17
1 ✝ఆసా స్థానంలో తన కొడుకు యెహోషాపాతు రాజయ్యాడు. ఇస్రాయేల్‌వారు తన పైకి రాకుండా తన రాజ్యాన్ని బలంగా చేసుకొన్నాడు. 2 ✝కోటలూ గోడలూ ఉన్న యూదా పట్టణాలన్నిటిలోనూ అతడు సైనికుల దళాలను ఉంచాడు. యూదాలోనూ, అతని తండ్రి ఆసా పట్టుకొన్న ఎఫ్రాయిం ప్రాంతం పట్టణాలలోనూ కావలి సైనికులను ఉంచాడు. 3 ✝మొదటి రోజుల్లో యెహోషాపాతు తన పూర్వీకుడైన దావీదు అనుసరించిన విధానాలను అనుసరించాడు గనుక యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. యెహోషాపాతు బయల్‌దేవుణ్ణి✽ అనుసరించినవాడు కాడు. 4 ✝అతడు ఇస్రాయేల్‌ప్రజ చేసినట్టు చేయక తన తండ్రియొక్క దేవుణ్ణి వెదికి అనుసరించి ఆయన ఆజ్ఞలు శిరసావహించాడు. 5 అందుచేత యెహోవా అతని వశంలో రాజ్యాన్ని సుస్థిరం చేశాడు. యూదాప్రజలంతా అతనికి కప్పం చెల్లిస్తూ ఉండేవారు గనుక అతనికి ఎంతో గౌరవం, ఐశ్వర్యం చేకూరాయి. 6 యెహోవా విధానాలంటే అతనికి హృదయంలో చాలా ఉత్సాహం. అతడు ఎత్తయిన పూజాస్థలాలనూ అషేరాదేవి స్తంభాలనూ✽ యూదా దేశంలో లేకుండా తొలగించాడు.7 ✽ తాను పరిపాలిస్తున్న మూడో సంవత్సరంలో యూదా పట్టణాలలో ఉపదేశం చేయడానికి అతడు నాయకులను పంపాడు. వారెవరంటే, బెన్‌హయీల్, ఓబద్యా, జెకర్యా, నెతనేల్, మీకా. 8 వారితోపాటు కొంతమంది లేవీగోత్రికులనూ యాజులనూ పంపాడు. లేవీగోత్రికులెవరంటే, షెమయా, నెతనయా, జెబదయా, ఆశాహేల్, షేమిరామోతు, యెహోనాతాను, అదోనీయా, టోబీయా, టోబ్‌అదోనియా. యాజులెవరంటే, ఎలీషామా, యెహోరాం. 9 వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం చేతపట్టుకొని యూదాలో అంతటా ఉపదేశం చేశారు. యూదా పట్టణాలన్నిటికీ సంచారం చేస్తూ ప్రజలకు బోధించారు.
10 ✝యూదా చుట్టుపట్ల ఉన్న రాజ్యాలన్నిటినీ యెహోవా భయం ఆవరించింది గనుక అవి యెహోషాపాతుపై యుద్ధం చేయలేదు. 11 ఫిలిష్తీయవాళ్ళలో కొంతమంది యెహోషాపాతుకు కానుకలు, పన్నుగా వెండిని తెచ్చేవాళ్ళు. అరబీవాళ్ళు అతనికి మందలను తీసుకువచ్చారు. వాళ్ళు తెచ్చినవి ఏడువేల ఏడు వందల పొట్టేళ్ళు, ఏడువేల ఏడు వందల మేకపోతులు.
12 యెహోషాపాతు అధికంగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు. అతడు యూదాలో కోటలూ, సరుకులను కూడబెట్టే ఊళ్ళూ కట్టించాడు. 13 యూదా ఊళ్ళలో అతనికి చాలా సంపద చేకూరింది. జెరుసలంలో అతనికి యుద్ధవీరులున్నారు. 14 వారి పూర్వీకుల వంశాలప్రకారం వారి సంఖ్య ఇలా ఉంది: యూదా గోత్రంలో వేలమందికి అధిపతులుగా ఉన్నవారికి అద్నా అనేవాడు సేనాధిపతి. అతడితో మూడు లక్షలమంది యుద్ధవీరులున్నారు. 15 రెండోవాడు సేనాధిపతి అయిన యోహానాను. అతనితో రెండు లక్షల ఎనభైమంది ఉన్నారు. 16 మూడోవాడు జిఖ్రీ కొడుకు అమసయా. అతడు యెహోవాకు తనను స్వచ్ఛందంగా సమర్పించుకొన్నాడు. అతనితో రెండు లక్షలమంది యుద్ధవీరులున్నారు. 17 బెన్యామీను గోత్రంలో ఎలియాదా అనే యుద్ధ వీరుడుండేవాడు. అతనితో ధనుస్సులూ డాళ్ళూ ధరించిన రెండు లక్షలమంది ఉన్నారు. 18 రెండోవాడు యెహోజాబాద్. అతనితో లక్ష ఎనభై వేలమంది యుద్ధ సన్నద్ధులున్నారు. 19 ✽వీరంతా రాజుకు కొలువు చేసినవారు. వీరు గాక, రాజు యూదాలో అంతటా కోటలూ గోడలూ ఉన్న పట్టణాలలో కొంతమందిని ఉంచాడు.