16
1 ✝ఆసా పరిపాలిస్తున్న ముప్ఫయి ఆరో సంవత్సరంలో ఇలా జరిగింది: ఇస్రాయేల్ రాజు బయెషా యూదాపై దండెత్తి వచ్చి ఆసా దగ్గరికి ఎవరూ వెళ్ళకుండా, అతని దగ్గరనుంచి ఎవరూ రాకుండా చేయడానికి రమా పట్టణం మళ్ళీ కట్టించాడు. 2 ఆ కాలంలో సిరియాకు బెన్‌హదదు రాజుగా ఉండి దమస్కులో నివసించేవాడు. ఆసా యెహోవా ఆలయంలో, రాజభవనంలో ఉన్న ఖజానాలలోని వెండి బంగారాల్ని తీసి, దానిని బెన్‌హదదుకు పంపాడు. 3 అతనికి ఇలా కబురంపాడు:“మీ తండ్రికీ నా తండ్రికీ ఒప్పందం ఉంది. అలాగే మనం ఒప్పందం చేసుకుందాం. మీకు వెండి బంగారాలను కానుకగా పంపిస్తున్నాను. ఇస్రాయేల్ రాజు బయెషా నా దేశంనుంచి వెళ్ళిపోయేలా అతడితో మీకు ఉన్న ఒడంబడికను తెగతెంపులు చేయండి.”
4 ఆసా చేసిన మనవి బెన్‌హదదు అంగీకరించాడు, తన సేనాధిపతులను ఇస్రాయేల్ పట్టణాలపైకి పంపాడు. వాళ్ళు వచ్చి, ఈయోను, దాను, అబెల్‌మయీం పట్టణాలనూ నఫ్తాలిలో సరుకులు కూడబెట్టే పట్టణాలన్నిటినీ పట్టుకొన్నారు. 5 బయెషా ఈ వార్త విని రమాను కట్టించడం ఆపి తన పని నిలిపివేశాడు. 6 అప్పుడు ఆసారాజు యూదా మనుషులందరినీ సమకూర్చాడు. వారు కూడివచ్చి రమా కట్టించడంలో బయెషా ఉపయోగించిన రాళ్ళు, కలప ఎత్తుకుపోయారు. వాటిని ఆసా గెబ, మిస్పాలను మళ్ళీ కట్టించడానికి ఉపయోగించాడు.
7 ✽ఆ సమయంలో హనానీ అనే దీర్ఘదర్శి యూదా రాజైన ఆసా దగ్గరికి వచ్చి అతనితో అన్నాడు “నీవు నీ దేవుడు యెహోవాపై ఆధారపడక, అరాందేశం రాజుపై ఆధారపడ్డావు. అందుచేతే అరాం రాజు సైన్యం నీ చేతిలో పడకుండా తప్పించుకొంది. 8 కూషువాళ్ళూ లూబీయావాళ్ళూ మహా సైన్యంగా చాలా రథాలతో రౌతులతో వచ్చారు గదా! అయినా, నీవు యెహోవాపై ఆధారపడినందుచేత ఆయన వారిని నీ వశం చేశాడు. 9 ✽తనపట్ల యథార్థ హృదయం ఉన్న వ్యక్తికి బలంతో సహాయం చేయడానికి యెహోవా కనుదృష్టి భూమిమీద అంతటా అటూ ఇటూ గాలిస్తూ ఉంది. ఈ విషయంలో నీవు తెలివి తక్కువగా ప్రవర్తించావు. ఇకనుంచి నీకు ఎప్పుడూ యుద్ధాలే.”
10 ఆసాకు ఆ దీర్ఘదర్శిమీద కోపం✽ వచ్చింది. అతనిమీద మండిపడి ఖైదులో వేయించాడు. ఆ సమయంలో ప్రజలలో కొందరిపై ఆసా దౌర్జన్యం చేశాడు కూడా.
11 ✝ఆసాను గురించిన విషయాలు – మొదటిదాని నుంచి చివరిదాని వరకు – యూదా, ఇస్రాయేల్‌ల రాజుల గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 12 ఆసా పరిపాలిస్తున్న ముప్ఫయి తొమ్మిదో సంవత్సరంలో అతనికి పాదాలలో జబ్బు పుట్టింది. దానివల్ల అతడు చాలా బాధపడ్డా, దానిగురించి కూడా యెహోవాను వెదకలేదు గాని వైద్యులనే✽ వెదికాడు. 13 తాను పరిపాలిస్తున్న నలభై ఒకటో సంవత్సరంలో ఆసా కన్ను మూసి✽ తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. 14 తన కోసం అతడు దావీదు నగరంలో తొలిపించుకొన్న సమాధిలో ప్రజలు అతణ్ణి పాతిపెట్టారు. సుగంధ ద్రవ్యాలతో, వేరు వేరు రకాల పరిమళాలతో కప్పి ఉన్న పాడెమీద అతణ్ణి ఉంచి, అతని ఘనతకోసం గొప్ప అగ్ని✽ రగులబెట్టారు.