15
1 దేవుని ఆత్మ ఓబేదు కొడుకైన అజరయా పైకి దిగివచ్చాడు. 2 అతడు ఆసాను కలుసుకోవడానికి వెళ్ళి అతనితో ఇలా చెప్పాడు: “ఆసా! యూదాప్రజలారా! బెన్యామీనుప్రజలారా! నేను చెప్పేది వినండి. మీరు యెహోవా పక్షం వహిస్తే ఆయన మీ పక్షం వహిస్తాడు. ఆయనను వెదికి అనుసరిస్తే ఆయన మీకు దొరుకుతాడు, ఆయనను మీరు వదిలి వేస్తే మిమ్మల్ని ఆయన వదలివేస్తాడు. 3 సత్య దేవుడు గానీ, ఉపదేశించే యాజి గానీ, ధర్మశాస్త్రం గానీ లేకుండా ఇస్రాయేల్ ప్రజలు చాలా కాలం గడిపారు. 4 బాధలలో వారు ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవావైపు తిరిగి ఆయనను వెదికారు. ఆయన వారికి దొరికాడు. 5 ఆ రోజుల్లో అన్ని దేశాల జనాలూ గొప్ప కలవరంలో ఉన్నారు. ఎవరైనా ప్రయాణం చేయడం క్షేమకరం కాదు. 6 దేవుడు జనాలను అన్ని రకాల బాధలతో కష్టపెట్టాడు గనుక ఒక దేశాన్ని మరో దేశం, ఒక నగరాన్ని మరో నగరం చితగ్గొట్టేవి. 7 మీరు మాత్రం బలం పుంజుకోండి! నిరుత్సాహపడకండి! మీరు చేసే పనికి బహుమతి ఉంటుంది.”
8 ఓబేదు కొడుకైన అజరయా ప్రవక్త దేవుని మూలంగా చెప్పిన మాటలు ఆసా విని ధైర్యం తెచ్చుకొన్నాడు. యూదాప్రదేశంలోనూ, బెన్యామీను ప్రదేశంలోనూ, ఎఫ్రాయిం కొండసీమలో తాను వశం చేసుకొన్న పట్టణాలలోనూ ఉన్న విగ్రహాలను, ఆ అసహ్యమైనవాటన్నిటినీ తీసివేశాడు. యెహోవా ఆలయం వసారా ఎదుట ఉన్న బలిపీఠాన్ని మరమ్మత్తు చేయించాడు. 9 అతని దేవుడైన యెహోవా ఆసాకు తోడుగా ఉండడం చూచి చాలామంది ఇస్రాయేల్ రాజ్యాన్ని విడిచి అతని పక్షం చేరారు. ఆసా తనదగ్గరికి యూదా వారందరినీ బెన్యామీనువారందరినీ వారిమధ్య కాపుర మేర్చరచుకొన్న ఎఫ్రాయిం, మనష్షే, షిమ్యోను గోత్రాల వారినీ సమకూర్చాడు. 10 ఆసా పరిపాలిస్తున్న పదిహేనో సంవత్సరం మూడో నెల వారు జెరుసలంలో సమకూడారు. 11 ఆ రోజు వారు యెహోవాకు ఏడు వందల ఎద్దులను, ఏడు వేల గొర్రెలను బలిగా అర్పించారు. ఇవన్నీ వారు దోపిడీగా తీసుకు వచ్చిన వాటిలో ఉండేవి. 12 వారు తమ పూర్వీకుల దేవుడు యెహోవాను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వెదికి అనుసరిస్తామని ఒడంబడిక చేశారు. 13 ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాను వెదకనివారికి స్త్రీలకు గానీ పురుషులకు గానీ పెద్దలకు గానీ పిన్నలకు గానీ మరణశిక్ష విధించాలని నిర్ణయించారు. 14 వారు కంఠమెత్తి పెద్దగా కేకలువేస్తూ, బూరలూ పొట్టేళ్ళ కొమ్ములూ ఊదుతూ, యెహోవా సమక్షంలో శపథం చేశారు. 15 ఈ విధంగా యూదావారంతా హృదయపూర్వకంగా శపథం చేశారు. గనుక శపథం విషయం అందరూ సంతోషించారు. వారు మనసారా యెహోవాను వెదికారు. ఆయన వారికి దొరికాడు, అన్ని దిశలా వారికి విశ్రాంతి ప్రసాదించాడు.
16 ఆసారాజు అవ్వ మయకా అషేరాదేవికి ఒక అసహ్యమైన స్తంభాన్ని చేయించింది. అందుచేత అతడు ఆమెను రాజమాతగా ఉండకుండా తొలగించాడు. ఆ దేవి స్తంభాన్ని నరికివేసి కిద్రోను లోయలో తగులబెట్టాడు. 17 ఇస్రాయేల్‌వారి మధ్య ఎత్తు పూజా స్థలాలను ఉండనిచ్చాడు గాని, ఆసాకు తాను బ్రతికినన్నాళ్ళూ యథార్థహృదయం ఉంది. 18 యెహోవాకు తాను, తన తండ్రి ప్రతిష్ఠ చేసిన వెండి బంగారాలను, పాత్రలను దేవుని ఆలయానికి తెచ్చాడు. 19 ఆసా పరిపాలనలో ముప్ఫయి అయిదో సంవత్సరం వరకు యుద్ధాలు లేవు.