14
1 అబీయా కన్ను మూసి✽ తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. ప్రజలు అతణ్ణి దావీదునగరంలో సమాధి చేశారు. అతని స్థానంలో అతని కొడుకు ఆసా రాజయ్యాడు. ఆసా రోజుల్లో పది సంవత్సరాలు దేశం ప్రశాంతంగా ఉంది. 2 ✝ఆసా యెహోవా దృష్టిలో సరిగా, న్యాయంగా ప్రవర్తించేవాడు. 3 అతడు విదేశీయ బలిపీఠాలనూ ఎత్తయిన పూజాస్థలాలనూ తొలగించివేశాడు. విగ్రహాలను పగల గొట్టించాడు, అషేరాదేవి స్తంభాలను పడగొట్టించాడు. 4 ఆసా వారి పూర్వీకుల దేవుడు యెహోవాను వెదికి✽ అనుసరించాలని యూదాప్రజకు ఆజ్ఞ ఇచ్చాడు, దేవుని ధర్మశాస్త్రం, ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించాలని ఆదేశించాడు. 5 యూదాలో ఏ పట్టణాలలో ఎత్తయిన పూజాస్థలాలూ✽ ధూపవేదికలూ ఉన్నాయో ఆ పట్టణాలన్నిటినుంచి వాటిని తీసివేశాడు. అతని పరిపాలనలో రాజ్యం ప్రశాంతంగా ఉంది. 6 దేశం ప్రశాంతంగా✽ ఉన్నప్పుడు అతడు యూదాలోకి కోటలూ గోడలూ ఉన్న పట్టణాలను కట్టించాడు. యెహోవా అతనికి విశ్రాంతి ప్రసాదించినందుచేత ఆ సంవత్సరాలలో అతనితో ఎవరూ యుద్ధం చేయలేదు.7 ఆసా యూదావారితో ఇలా అన్నాడు: “మనం యెహోవాను వెదకి అనుసరించాం, గనుక ఈ దేశం ఇంకా మన స్వాధీనంలో ఉంది. ఆయనను వెదకి అనుసరించాం గనుక ఆయన మనకు అన్ని వైపులా నెమ్మది కలిగించాడు. గనుక, మనం ఈ పట్టణాలను కట్టి, వాటికి చుట్టు గోడలను, గోపురాలను, ద్వారం తలుపులను, అడ్డగడియలను అమర్చుదాం.” అలాగే వారు పట్టణాలను కట్టి వర్ధిల్లారు.
8 ఆసాకు యూదావారిలో మూడు లక్షలమంది సైనికులు ఉన్నారు. వారికి పెద్ద డాళ్ళూ ఈటెలూ ఉన్నాయి. అతనికి బెన్యామీను వారిలో రెండు లక్షల ఎనభై వేలమంది సైనికులున్నారు. వారికి చిన్న డాళ్ళూ ధనుస్సులూ ఉన్నాయి. వీరంతా యుద్ధ వీరులు.
9 తరువాత కూషువాడైన జెరహు వేలాది వేల సైన్యంతో, మూడు వందల రథాలతో వారిపై దండెత్తి వచ్చాడు. అతడు మారేషా✽ పట్టణం వరకు చేరాడు. 10 ఆసా అతడికి ఎదురుగా వెళ్ళాడు. వారు మారేషాకు దగ్గరలో ఉన్న జెపాతా లోయలో బారులు తీరారు.
11 ✝అప్పుడు ఆసా యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు. “యెహోవా, బలవంతులతో యుద్ధంలో బలహీనులకు సహాయం చేయడానికి నీవు తప్ప ఇంకెవరూ లేరు. యెహోవా, మా దేవా, మేము నీమీద నమ్మకం ఉంచుతున్నాం. నీ పేర మేము ఈ మహా సైన్యాన్ని ఎదిరించడానికి వచ్చాం. గనుక సహాయం చెయ్యి. యెహోవా, నీవే మా దేవుడివి. మానవమాత్రులను నీపై విజయం సాధించనియ్యకు.”
12 ఆసా ఎదుటా యూదావారి ఎదుటా యెహోవా కూషువాళ్ళును మొత్తాడు. వాళ్ళు పారిపొయ్యారు. 13 ఆసా, అతనితో ఉన్నవారు వాళ్ళను గెరారువరకు తరిమారు. కూషువాళ్ళలో చాలా మంది కూలారు, గనుక వాళ్ళు మళ్ళీ బలాన్ని కూడగట్టుకోలేకపోయారు. యెహోవా ఎదుటా ఆయన సైన్యం ఎదుటా వాళ్ళు చితికిపొయ్యారు. యూదావారు చాలా కొల్లసొమ్ము పట్టుకుపోయారు. 14 గెరారు చుట్టూరా ఉన్న గ్రామాలను యెహోవా భయం✽ ఆవరించింది గనుక యూదావారు వాటన్నిటినీ ఓడగొట్టి దోచుకొని, చాలా కొల్లసొమ్ము తీసుకొన్నారు. 15 పశువులున్న దొడ్లపై బడి చాలా మందలను, ఒంటెలను వశం చేసుకొన్నారు. అప్పుడు వారు జెరుసలంకు తిరిగి వెళ్ళారు.