26
1  యూదా ప్రజలంతా అమజ్యా కొడుకు ఉజ్జియాను అతని తండ్రి స్థానంలో రాజుగా చేశారు. అప్పుడు ఉజ్జియా వయస్సు పదహారు సంవత్సరాలు. 2 అమజ్యారాజు కన్నుమూసి అతడి పూర్వీకుల దగ్గరికి చేరిన తరువాత ఉజ్జియా ఏలత్ పట్టణం మళ్ళీ యూదా ప్రజల స్వాధీనం చేసి దానిని తిరిగి కట్టించాడు. 3 ఉజ్జియా రాజయినప్పుడు అతడి వయస్సు పదహారు సంవత్సరాలు. అతడు జెరుసలంలో యాభై రెండు సంవత్సరాలు పరిపాలించాడు. అతడి తల్లి పేరు యకొల్యా. ఆమె జెరుసలం నగరవాసి. 4 ఉజ్జియా తన తండ్రి అమజ్యాలాగే యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించేవాడు. 5 దేవ దర్శనాల విషయం అతనికి జెకర్యా ఉపదేశించేవాడు. జెకర్యా బ్రతికినన్నాళ్ళు ఉజ్జియా యెహోవాను వెదికి అనుసరించాడు. యెహోవాను వెదికి అనుసరించినంత కాలం దేవుడు అతణ్ణి వర్ధిల్లేట్టు చేశాడు.
6 అతడు ఫిలిష్తీయవాళ్ళపై యుద్ధం చేయడానికి వెళ్ళి, గాత్, యాబనె, అష్డోదు పట్టణాల గోడలను పడగొట్టాడు. అష్డోదు ప్రాంతంలో, ఫిలిష్తీయవాళ్ళమధ్య పట్టణాలను తిరిగి కట్టించాడు. 7 ఫిలిష్తీయవాళ్ళపై గూర్‌బయల్‌లో ఉన్న అరబ్బులమీద మెహూనువాళ్ళపై యుద్ధం చేసినప్పుడు దేవుడు అతనికి సహాయం చేశాడు. 8 అమ్మోనువాళ్ళు ఉజ్జియాకు కప్పం చెల్లించేవాళ్ళు. అతనికి చాలా బలాభివృద్ధి చేకూరింది గనుక, అతని ప్రఖ్యాతి ఈజిప్ట్ సరిహద్దుల వరకు వ్యాపించింది.
9 ఉజ్జియా జెరుసలంలో “మూలద్వారం” దగ్గర, “లోయద్వారం” దగ్గర, గోడకోణం దగ్గర గోపురాలు కట్టించి, వాటిని దిట్టం చేశాడు. 10 కొండ దిగువ ప్రాంతాలలో, మైదానాల ప్రాంతాలలో అతనికి పశుసంపద చాలా ఉన్నది గనుక అతడు ఎడారిలో కూడా గోపురాలు కట్టించాడు, తొట్లు నిర్మించాడు. వ్యవసాయమంటే అతనికి ఎంతో ఇష్టం గనుక కొండసీమలలో, సారవంతమైన భూములలో అతనికి కర్షకులూ ద్రాక్షతోట పనివారూ ఉన్నారు.
