24
1 యోవాషు రాజయినప్పుడు అతని వయస్సు ఏడేళ్ళు. అతడు జెరుసలంలో నలభై సంవత్సరాలు పరిపాలించాడు. బేర్‌షెబా పురవాసి జిబయా అతని తల్లి. 2 యెహోయాదాయాజి బ్రతికినన్నాళ్ళు యోవాషు యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించాడు. 3 యెహోయాదా అతనికి ఇద్దరు అమ్మాయిలను పెండ్లి చేశాడు అతనికి కొడుకులూ కూతుళ్ళూ కలిగారు.
4 కొన్నాళ్ళ తరువాత యెహోవా ఆలయాన్ని మరమ్మత్తు చేయడానికి యోవాషు నిశ్చయించుకొన్నాడు. 5 అతడు యాజులను, లేవీగోత్రికులను పిలిపించి వారిని ఇలా ఆదేశించాడు: “మీ దేవుని ఆలయాన్ని మరమ్మత్తు చేయాలి గనుక యూదా పట్టణాలకు వెళ్ళి ఇస్రాయేల్ ప్రజలందరి దగ్గరనుంచి ఏటేటా రావలసిన సొమ్మును వసూలు చెయ్యండి. ఆ పని త్వరగానే చెయ్యండి.” అయితే లేవీగోత్రికులు ఆ పని త్వరగా చేయలేదు. 6 గనుక రాజు ప్రముఖయాజి అయిన యెహోయాదాను పిలిచి, “ఆ చెడ్డ స్త్రీ అతల్యా కొడుకులు దేవుని ఆలయాన్ని పాడు చేశారు. ఆలయానికి చెందిన పవిత్ర వస్తువులను బయల్‌దేవుడి పూజకు వినియోగించారు. 7 శాసనాల గుడారం సేవకోసం యెహోవా సేవకుడైన మోషే ఇస్రాయేల్ సమాజం మీద నిర్ణయించిన సుంకాలు యూదానుంచి జెరుసలంనుంచి లేవీగోత్రికులు తేలేదు. నీవెందుకు చెప్పి తెప్పించలేదు?”
8 ఒక పెట్టెను చేయమని రాజు ఆజ్ఞాపించాడు. దానిని చేసి వారు యెహోవా ఆలయం బయట, ద్వారందగ్గర ఉంచారు. 9 ఎడారిలో ఉన్నప్పుడు దేవుని సేవకుడైన మోషే ఇస్రాయేల్‌ప్రజమీద నిర్ణయించిన సుంకాలు యెహోవాకు తీసుకురావాలని యూదాలో, జెరుసలంలో వారు ప్రకటన చేశారు. 10 దానికి అధికారులంతా, ప్రజలంతా సంతోషించి, వారి వారి కానుకలు తెచ్చారు. పెట్టె నిండేవరకు అందులో వేశారు. 11 అప్పుడప్పుడు లేవీగోత్రికులు ఆ పెట్టెను రాజు అధికారుల దగ్గరికి తెచ్చేవారు. పెట్టెలో చాలా డబ్బు కనబడితే రాజు కార్యదర్శి, ప్రముఖయాజి అధికారి వచ్చి, పెట్టెను ఖాళీ చేసి, దాని స్థలంలో దానిని మళ్ళీ ఉంచేవారు. ఇలా తరచుగా చేయడంవల్ల వారు చాలా డబ్బు పోగు చేశారు. 12 రాజు, యెహోయాదా ఆ డబ్బును యెహోవా ఆలయంలో పని చేసేవారికి అప్పగించారు. యెహోవా ఆలయాన్ని బాగు చేయడానికి తాపీపనివారినీ వడ్రంగులనూ, ఆలయాన్ని మరమ్మత్తు చేయడానికి ఇనుముతోనూ కంచుతోనూ పని చేసేవారినీ కూలికి తీసుకొన్నారు.
13 పనివారు కష్టించారు. మరమ్మత్తు పని బాగా సాగిపోయింది. వారు దేవుని ఆలయాన్ని పూర్వస్థితికి తెచ్చి దిట్టం చేశారు. 14 పని ముగించిన తరువాత వారు మిగతా డబ్బును రాజుదగ్గరికీ యెహోయాదాదగ్గరికీ తెచ్చారు. ఆ డబ్బుతో యెహోవా ఆలయానికి సంబంధించిన వస్తువులను – సేవ సంబంధమైన వస్తువులను, హోమబలికి ఉపయోగపడే వస్తువులను చేయించారు. యెహోయాదా బ్రతికినన్నాళ్ళూ యెహోవా ఆలయంలో ప్రతిరోజూ హోమబలులు అర్పించడం జరుగుతూ వచ్చింది.
