బందీలకు వస్త్రాలు, చెప్పులు ఇచ్చారు. ఆహారం పెట్టి త్రాగే నీళ్ళిచ్చి వారి తలలకు నూనె అంటారు. నీరసించిపోయిన వారిని గాడిదలమీద ఎక్కించారు. అప్పుడు బందీలను “ఖర్జూరచెట్ల పట్టణం” అనే పేరున్న యెరికోకు వారి స్వదేశస్తుల దగ్గరికి తీసుకు వెళ్ళి, తిరిగి షోమ్రోనుకు వచ్చారు.
16 ఆ కాలంలో అష్షూరు దేశం రాజులను సహాయం చెయ్యమని ఆహాజురాజు కబురు పంపాడు. 17 ఎందుకంటే, మరో సారి ఎదోంవాళ్ళు యూదామీదికి దండెత్తి వచ్చి, కొందరిని బందీలుగా పట్టుకుపోయారు. 18 ఫిలిష్తీయవాళ్ళు యూదాలో మైదానాల ప్రాంతంలో ఉన్న పట్టణాలమీద, దక్షిణ ఎడారిలో ఉన్న పట్టణాలమీద దాడి చేశారు. వాళ్ళు బేత్‌షెమెషును, అయ్యాలోనును, గెదెరోతును, సోకోను, దాని చుట్టుపట్ల గ్రామాలను, తిమనాను, దాని చుట్టుపట్ల గ్రామాలను, గిమజోను, దాని చుట్టుపట్ల గ్రామాలను స్వాధీనం చేసుకొని వాటిలో కాపురం చేశారు. 19 ఇస్రాయేల్ రాజైన ఆహాజు కారణంగా యెహోవా యూదా రాజ్యాన్ని అణచివేశాడు. ఎందుకంటే ఆహాజు యూదా ప్రజలను అక్రమ కార్యాలను జరిగించేలా చేశాడు. యెహోవామీద ద్రోహం చేశాడు. 20 అష్షూరు రాజు తిగలత్‌పిలేసరు ఆహాజుదగ్గరికి వచ్చాడు గాని, అతడిద్వారా ఆహాజుకు కష్టమే కలిగింది, సహాయం కాదు. 21 ఆహాజు యెహోవా ఆలయంలోనుంచి రాజభవనం లోనుంచి, అధిపతుల దగ్గరనుంచి కొంత సొమ్ము తీసి, అష్షూరు రాజుకు ఇచ్చాడు. కాని, దానివల్ల కూడా సహాయం దొరకలేదు.
22 తనకు వచ్చిన ఆ ఆపద కాలంలో ఆహాజురాజు యెహోవాపట్ల ఇంకా ద్రోహంతో ప్రవర్తించాడు.
23 తనను ఓడించిన దమస్కు నగర వాసుల దేవుళ్ళకు బలులు అర్పించాడు. “సిరియా రాజులకు వాళ్ళ దేవుళ్ళు సహాయం చేశారు. ఆ దేవుళ్ళు నాకూ సహాయం చేసేలా నేను వారికి బలులు అర్పిస్తాను” అని అనుకొన్నాడు. అయితే ఆ దేవుళ్ళవల్ల అతడికీ ఇస్రాయేల్ ప్రజలందరికీ పతనం ప్రాప్తించింది. 24 ఆహాజు యెహోవా ఆలయంలో ఉన్న సామాన్ను పోగు చేయించి వాటిని ముక్కలు చేశాడు. యెహోవా ఆలయం ద్వారాలను మూసివేసి, జెరుసలంలో అన్ని మూలలా బలిపీఠాలను చేయించాడు. 25 ఇతర దేవుళ్ళకు ధూపం వెయ్యడానికి అతడు యూదా పట్టణాలన్నిటిలో ఎత్తయిన పూజాస్థలాలను కట్టించి, తన పూర్వీకుల దేవుడు యెహోవాకు కోపం రేపాడు.
26 ఆహాజును గురించిన ఇతర విషయాలు, అతడి విధానాలన్నీ, మొదటినుంచి చివరివరకు, యూదా, ఇస్రాయేల్ రాజుల గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 27 ఆహాజు కన్ను మూసి అతడి పూర్వీకులదగ్గరికి చేరాడు. అతణ్ణి జెరుసలంలో పాతి పెట్టారు గాని, ఇస్రాయేల్ రాజుల సమాధులలో కాదు. అతడి స్థానంలో అతడి కొడుకు హిజ్కియా రాజయ్యాడు.