20
1 ఇలా జరిగాక మోయాబు జాతివాళ్ళు, అమ్మోను జాతివాళ్ళు, కొంతమంది మెయోనివాళ్ళతో కలిసి యెహోషాపాతుతో యుద్ధం చేయడానికి వచ్చారు. 2 కొంతమంది మనుషులు వచ్చి “సరస్సు అవతలనుంచి – సిరియావైపునుంచి – మహా గొప్ప సైన్యం మీమీదికి వస్తూ ఉంది. అది హససోన్‌తామారు (అంటే, ఏన్‌గెది) లో ఉంది.” అని యెహోషాపాతుకు తెలియజేశారు. 3 యెహోషాపాతు భయపడి, యెహోవా సందేశంకోసం విచారణ చేద్దామని నిశ్చయించుకొన్నాడు. యూదా ప్రజలంతా ఉపవాసం ఉండాలని ప్రకటన చేయించాడు. 4 సహాయం చేయమని యెహోవాను ప్రాధేయపడడానికి యూదా ప్రజలంతా సమకూడారు. యెహోవాను వెదకడానికి వారు యూదా పట్టణాలన్నిటినుంచి వచ్చారు. 5 యెహోవా ఆలయం క్రొత్త ఆవరణంలో యూదావారు, జెరుసలంవారు సమావేశం అయ్యారు. యెహోషాపాతు వారిమధ్య నిలబడి ఇలా ప్రార్థన చేశాడు:
6 “యెహోవా! మా పూర్వీకుల దేవా! ఆకాశాలలో దేవుడుగా ఉన్నవానివి నీవే. జనాల రాజ్యాలన్నిటిమీదా పరిపాలన చేస్తున్నది కూడా నీవే. బల ప్రభావాలు నీ చేతిలో ఉన్నాయి. ఎవరు నిన్ను ఎదిరించగలరు? 7 మా దేవా! నీ ఇస్రాయేల్ ప్రజల ఎదుటనుంచి ఈ దేశంలో కాపురమున్న వాళ్ళను వెళ్ళగొట్టి, నీ స్నేహితుడైన అబ్రాహాము సంతానానికి ఎల్లకాలం ఉండేలా ఈ దేశాన్ని ఇచ్చినది నీవే. 8 వారు ఇక్కడ కాపురముంటూ నీ పేరుకు ఇక్కడి పవిత్రాలయం కట్టారు. వారు అన్నారు గదా – 9 ‘ఒకవేళ మామీదికి విపత్తు గానీ ఖడ్గం గానీ తీర్పు గానీ తెగులు గానీ కరవు గానీ వస్తే, నీ పేరు ఉన్న ఈ ఆలయం ఎదుట నీ ముందు నిలబడి ఆపదలో నీకు మొరపెట్టుకొంటాం. నీవు మా మొర విని మమ్మల్ని రక్షిస్తావు.’
10 “అరుగో అమ్మోనువాళ్ళు, మోయాబువాళ్ళు, శేయీరు కొండసీమవాళ్ళు మామీదికి వస్తున్నారు. ఇస్రాయేల్ ప్రజ ఈజిప్ట్ నుంచి వస్తూ ఉన్నప్పుడు నీవు వారిని ఆ దేశాలపై బడనివ్వలేదు. గనుక వారు ఆ దేశాలవాళ్ళను నాశనం చేయక వాళ్ళదగ్గర్నుంచి తొలగిపోయారు. 11 నీవు మాకు స్వాధీనం చేసిన మా వారసత్వంలోనుంచి వాళ్ళు మమ్మల్ని నెట్టివెయ్యడానికి వస్తున్నారు. వాళ్ళు మాకు చేకూర్చబోయే ప్రతిఫలం ఎలాంటిదో చూడు! 12 మా దేవా! వాళ్ళకు తీర్పు తీర్చవా? మామీదికి వస్తున్న ఈ మహా గొప్ప సైన్యం ముందు మేము బలహీనులం. ఏమి చెయ్యాలో మాకు పాలుపోవడం లేదు. అయితే మా కనుదృష్టి మాత్రం నీవైపే ఉంది.”