15 యెహోయాదా వయస్సు పండి ముసలితనంలో చనిపోయాడు. అప్పుడు అతని వయస్సు నూట ముప్ఫయి సంవత్సరాలు. 16 అతడు దేవునికోసం, ఆయన ఆలయంకోసం ఇస్రాయేల్‌లో మంచి చేసేవాడు గనుక ప్రజలు అతణ్ణి దావీదు నగరంలో రాజుల సమాధుల మధ్య పాతిపెట్టారు.
17 యెహోయాదా మృతి తరువాత యూదా అధికారులు రాజుదగ్గరికి వచ్చి నమస్కారం చేశారు. అతడు వారి ఆలోచనలను అంగీకరించాడు. 18 అప్పుడు వారు వారి పూర్వీకుల దేవుడైన యెహోవా ఆలయాన్ని విడిచిపెట్టారు. ఆషేరాదేవి స్తంభాలకు, విగ్రహాలకు మ్రొక్కారు. వారి అపరాధం కారణంగా దేవుని కోపం యూదావారిమీదికి, జెరుసలం నగరవాసులమీదికి వచ్చింది. 19 అయినా, వారిని తనవైపుకు మళ్ళించాలని యెహోవా తన ప్రవక్తలను వారి దగ్గరికి పంపాడు. ప్రవక్తలు సాక్ష్యమిస్తూ వారిని హెచ్చరించారు. కాని, ప్రవక్తల మాటలు వారు పెడచెవిని పెట్టారు.
20 ఆ సమయంలో దేవుని ఆత్మ జెకర్యాను ఆవరించాడు. అతడు యెహోయాదాయాజి కొడుకు. అతడు ప్రజలముందు నిలబడి “దేవుడు ఇలా అంటున్నాడు: యెహోవా ఆజ్ఞలను మీరెందుకు మీరుతున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విడిచిపెట్టారు గనుక ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడు” అన్నాడు.
21  అయితే వారు అతనిమీద కుట్ర పన్ని అతణ్ణి యెహోవా ఆలయ ఆవరణంలో రాళ్ళతో కొట్టి చంపారు. రాజు జారీ చేసిన ఆజ్ఞప్రకారమే అలా జరిగింది. 22 జెకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చూపిన దయను యోవాషురాజు మరచిపోయి, అతని కొడుకును చంపించాడు. జెకర్యా చనిపోతూ, చివరిగా “యెహోవా ఇది చూచి విచారణ చేస్తాడు” అన్నాడు.
23  ఆ సంవత్సరం చివరిలో సిరియా సైన్యం యోవాషు పైకి దండెత్తి వచ్చింది. వాళ్ళు యూదాపై, జెరుసలం పైబడి, ప్రజల నాయకులందరినీ చంపారు. కొల్లసొమ్మంతా దమస్కులో ఉన్న వారి రాజుకు పంపారు. 24 వచ్చిన సిరియా సైన్యం చిన్నదే. అయినా చాలా పెద్ద సైన్యాన్ని యెహోవా దాని వశం చేశాడు. యూదా తమ పూర్వీకుల దేవుడు యెహోవాను విడిచిపెట్టారు గనుక అలా జరిగింది. యోవాషు కూడా తీర్పుకు గురి అయ్యాడు. 25 సిరియావాళ్ళు వెళ్ళినప్పుడు, అతడు బాగా గాయాలుపడి ఉన్నాడు. అతడు యాజి అయిన యెహోయాదా కొడుకును చంపించినందుచేత అతడిమీద అతడి ఉద్యోగస్థులు కుట్రపన్నారు, అతడు పడకమీద ఉన్నప్పుడు అతణ్ణి చంపారు. ఆ విధంగా అతడు చనిపోయాడు. దావీదునగరంలో అతణ్ణి పాతిపెట్టారు గాని రాజుల సమాధులలో మాత్రం పాతిపెట్టలేదు. 26 అతనిపై కుట్ర పన్నినవారెవరంటే, షిమాతు అనే అమ్మోను జాతి స్త్రీ కొడుకు జాబాదు, షిమ్రీతు అనే మోయాబుజాతి స్త్రీ కొడుకు యెహోజాబాదు.
27 యోవాషు కొడుకుల విషయం, అతణ్ణి గురించిన అనేక దేవోక్తుల విషయం, దేవుని ఆలయాన్ని పూర్వస్థితికి తెచ్చిన విషయం యూదా రాజుల గ్రంథ వ్యాఖ్యానంలో వ్రాసి ఉన్నాయి. అతడి స్థానంలో అతడి కొడుకు అమజ్యా రాజయ్యాడు.