23
1  ఏడో సంవత్సరంలో యెహోయాదా బలం కూడదీసుకొన్నాడు. అతడు శతాధిపతులతో ఒడంబడిక చేశాడు. వారెవరంటే, యెరోహాం కొడుకు అజరయా, యెహోహానాను కొడుకు ఇష్మాయేల్, ఓబేదు కొడుకు అజరయా, అదాయా కొడుకు మయశేయా, జిక్రీ కొడుకు ఎలీషాపాతు. 2 వారు వెళ్ళి యూదా అంతటా సంచారం చేస్తూ అన్ని పట్టణాలనుంచీ లేవీగోత్రికులనూ ఇస్రాయేల్ వంశాల నాయకులనూ సమకూర్చారు. వారంతా జెరుసలంకు వచ్చారు. 3 సమకూడినవారంతా దేవుని ఆలయంలో రాజుతో ఒడంబడిక చేశారు. అప్పుడు యెహోయాదా వారితో ఇలా చెప్పాడు: “ఇడుగో రాజు కుమారుడు! యెహోవా దావీదు సంతానం విషయం మాట ఇచ్చిన ప్రకారం అతడు రాజ్యం చేస్తాడు. 4 ఇప్పుడు మీరు చేయవలసినదేమిటంటే, విశ్రాంతి దినం యాజులలో, లేవీగోత్రికులలో మూడో భాగం పనిమీద ఉంటుందిగా. మీరు ద్వారాల దగ్గర కాపలా కాయాలి. 5 ఇంకో మూడో భాగం రాజభవనందగ్గర, మరో మూడో భాగం ‘పునాది ద్వారం’ కాపలా కాయాలి. మిగతావారంతా యెహోవా ఆలయ ఆవరణాలలో ఉండాలి. 6 పనిమీద ఉన్న యాజులు, లేవీగోత్రికులు తప్ప ఇంకెవరూ యెహోవా ఆలయంలో ప్రవేశించకూడదు. యాజులు, లేవీగోత్రికులు ప్రతిష్ఠించ బడ్డవారు గనుక వారు ప్రవేశించవచ్చు. మిగతావారంతా యెహోవా ఆజ్ఞను పాటించి బయట ఉండిపోవాలి. 7 లేవీగోత్రికులు ఒక్కొక్కరు ఆయుధాలు చేతపట్టుకొని రాజు చుట్టూరా ఉండాలి. ఎవరైనా ఆలయంలోకి వస్తే వాళ్ళను చంపాలి. రాజు ఎక్కడికి వెళ్ళినా మీరు అతనితోనే ఉండాలి.”
8 యెహోయాదాయాజి ఆదేశించినట్టెల్లా లేవీగోత్రికులు, యూదావారంతా చేశారు. ఒక్కొక్కరు విశ్రాంతి దినం పనికి వెళ్ళినవారినీ, విశ్రాంతిదినం పనికి వెళ్ళనివారినీ వారితోపాటు యెహోయాదాయాజి దగ్గరికి తీసుకువచ్చారు. యెహోయాదా యాజి ఏ వంతువారికి సెలవియ్యలేదు. 9 దావీదురాజుకు చెందిన ఈటెలు, పెద్ద డాళ్ళు, చిన్న డాళ్ళు దేవుని ఆలయంలో ఇంకా ఉన్నాయి. ఆ శతాధిపతులకు వాటిని యెహోయాదా అందించాడు. 10 అప్పుడు ఆయుధాలు పట్టుకొని ఉన్న మనుషులందరినీ ఆలయం కుడివైపునుంచి ఎడమవైపువరకు బలిపీఠం దగ్గర, రాజుచుట్టూరా ఉంచాడు. 11 అప్పుడు యెహోయాదా, అతని కొడుకులు రాకుమారుణ్ణి బయటికి తీసుకువచ్చి అతని తలమీద కిరీటం పెట్టారు. ధర్మశాస్త్రం ప్రతిని అతనికి అందించారు. అతణ్ణి రాజుగా అభిషేకించారు. వారు అతణ్ణి అభిషేకించి “రాజు చిరంజీవి కావాలి!” అని కేకలు వేశారు.
12 ప్రజలు పరుగెత్తుతూ, రాజును స్తుతిస్తూ ఉండడం విని, అతల్యా యెహోవా ఆలయానికి వారి దగ్గరికి వచ్చింది. 13 ఆమె వచ్చి చూస్తే, అక్కడ ఆచారంప్రకారం రాజు ద్వారందగ్గర ఉన్న స్తంభం దగ్గర నిలుచున్నాడు. అధిపతులు, బాకా ఊదేవారు రాజు ప్రక్కనే ఉన్నారు. దేశప్రజలంతా సంబరపడుతూ, బూరలు ఊదుతూ ఉన్నారు. గాయకులు వాద్యాలతో స్తుతి పాటలు పాడుతూ ఉన్నారు. అది చూచి అతల్యా తన బట్టలు చించుకొని “రాజద్రోహం! రాజద్రోహం!” అని అరచింది.
14 అప్పుడు యెహోయాదాయాజి సైన్యంలో ఉన్న ఆ శతాధిపతులను పిలిచి “ఆమెను యెహోవా ఆలయంలో చంపకూడదు. మీ వరుసల మధ్య నుంచి ఆమెను బయటికి తీసుకురండి. ఆమె పక్షం వహించిన వారందరినీ చంపండి” అని ఆదేశించాడు. 15 వారు ఆమెను పట్టుకొని, రాజభవనం “గుర్రం ద్వారం” దగ్గరికి తీసుకువచ్చి అక్కడ ఆమెను చంపారు.
16 అప్పుడు “మనం యెహోవా ప్రజగా ఉంటాం” అని రాజుతో, ప్రజలందరితో యెహోయాదా ఒడంబడిక చేశాడు. 17 వెంటనే ప్రజలంతా బయల్‌దేవుడి గుడిదగ్గరికి వెళ్ళి దానిని పడగొట్టారు. దాని బలిపీఠాలను, విగ్రహాలను చిన్నాభిన్నం చేశారు. బలిపీఠాల ముందే బయల్‌దేవుడి పూజారి మత్తానును చంపారు. 18 ఆ తరువాత యెహోయాదా యెహోవా ఆలయం పనులు చూడడానికి పూర్వం దావీదు నియమించిన విధంగా లేవీగోత్రికులయిన యాజులను నియమించాడు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాసి ఉన్నట్టు యెహోవాకు అర్పించవలసిన హోమబలులను, దావీదు ఇచ్చిన ఆదేశంప్రకారం, సంతోషంతో గానంతో అర్పించడానికి వారిని నియమించాడు యెహోయాదా. 19 దేనివల్ల అయినా అశుద్ధంగా ఉన్న వారెవరూ యెహోవా ఆలయంలో ప్రవేశించకుండా ఆలయం ద్వారాల దగ్గర ద్వారపాలకులను ఉంచాడు. 20 అప్పుడతడు శతాధిపతులనూ, నాయకులనూ ప్రజల పాలకులనూ దేశప్రజలందరినీ వెంటబెట్టుకొని రాజును యెహోవా ఆలయంనుంచి రాజభవనానికి తీసుకువచ్చాడు. వారు “మీది ద్వారం” గుండా ప్రవేశించి, రాజ్యసింహాసనం మీద రాజును కూర్చోబెట్టారు. 21 దేశ ప్రజలంతా సంబరపడుతూ ఉన్నారు. వారు అతల్యాను ఖడ్గంతో చంపిన తరువాత నగరం ప్రశాంతంగా ఉంది.