13 యూదావారంతా యెహోవా సమక్షంలో నిలబడి ఉన్నారు. వారితోకూడా వారి పనివాళ్ళు, భార్యలు, పిల్లలు ఉన్నారు. 14 అప్పుడు సమాజం మధ్యలో ఉన్న యహజియేల్‌ను యెహోవా ఆత్మ ఆవరించాడు. (యహజియేల్ జెకర్యా కొడుకు, జెకర్యా బెనాయా కొడుకు, బెనాయా యెహీయేల్ కొడుకు, యెహీయేల్ మత్తనయా కొడుకు, మత్తనయా లేవీగోత్రికుడూ ఆసాపు సంతతివాడూ.)
15  యహజియేల్ ఇలా ప్రకటించాడు: “యూదావారలారా, జెరుసలం కాపురస్తులారా, యెహోషాపాతురాజా, మీరంతా ఆలకించండి. యెహోవా మీతో చెప్పేదేమిటంటే, ఈ మహా గొప్ప సైన్యానికి భయపడకండి, కలవరపడకండి. ఈ యుద్ధం దేవునిదే గాని మీది కాదు. 16 రేపు వాళ్ళను ఎదుర్కోవడానికి వెళ్ళండి. వాళ్ళు జీజు ఎగువ దారిన వస్తూవుంటారు. మీరు యెరూయేల్ ఎడారి ఎదుట ఉన్న కనుమ కొనదగ్గర వాళ్ళను ఎదుర్కొంటారు. 17 అయితే ఈ యుద్ధంలో మీరు పోరాడనవసరం ఉండదు. మీ స్థానాలలో నిలబడివుండండి. యెహోవా మీ పక్షంగా చేసే విడుదల చూస్తారు. యూదావారలారా, జెరుసలంవారలారా, మీరేమీ భయపడకండి. కలవరపడకండి. రేపు వాళ్ళను ఎదుర్కోవడానికి వెళ్ళండి. యెహోవా మీతో ఉన్నాడు.”
18 అప్పుడు యెహోషాపాతు నేలను సాష్టాంగపడ్డాడు. యూదావారు, జెరుసలం కాపురస్థులంతా యెహోవా ఎదుట సాష్టాంగపడి యెహోవాను ఆరాధించారు. 19 కహాతు వంశానికీ కోరహు వంశానికీ చెందిన లేవీగోత్రికులు కొందరు లేచి, ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాను పెద్ద స్వరంతో స్తుతించారు. 20 ప్రొద్దున్నే వారు తెకోవ ఎడారికి బయలుదేరారు. తరలివెళ్ళే సమయంలో యెహోషాపాతు నిలబడి వారితో “యూదావారలారా, జెరుసలంప్రజలారా, నేను చెప్పేది వినండి. మీ దేవుడైన యెహోవామీద నమ్మకం పెట్టండి. అప్పుడు మీరు స్థిరంగా ఉంటారు. ఆయన ప్రవక్తలను నమ్మండి. అప్పుడు మీరు విజయం సాధిస్తారు” అన్నాడు.
21 యెహోషాపాతు ప్రజలతో సమాలోచన జరిపిన తరువాత యెహోవాను స్తుతించడానికి గాయకులను నియమించాడు. వారు పవిత్ర వస్త్రాలు ధరించి “యెహోవాకు కృతజ్ఞత అర్పించండి. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది” అంటూ సైన్యం ముందు నడుస్తూ వెళ్ళారు. 22 వారు అలా పాటలు పాడడం, స్తుతించడం మొదలు పెట్టినప్పుడు యూదా వారిమీదికి వచ్చే అమ్మోనువాళ్ళమధ్య, మోయాబువాళ్ళమధ్య, శేయీరు కొండసీమవాళ్ళ మధ్య మాటుగాండ్రు ఉండేలా చేశాడు యెహోవా. గనుక వాళ్ళు ఓడిపోయారు. 23 ఎలాగంటే, అమ్మోనువాళ్ళు, మోయాబు వాళ్ళు, శేయీరు కొండసీమవాళ్ళపైకి లేచి వాళ్ళను హతమార్చి నాశనం చేశారు. శేయీరు కొండసీమవాళ్ళను తుదముట్టించిన తరువాత వాళ్ళు ఒకరినొకరు చంపుకొన్నారు.
