25
1 అమజ్యా రాజయినప్పుడు అతడి వయస్సు ఇరవై అయిదేళ్ళు అతడు జెరుసలంలో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతడి తల్లి పేరు యెహోయద్దాను. ఆమె జెరుసలం నగరవాసి. 2 అతడు యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించేవాడు గాని, యథార్థ హృదయంతో అలా చేసేవాడు కాడు. 3 రాజ్యం అతడి వశంలో సుస్థిరమైన వెంటనే అతడు రాజైన తన తండ్రిని చంపిన ఆ అధికారులను చంపించాడు. 4 కాని, వాళ్ళ సంతానాన్ని చంపించలేదు. మోషే గ్రంథంలో ధర్మశాస్త్రంలో వ్రాసి ఉన్నదాని ప్రకారం అతడు చేశాడు. అందులో యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు: “కొడుకుల దోషాన్ని బట్టి తండ్రులకు మరణశిక్ష విధించకూడదు; తండ్రుల దోషాన్నిబట్టి కొడుకులకు మరణశిక్ష విధించకూడదు. ఎవడి పాపానికి వాడే మరణశిక్ష పొందాలి.”
5 అమజ్యా యూదా రాజ్య ప్రజలను సమకూర్చి యూదా, బెన్యామీనుల వారందరిమీదా వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం అధిపతులను నియమించాడు. ఆ అధిపతులు కొందరు వెయ్యిమందిమీదా కొందరు వందమందిమీదా ఉన్నారు. అప్పుడు అమజ్యా ఇరవై సంవత్సరాలు మొదలుకొని అంతకంటే పెద్ద వయస్సు వారిని జనాభాలెక్కలు చేయించాడు. ఈటె, డాలు పట్టుకొని యుద్ధానికి వెళ్ళగలిగిన సైనికులు మూడు లక్షలమంది. 6 అమజ్యా ఇస్రాయేల్‌లో ఉన్న లక్షమంది యుద్ధవీరులను కిరాయి సిపాయిలుగా తీసుకొన్నాడు. వాళ్ళకోసం మూడు వేల నాలుగు వందల కిలోగ్రాముల వెండి ఇచ్చాడు.
7 అప్పుడు దేవుని మనిషి ఒకడు అమజ్యా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: “రాజా, ఇస్రాయేల్ సైనికులను నీవు తీసుకువెళ్ళకూడదు. ఎందుకంటే, యెహోవా ఇస్రాయేల్‌వారికి – ఎఫ్రాయిం ప్రజలలో ఎవరికీ తోడుగా లేడు. 8  వెళ్తానంటావా? సరే, వెళ్ళు, అయితే నీవు యుద్ధంలో బలంగా ఉన్నా, నీ శత్రువుల ఎదుట యెహోవా నిన్ను కూలదోస్తాడు. సహాయం చేయడానికి, లేదా, కూలదోయడానికి యెహోవా సామర్థ్యం గలవాడు గదా.”
9 దేవుని మనిషిని చూచి అమజ్యా “ఇస్రాయేల్ సైనికులకోసం నేను మూడు వేల నాలుగు వందల కిలోగ్రాముల వెండి ఇచ్చాను గదా! దాని మాటేమిటి?” అని అడిగాడు.
అందుకు దేవుని మనిషి “యెహోవా అంతకంటే ఎక్కువ నీకివ్వగలడు” అన్నాడు.
10 అప్పుడు అమజ్యా ఎఫ్రాయింనుంచి వచ్చిన సైనికులను వారి ఇండ్లకు తిరిగి పంపివేశాడు. అందుకు యూదావారిమీద వాళ్ళకు తీవ్ర కోపం వచ్చింది. ఆగ్రహంతో మండిపడుతూ తమ ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు.
11 తరువాత అమజ్యా బలం కూడగట్టుకొని తన సైన్యాన్ని “ఉప్పులోయ”కు నడిపించాడు. అక్కడ శేయీరువాళ్లను పది వేలమందిని హతం చేశాడు. 12 యూదావారు మరో పది వేలమందిని ప్రాణంతో పట్టుకొన్నారు. వాళ్ళను ఒక కొండ చరియపైకి తీసుకుపోయి అక్కడనుంచి క్రిందికి పడవేశారు. వాళ్ళంతా చిన్నాభిన్నమైపోయారు.
13  ఈ లోగా అమజ్యా తనతోకూడా యుద్ధానికి రానివ్వకుండా పంపివేసిన సైనికులు షోమ్రోనునుంచి బేత్‌హోరోనువరకు ఉన్న యూదా పట్టణాలమీద పడ్డారు. మూడు వేలమందిని హతం చేసి, చాలా దోపిడీ ఎత్తుకుపోయారు.
14 అమజ్యా ఎదోంజాతివాళ్ళను ఓడించి తిరిగి వచ్చినప్పుడు తనతోకూడా శేయీరువాళ్ళ దేవుళ్ళను తెచ్చాడు. వాటిని తనకు దేవుళ్ళుగా నిలిపి, వాటి ఎదుట సాష్టాంగపడి వాటికి ధూపం వేశాడు కూడా. 15 అందుచేత అమజ్యా మీద యెహోవాకు కోపం రగులుకొంది. యెహోవా ఒక ప్రవక్తను అమజ్యాదగ్గరికి పంపాడు.
