21
1 యెహోషాపాతు కన్ను మూసి✽ తన పూర్వీకులదగ్గరికి చేరాడు. ప్రజలు అతణ్ణి దావీదునగరంలో సమాధి చేశారు. అతని స్థానంలో అతని కొడుకు యెహోరాం రాజయ్యాడు. 2 వీరు యెహోరాం తోబుట్టువులు, యెహోషాపాతు కొడుకులు: అజరయా, యెహీయేల్, జెకర్యా, అజరయాహు, మికాయేల్, షెపటయా. వీరంతా ఇస్రాయేల్ రాజైన యెహోషాపాతు కొడుకులు. 3 ✝వారి తండ్రి వారికి అనేక బహుమతులు– వెండి, బంగారం, విలువైన వస్తువులు – ఇచ్చాడు. యూదాలో కోటలూ గోడలూ ఉన్న పట్టణాలు కూడా ఇచ్చాడు. అయితే తనకు మొదట పుట్టినవాడు యెహోరాం, గనుక అతడికి రాజ్యం ఇచ్చాడు.4 ✽యెహోరాం తన తండ్రి రాజ్యంమీద తన పరిపాలనను సుస్థిరం చేసుకొన్నాక అతడు తన సోదరులందరినీ, ఇస్రాయేల్ అధికారులలో కొందరినీ కత్తిపాలు చేశాడు. 5 యెహోరాం రాజయినప్పుడు అతడి వయస్సు ముప్ఫయి రెండు సంవత్సరాలు. అతడు జెరుసలంలో ఎనిమిది ఏళ్ళు పరిపాలించాడు. 6 అతడు అహాబు✽ కూతురును పెండ్లి చేసుకొన్నాడు, గనుక అహాబు రాజవంశంవాళ్ళలాగే ఇస్రాయేల్ రాజుల జీవిత విధానాలను అనుసరించి నడిచాడు. అతడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. 7 అయినా యెహోవా దావీదుతో చేసిన ఒడంబడిక కారణంగా దావీదు✽ వంశాన్ని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. అంతేగాక, అతనికోసం, అతని సంతానంకోసం వెలుగు✽ ఎప్పుడూ ఉండేలా చేస్తానని యెహోవా దావీదుతో ప్రమాణం చేశాడు.
8 ✽యెహోరాం కాలంలో ఎదోంవాళ్ళు యూదా పరిపాలనను వ్యతిరేకించారు. వారు స్వయంగా రాజును తమమీద నియమించుకొన్నారు. 9 అప్పుడు యెహోరాం తన రథాలన్నీ తీసుకొని తన అధిపతులతో కూడా అక్కడికి వెళ్ళాడు. రాత్రిలో లేచి, తననూ తన రథాధిపతులనూ చుట్టుముట్టిన ఎదోంవాళ్ళను హతం చేశాడు. 10 అయినా ఈనాటికీ ఎదోంవాళ్ళు యూదా పరిపాలనను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆ సమయంలో లిబనా పట్టణస్తులు కూడా తిరగబడ్డారు. యెహోరాం తన పూర్వీకుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టినందుచేత ఇలా జరిగింది. 11 అదీ గాక, అతడు యూదా కొండలపై ఎత్తయిన పూజాస్థలాలను కట్టించాడు. జెరుసలం కాపురస్తులను వ్యభిచారుల్లాగా✽ ప్రవర్తించేలా చేశాడు, యూదావారిని తప్పుత్రోవ పట్టించాడు.
12 అప్పుడు యెహోరాంకు ఏలీయా✽ ప్రవక్తనుంచి ఈ లేఖ వచ్చింది: “మీ పూర్వీకుడైన దావీదు యొక్క దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, నీవు నీ తండ్రి యెహోషాపాతు జీవిత విధానాలనూ యూదా రాజు ఆసా జీవిత విధానాలనూ అనుసరించలేదు. 13 ✝ఇస్రాయేల్ రాజుల జీవిత విధానాలనే అనుసరించావు. అహాబు వంశంవాళ్ళలాగే, యూదానూ, జెరుసలం నివాసులనూ వ్యభిచారుల్లాగా ప్రవర్తించేలా చేశావు. నీ తండ్రి సంతానాన్ని – నీ సొంత తమ్ముళ్ళను హత్య చేశావు. వాళ్ళు నీకంటే మంచివారు. 14 ఇదిగో నీ ప్రజలను, నీ కొడుకులను, భార్యలను నీకున్నదాన్నంతటినీ గొప్ప విపత్తుతో యెహోవా మొత్తుతాడు✽. 15 నిన్ను కూడా పేగులలో ఘోరమైన జబ్బుతో మొత్తుతాడు. నీ పేగులు బయటికి వచ్చేదాకా రోజు రోజుకు ఆ జబ్బు నిన్ను బాధిస్తూ ఉంటుంది.”
16 ✽యెహోరాంమీదికి ఫిలిష్తీయవాళ్ళనూ, కూషువాళ్ళకు దగ్గరిలో ఉన్న అరబ్బులనూ యెహోవా పురికొలిపాడు. 17 వాళ్ళు యూదాపైకి దండెత్తి వచ్చి, రాజభవనంలో ఉన్న వస్తువులన్నిటినీ, అతడి కొడుకులనూ భార్యలనూ తీసుకుపొయ్యారు. అతడి కొడుకులందరిలోకి చిన్నవాడైన యెహోయాహాజు ఒక్కడే మిగిలాడు. 18 ఇదంతా జరిగాక యెహోవా యెహోరాంను పేగులలో నయం కాని జబ్బుతో మొత్తాడు. 19 దినదినం జబ్బు ఎక్కువవుతూ వచ్చింది. రెండేళ్ళతరువాత ఆ జబ్బువల్ల అతడి పేగులు బయటికి వచ్చాయి. మహా బాధతో అతడు చచ్చిపోయాడు. అతడి ప్రజలు అతడి పూర్వీకులకోసం చేసినట్టు అతడి ఘనతకోసం అగ్ని✽ రగులబెట్టలేదు. 20 యెహోరాం రాజయినప్పుడు అతడి వయస్సు ముప్ఫయి రెండు సంవత్సరాలు. అతడు జెరుసలంలో ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు. అప్పుడు చనిపోయాడు. అతడి మృతికి ఎవరూ విచారపడలేదు✽. అతణ్ణి దావీదునగరంలో పాతిపెట్టారు గాని రాజుల సమాధులలో కాదు.