24 ఎడారి కనిపించే ఆ స్థలానికి యూదావారు వచ్చి ఆ గొప్ప సైన్యంవైపు చూశారు. వారికి నేలను కూలి ఉన్న శవాలే కనబడ్డాయి. ఎవరూ తప్పించుకోలేదు. 25 యెహోషాపాతు, అతని మనుషులు దోపిడీని ఎత్తుకుపోవడానికి ఆ శవాలదగ్గరికి వెళ్ళారు. విస్తారమైన సామాను, వస్త్రాలు, విలువైన వస్తువులు చూచి తమకోసం తీసుకొన్నారు. అవి వారు మోయలేనంతగా ఉన్నాయి. ఆ వస్తువులన్నీ పోగు చేయడంలో మూడు రోజులు పట్టింది. 26 నాలుగో రోజు వారు బెరాకా లోయలో సమకూడి యెహోవాను స్తుతించారు. అందుకే ఆ చోటుకు ‘బెరాకాలోయ’ అని పేరు వచ్చింది. ఈ రోజుకూ ఆ పేరే ఉన్నది.
27 ఈ విధంగా యెహోవా వారి శత్రువులమీద విజయం సాధించి వారికి సంతోషం కలిగించాడు. గనుక యూదావారూ జెరుసలంవారూ అందరూ సంతోషిస్తూ జెరుసలంకు తిరిగి వచ్చారు. వారి ముందు యెహోషాపాతు నడిచాడు. 28 వారు జెరుసలంలో ప్రవేశించి, వేరువేరు తంతివాద్యాలతో, బూరలతో యెహోవా ఆలయానికి చేరుకొన్నారు.
29 ఇస్రాయేల్ ప్రజల శత్రువులతో యెహోవా యుద్ధం చేశాడని దేశాల రాజ్యాలకు వినవచ్చింది. వాటన్నిటినీ దేవుని భయం ఆవరించింది. 30 యెహోషాపాతుకు యెహోవా అన్నివైపులా విశ్రాంతి ప్రసాదించాడు గనుక అతని రాజ్యం ప్రశాంతంగా ఉంది.
31 యెహోషాపాతు యూదాను పరిపాలించాడు. రాజయినప్పుడు అతని వయస్సు ముప్ఫయి అయిదేళ్ళు. అతడు జెరుసలంలో ఇరవై అయిదేళ్ళు పరిపాలన చేశాడు. అతని తల్లి పేరు అజూబా. ఆమె షిలిహీ కూతురు. 32 యెహోషాపాతు తన తండ్రి ఆసా జీవిత విధానాన్ని అనుసరించేవాడు. దానినుంచి తొలగిపోలేదు. యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించేవాడు. 33 కాని ఎత్తయిన పూజాస్థలాలను తీసివేయడం జరగలేదు. ప్రజలు తమ పూర్వీకుల దేవుణ్ణి అనుసరించడానికి హృదయ పూర్వకంగా ఇంకా నిశ్చయించుకోలేదు. 34 యెహోషాపాతును గురించిన ఇతర విషయాలు, మొదటినుంచి చివరివరకు, హనానీ కొడుకు యెహూ వ్రాసిన గ్రంథంలో వ్రాసి ఉన్నది.
35  ఆ తరువాత యూదా రాజు యెహోషాపాతు దుర్మార్గంతో ప్రవర్తించే ఇస్రాయేల్ రాజైన అహజ్యాతో సంధి చేసుకొన్నాడు. 36 తర్షీషువరకు పోగలిగిన ఓడలను చేయించుకోవడానికి అతడితో చేతులు కలిపాడు. వారు ఓడలను ఎసోన్‌గెబెరులో చేయించుకొన్నారు. 37 అప్పుడు మారేషా పట్టణం వాడూ, దోదావాహు కొడుకూ అయిన ఎలియాజరు యెహోషాపాతుకు వ్యతిరేకంగా దేవుని మూలంగా పలుకుతూ “నీవు అహజ్యాతో సంధి చేసుకొన్నందుచేత నీవు చేసినవాటిని యెహోవా నాశనం చేస్తున్నాడు” అన్నాడు. ఆ ఓడలు బ్రద్దలై తర్షీషుకు పోలేకపొయ్యాయి.