19
1 యూదా రాజు యెహోషాపాతు క్షేమంగా జెరుసలంలో తన భవనానికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు, 2 హనానీ కొడుకూ, దీర్ఘదర్శీ అయిన యెహూ అతణ్ణి కలుసుకోవడానికి వెళ్ళాడు. యెహోషాపాతురాజును చూచి అతడు అన్నాడు: “నీవు దుర్మార్గులకు సహాయం చేస్తావా? యెహోవాను ద్వేషించేవారిని ప్రేమిస్తావా? అందువల్ల యెహోవా కోపం నీమీదికి వచ్చింది. 3 అయితే నీలో కొంత మంచి కూడా లేకపోలేదు. నీవు దేశం నుంచి అషేరాదేవి స్తంభాలను తొలగించి, యెహోవాను వెదికి అనుసరించడానికి హృదయపూర్వకంగా నిశ్చయించుకొన్నావు.”
4 యెహోషాపాతు జెరుసలంలో కాపురం ఉంటూ, బేర్‌షెబానుంచి ఎఫ్రాయిం కొండసీమవరకు ప్రజలమధ్య సంచారం చేస్తూ, వారి పూర్వీకుల దేవుడైన యెహోవా వైపుకు వారిని మళ్ళీ త్రిప్పాడు. 5 యూదా దేశంలో కోటలూ ప్రాకారాలూ ఉన్న అన్ని పట్టణాలలో అతడు న్యాయాధికారులను నియమించాడు. 6 అతడు న్యాయాధికారులతో “మీరు తీర్పు తీర్చేటప్పుడు మీకు తోడుగా ఉన్న యెహోవాకోసమే తీర్పు తీరుస్తున్నారు గాని, మనుషులకోసం కాదు, గనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. 7 యెహోవా భయం మీ మీద ఉండాలి. మన దేవుడైన యెహోవా అవినీతిలో పాలుపొందేవాడు కాడు, పక్షపాతం చూపేవాడు కాడు, లంచం పుచ్చుకొనేవాడు కాడు. గనుక మీరు చేసే పనిలో చాలా జాగ్రత్తగా ఉండండి” అన్నాడు.
8 యెహోషాపాతు జెరుసలంలో కూడా కొందరు లేవీగోత్రికులను, యాజులను, ఇస్రాయేల్ కుటుంబాల పెద్దలను నియమించాడు. వారు చేయవలసినది యెహోవా న్యాయాన్ని జరిగించడం, తగాదాలను పరిష్కరించడం. వారు జెరుసలంలోనే కాపురమున్నారు.
9 యెహోషాపాతు వారికి ఇలా ఆదేశించాడు: “యెహోవాపట్ల భయభక్తులు కలిగి, మీరు నమ్మకంగా యథార్థహృదయంతో ప్రవర్తించాలి. 10 పట్టణాలలో నివసించే మీ స్వదేశీయులు మీ దగ్గరికి తెచ్చే ప్రతి విషయమూ – అది రక్తపాతం కానియ్యండి, ధర్మశాస్త్రం, ఆజ్ఞలు, శాసనాలు, చట్టాల సంగతి కానియ్యండి – ప్రతి విషయమూ మీరు విమర్శించేటప్పుడు యెహోవాకు వ్యతిరేకంగా పాపాలు చేయకండి అని వారిని హెచ్చరించాలి. లేకపోతే యెహోవా కోపం మీమీదికి, మీ స్వదేశీయులమీదికి వస్తుంది. మీరు ఈ విధంగా జరిగిస్తే ఆ విషయాలలో మీరు అపరాధులు కాబోరు. 11 యెహోవాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ అమరయా ప్రముఖయాజి మీమీద అధికారిగా ఉంటాడు. రాజుకు సంబంధించిన ప్రతి విషయంలోనూ యూదా గోత్రానికి నాయకుడూ, ఇష్మాయేల్ కొడుకూ అయిన జెబదయా మీ మీద అధికారిగా ఉంటాడు. లేవీగోత్రికులు మీకు ఉద్యోగస్థులుగా ఉండి సేవ జరిగిస్తారు. నిబ్బరంగా ఉండండి. మంచిని జరిగించేవారికి యెహోవా తోడుగా ఉంటాడు.”