22
1  యెహోరాం స్థానంలో అతడి చిన్న కొడుకు అహజ్యాను జెరుసలంప్రజలు రాజుగా చేశారు. అంతకు ముందు అరబ్బులతో యూదా శిబిరం పైకి దండెత్తి వచ్చినవాళ్ళు యెహోరాంయొక్క పెద్ద కొడుకులందరినీ హతం చేశారు. గనుక యూదా రాజైన యెహోరాం కొడుకైన అహజ్యా అధికారానికి వచ్చాడు. 2 అహజ్యా రాజయినప్పుడు అతడి వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు. అతడు జెరుసలంలో ఏడాది పరిపాలించాడు. అతడి తల్లి పేరు అతల్యా. ఆమె ఒమ్రీ మనుమరాలు. 3 దుర్మార్గంగా ప్రవర్తించడానికి అహజ్యాను ప్రేరేపించినది అతడి తల్లే, గనుక అతడు కూడా అహాబు రాజవంశంవాళ్ళ జీవిత విధానాలను అనుసరించేవాడు. 4 అహాబు రాజవంశంవాళ్ళలాగే అతడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించాడు. అతడి తండ్రి చనిపోయిన తరువాత వాళ్ళు అతడికి సలహాదారులయ్యారు. ఇది అతడి నాశనానికి కారణమైంది.
5 అతడు వాళ్ళ సలహాను అనుసరించే అహాబు కొడుకూ, ఇస్రాయేల్ రాజూ అయిన యెహోరాంతో కలిసి, సిరియా రాజైన హజాయేల్‌మీద యుద్ధం చేయడానికి రామోత్ గిలాదుకు వెళ్ళాడు. అక్కడ సిరియావాళ్ళు యెహోరాంను గాయపరిచారు. 6 సిరియా రాజైన హజాయేల్‌తో యుద్ధం చేస్తూ ఉంటే రమాదగ్గర సిరియావాళ్ళవల్ల తగిలిన గాయాలు నయం చేసుకోవడానికి యెహోరాం యెజ్రేల్‌కు తిరిగి వచ్చాడు. అహాబు కొడుకు యెహోరాం అనారోగ్యంగా ఉన్నందుచేత యూదా రాజూ యెహోరాం కొడుకూ అయిన అహజ్యా అతణ్ణి చూడడానికి యెజ్రేల్‌కు వెళ్ళాడు. 7 యెహోరాం దగ్గరికి అహజ్యా వెళ్ళడంమూలాన దేవుడు అహజ్యాకు పతనం ప్రాప్తించేలా చేశాడు. అహజ్యా అక్కడికి చేరినప్పుడు అతడు యెహోరాంతో కూడా నింషీ కొడుకు యెహూను కలుసుకోవడానికి వెళ్ళాడు. అహాబు రాజవంశాన్ని నిర్మూలం చేయడానికి యెహోవా యెహూను అభిషేకించి పంపాడు.
8 అహాబు రాజవంశంమీద యెహూ న్యాయం జరిగించడానికి వచ్చినప్పుడు, అతడికి యూదా అధికారులూ అహజ్యాకు పరిచారకులుగా ఉన్న అహజ్యా బంధువుల కొడుకులూ కనిపించారు. యెహూ వాళ్ళను చంపాడు. 9 తరువాత అహజ్యాను వెదకడానికి అతడు బయలుదేరాడు. అహజ్యా షోమ్రోనులో దాక్కొని ఉంటే, యెహూ మనుషులు అతణ్ణి పట్టుకొన్నారు. అతణ్ణి యెహూదగ్గరికి తీసుకువచ్చాక వాళ్ళు అతణ్ణి చంపారు. “ఇతడు యెహోవాను హృదయ పూర్వకంగా వెదికిన యెహోషాపాతు సంతానంలో ఒకడు” అంటూ అతణ్ణి సమాధి చేశారు. ఈ విధంగా రాజ్యాన్ని నిలుపుకోగలిగేటంత సామర్థ్యం గలవాడెవడూ అహజ్యా కుటుంబంలో మిగలలేదు.
10 అహజ్యా తల్లి అతల్యా తన కొడుకు చనిపోయాడని తెలుసుకొన్నప్పుడు ఆమె యూదా రాజవంశం వారందరినీ నాశనం చేయడానికి పూనుకొంది. 11 కాని, రాజైన యెహోరాం కూతురు యెహోషబతు అహజ్యా కొడుకైన యోవాషును రహస్యంగా ఎత్తుకుపోయింది. హత్యకు గురి కాబోయే రాకుమారుల మధ్యనుంచి ఆమె అతణ్ణి తీసుకుపోయి, అతణ్ణి, అతడి దాదిని ఒక పడకగదిలో ఉంచింది. యెహోషబతు యెహోరాం కూతురు. యాజి అయిన యెహోయాదా భార్య, అహజ్యా సోదరి. గనుక ఆ పిల్లవాణ్ణి అతల్యా పట్టుకొని చంపకుండా ఆమె అతణ్ణి దాచిపెట్టింది. 12 అతడు దేవుని ఆలయంలో వారిదగ్గర ఉంటూ, ఆరేళ్ళు మరుగై ఉన్నాడు. ఆ కాలంలో అతల్యా దేశాన్ని పరిపాలిస్తూ ఉంది.