అతడు “ఈ దేవుళ్ళు తమ సొంత ప్రజలనే నీ చేతిలో పడకుండా కాపాడలేకపోయారే. నీవు వాళ్ళ దేవుళ్ళను సంప్రదిస్తున్నావేం?” అన్నాడు.
16 ప్రవక్త తనతో ఇంకా మాట్లాడుతూ ఉండగానే రాజు “నిన్ను రాజుకు సలహాదారుడుగా నియమించామా? ఊరుకో. నీమీదికి నీవు చావు ఎందుకు తెచ్చిపెట్టుకొంటావు?” అన్నాడు.
అప్పుడు ప్రవక్త “నీవు అలా చేసి, ఇప్పుడు నా సలహా అంగీకరించలేదు. గనుక దేవుడు నిన్ను నాశనం చేయడానికి నిర్ణయించాడని నాకు తెలుసు” అని చెప్పి ఊరుకొన్నాడు.
17 యూదా రాజైన అమజ్యా ఇతరులతో ఆలోచన చేశాక, యెహూ మనమడూ, యెహోయాహాజు కొడుకూ, ఇస్రాయేల్ రాజూ అయిన యెహోయాషుకు ఇలా కబురంపాడు: “మనం ఒకర్ని ఒకరం ఎదుర్కొందాం, రా.”
18 అప్పుడు ఇస్రాయేల్ రాజైన యెహోయాషు యూదా రాజు అమజ్యాకు ఇలా కబురంపాడు: “లెబానోను అడవిలో ఉన్న ముళ్ళపొద ఒకటి లెబానోను దేవదారుకు ‘నీ కూతుర్ని నా కొడుక్కు భార్యగా ఇవ్వు’ అని చెప్పి పంపింది. అయితే లెబానోను అడవి మృగం ఒకటి ఆ వైపుకు వచ్చి ఆ ముళ్ళపొదను తొక్కి పాడు చేసింది. 19 నీవు ‘ఎదోంవాళ్ళను ఓడించాను గదా!’ అంటూ గర్వంతో మిడిసిపడుతున్నావు. ఇంటిదగ్గరే ఉండు. నీవెందుకు ఆపద కలిగించుకొంటావు? దానివల్ల నీవూ, నీతోపాటు యూదా కూలిపోతుంది.”
20 అయితే అమజ్యా పెడచెవిని పెట్టాడు. దేవునివల్లే అలా అయింది. యూదావారు ఎదోంవాళ్ళ దేవుళ్ళను అనుసరించినందుచేత వారిని యెహోయాషు చేతికి అప్పగించడానికి దేవుడు సంకల్పించాడు.
21 ఇస్రాయేల్ రాజు యెహోయాషు బయలుదేరాడు. అతడు, యూదా రాజైన అమజ్యా యూదాకు చెందిన బేత్‌షెమెషు దగ్గర ఎదురెదురుగా వచ్చారు. 22 ఇస్రాయేల్‌వాళ్ళ ఎదుట యూదావారు ఓడిపోయి, వారి వారి నివాసాలకు పారిపోయారు. 23 ఇస్రాయేల్ రాజైన యెహోయాషు బేత్‌షెమెషులో అహజ్యా మనుమడూ యోవాషు కొడుకూ యూదా రాజూ అయిన అమజ్యాను పట్టుకొన్నాడు. యెహోయాషు అతణ్ణి జెరుసలంకు తీసుకువచ్చి, జెరుసలం గోడను “ఎఫ్రాయిం ద్వారం” నుంచి “మూలద్వారం” వరకు నాలుగు వందల మూరలు పడగొట్టారు. 24 అతడు దేవుని ఆలయంలో, ఓబేదెదోం అనే మనిషి కాపలాలో కనిపించిన వెండి బంగారాలంతా, పాత్రలన్నీ, రాజభవనం ఖజానాలో ఉండేదంతా తీసుకొని షోమ్రోనుకు వెళ్ళిపోయాడు. కొంతమంది మనుషులను కుదువగా కూడా తీసుకుపోయాడు.
25 యెహోయాహాజు కొడుకూ ఇస్రాయేల్ రాజూ అయిన యెహోయాషు మృతి చెందిన తరువాత యోవాషు కొడుకూ యూదా రాజూ అయిన అమజ్యా ఇంకా పదిహేను సంవత్సరాలు బ్రతికాడు. 26 అమజ్యాను గురించిన ఇతర విషయాలు మొదటినుంచి చివరివరకు, యూదా, ఇస్రాయేల్ రాజుల చరిత్రగ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 27 యెహోవాను అనుసరించడం అమజ్యా మానివేసినప్పటినుంచి జెరుసలంలో కొందరు అతడిమీద కుట్ర పన్నారు. అతడు లాకీషు పట్టణం పారిపోయాడు గాని, వాళ్ళు లాకీషుకు మనుషులను పంపి అతణ్ణి చంపించారు. 28 అప్పుడు వారు గుర్రంమీద అతడి మృతదేహాన్ని జెరుసలంకు తెప్పించి, అతడి పూర్వీకుల దగ్గర, దావీదునగరంలో సమాధిచేశారు.