11 యుద్ధానికి సిద్ధమైన సైన్యం ఉజ్జియాకు ఉన్నది. సైనికులు లెక్క ప్రకారం గుంపులుగా ఏర్పడి యుద్ధానికి వెళ్ళేవారు. రాజు అధిపతులలో కార్యదర్శి మయశేయా, యెహీయేల్ అనే అధికారి వారి లెక్కలు తయారు చేశారు. వీరు హననయా చేతిక్రింద ఉన్నవారు. 12 ఆ యుద్ధవీరులపై రెండు వేల ఆరు వందలమంది అధికారులున్నారు. వారంతా పూర్వీకుల కుటుంబాల నాయకులు. 13 యుద్ధానికి బాగా తర్బీతు పొందిన మూడు లక్షల ఏడు వేల అయిదు వందలమంది వారి చేతిక్రింద ఉన్నారు. రాజును అతని శత్రువుల బారి నుంచి కాపాడడానికి ఇది బలమైన సైన్యం. 14 ఉజ్జియా, సైన్యమంతటికీ డాళ్ళు, ఈటెలు, శిరస్త్రాణాలు, కవచాలు, విండ్లు, వడిసెలలు సరఫరా చేశాడు. 15 పెద్ద రాళ్ళను, బాణాలను విసరడానికి నేర్పుగలవారు కల్పించిన యంత్రాలు జెరుసలంలో తయారు చేయించాడు. వాటిని గోపురాలలో, మూలలో ఉంచాడు. అతడు సుస్థిరమయ్యేవరకు దేవుడు అతనికి అద్భుతంగా సహాయం చేశాడు గనుక అతని ప్రఖ్యాతి దూర ప్రాంతాలకు కూడా వ్యాపించింది.
16 ఉజ్జియా సుస్థిరమైన తరువాత అతడు విర్రవీగి పతనం అయ్యాడు. తన దేవుడైన యెహోవాపట్ల నమ్మకంగా ఉండక యెహోవా ఆలయంలో ధూపవేదికమీద ధూపం వేయడానికి ప్రవేశించాడు. 17 అజరయాయాజి, యెహోవాకు సేవ చేసే ఇతర యాజులు ఎనభైమంది ఉజ్జియా వెంట లోపలికి వెళ్ళారు. వారంతా ధైర్యం గలవారు. 18 వారు ఉజ్జియారాజును ఎదురాడి ఇలా చెప్పారు:
“ఉజ్జియా, యెహోవాకు ధూపం వెయ్యడం నీ పని కాదు. అహరోను సంతానమైన యాజులే ఆ పని చెయ్యాలి. ధూపం వెయ్యడానికి వారే ప్రతిష్ఠమైనవారు. పవిత్ర స్థలంనుంచి వెళ్ళు. నీవు అపనమ్మకస్తుడివయ్యావు. దానివల్ల యెహోవాదేవుడు నిన్ను ఘనపరచడు.”
19 ఉజ్జియాకు కోపం వచ్చింది. అతడు ధూపార్తి చేతపట్టుకొని ధూపం వెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోవా ఆలయంలో ధూపవేదికముందు యాజుల మీద అతడు కోపగిస్తూ ఉండగానే వారి సమక్షంలో అతని నొసట కుష్ఠు పుట్టింది. 20 ప్రముఖయాజి అయిన అజరయా, అతనితో ఉన్న మిగతా యాజులు అతనివైపు చూచినప్పుడు అతని నొసట కుష్ఠు కనిపించింది. గనుక వారు అతణ్ణి త్వరగా బయటికి వెళ్ళేట్టు చేశారు. యెహోవా అతణ్ణి అలా మొత్తినందుచేత అతడే బయటికి వెళ్ళడానికి త్వరపడ్డాడు. 21 ఉజ్జియా చనిపోయే రోజువరకు కుష్ఠురోగి. కుష్ఠురోగి కావడంచేత అతడు యెహోవా ఆలయంలో ప్రవేశించలేక, ప్రత్యేకమైన ఇంటిలో నివాసం చేశాడు. అతడి కొడుకు యోతాం రాజభవనంమీద అధికారిగా ఉండి, దేశప్రజలను పరిపాలించాడు.
22 ఉజ్జియాను గురించిన ఇతర విషయాలు మొదటినుంచి చివరివరకు ఆమోజు కొడుకైన యెషయా ప్రవక్త వ్రాశాడు. 23 ఉజ్జియా కన్నుమూసి తనపూర్వీకుల దగ్గరికి చేరాడు. “అతడు కుష్ఠురోగి గదా” అని వారి సమాధులకు దగ్గర్లో, రాజులకు చెందిన శ్మశాన భూమిలో ప్రజలు అతణ్ణి పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కొడుకు యోతాం రాజయ్యాడు.