27
1 యోతాం రాజయినప్పుడు అతని వయస్సు ఇరవై అయిదేళ్ళు. అతడు జెరుసలంలో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెరూషా. ఆమె సాదోకు కూతురు. 2 యోతాం తన తండ్రి ఉజ్జియాలాగే యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించేవాడు. కాని, యెహోవా ఆలయంలో తన తండ్రి ప్రవేశించినట్టు అతడు ప్రవేశించలేదు. అయినా ప్రజలు చెడ్డగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. 3 యోతాం యెహోవా ఆలయానికి ఉన్న “మీది ద్వారాన్ని” మళ్ళీ కట్టించాడు. ఓపెల్‌కొండ దగ్గర ఉన్న గోడమీద చాలా పని చేయించాడు. 4 యూదా కొండలలో అతడు ఊళ్ళను కట్టించాడు. అడవులలో కోటలను, గోపురాలను కట్టించాడు.
5 అమ్మోనువాళ్ళ రాజుపై యోతాం యుద్ధం చేసి వాళ్ళను ఓడించాడు. ఆ సంవత్సరం అమ్మోనువాళ్ళు అతనికి మూడు వేల నాలుగు వందల కిలోగ్రాముల వెండి, అరవై రెండు వేల తూముల గోధుమలు, అరవై రెండు వేల తూముల యవలు చెల్లించారు. రెండో ఏట, మూడో ఏట కూడా అమ్మోనువాళ్ళు అంతే సొమ్ము చెల్లించారు.
6 యోతాం తన దేవుడైన యెహోవా దృష్టిలో యథార్థంగా ప్రవర్తించినందుచేత అతడు బలాభివృద్ధి చెందాడు. 7 యోతాంను గురించిన ఇతర విషయాలు, అతడు చేసిన యుద్ధాలన్నీ, అతడు చేసినవన్నీ ఇస్రాయేల్, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 8 అతడు రాజయినప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు. అతడు జెరుసలంలో పదహారేళ్ళు పరిపాలించాడు. 9 యోతాం కన్ను మూసి అతని పూర్వీకుల దగ్గరికి చేరాడు. ప్రజలు దావీదు నగరంలో అతణ్ణి సమాధి చేశారు. అతని స్థానంలో అతని కొడుకు ఆహాజు రాజయ్యాడు.