13
1 ✽ యరొబాంరాజు పరిపాలిస్తున్న పద్ధెనిమిదో సంవత్సరంలో అబీయా యూదాకు రాజయ్యాడు. 2 అతడు జెరుసలంలో మూడేళ్ళు పరిపాలించాడు. అతడి తల్లి గిబియావాడైన ఊరియేల్ కూతురు మీకాయా. అబీయాకూ యరొబాంకూ యుద్ధం జరిగింది. 3 అబీయా నాలుగు లక్షలమంది యుద్ధ వీరులను ఎన్నుకొని యుద్ధం ఆరంభించాడు. అతనికి ఎదురుగా పోరాడడానికి యరొబాం ఎనిమిది లక్షలమంది యుద్ధ వీరులను వ్యూహమేర్పరచాడు. 4 ✽అబీయా ఎఫ్రాయిం కొండసీమలో ఉన్న సెమరాయిం కొండమీద నిలబడి ఇలా అన్నాడు: “యరొబాం! ఇస్రాయేల్ ప్రజలారా!✽ నేను చెప్పేది వినండి. 5 ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా మార్పులేని✽ ఒడంబడిక చేసి, ఇస్రాయేల్ రాజ్య పరిపాలన శాశ్వతంగా దావీదుకూ దావీదు✽ సంతతివారికీ ఇచ్చాడు. ఈ సంగతి మీకు తెలుసు గదా. 6 ✝అయినా, దావీదు కుమారుడైన సొలొమోను సేవకుడూ నెబాతు కొడుకూ అయిన యరొబాం తన యజమాని మీద తిరుగుబాటు చేశాడు. 7 పనికిమాలిన నీచులు కొంతమంది అతడి పక్షం చేరారు. ఆ సమయంలో సొలొమోను కొడుకు రెహబాం యువదశ✽లో ఉన్నాడు. వారిని ఎదిరించేటంత ధైర్యం, బలం లేనివాడు. అలాంటప్పుడు వాళ్ళు ఆయనను వ్యతిరేకించారు.8 “ఇప్పుడు దావీదు సంతతివారి వశంలో ఉన్న యెహోవా✽ రాజ్యాన్ని ఎదిరించడానికి మీరు తెగించారు. మీరు మహా గొప్ప సైన్యంగా ఉన్నారు. యరొబాం మీకు దేవుళ్ళుగా చేయించిన బంగారు దూడలు✽ మీతో ఉన్నాయి. 9 మీరు అహరోను వంశానికి చెందిన యెహోవా యాజులనూ✽ లేవీగోత్రికులనూ వెళ్ళగొట్టి, ఇతర దేశాలవాళ్ళు చేస్తున్నట్టే మీ కోసం యాజులను ఏర్పాటు చేసుకొన్నారు గదా! ఎవడైనా సరే ఒక కోడెదూడతో, ఏడు పొట్టేళ్ళతో తనను ప్రతిష్ఠించుకోవడానికి వస్తే, దేవుడు కానివాటికి✽ యాజిగా అవుతాడు.
10 ✽“మాకైతే యెహోవాయే దేవుడు. మేము ఆయనను విడిచిపెట్టలేదు. యెహోవాకు సేవ చేసే యాజులు అహరోను సంతానమే. లేవీగోత్రికులు కూడా సేవ జరిగిస్తున్నారు. 11 ✽ ప్రొద్దున, సాయంత్రం వారు యెహోవాకు హోమబలులు అర్పిస్తున్నారు, పరిమళధూపం వేస్తున్నారు. వారు పవిత్రమైన బల్లమీద రొట్టెలు ఉంచుతారు. ప్రతి సాయంకాలమూ బంగారు సప్తదీపస్తంభాలపై ఉన్న ప్రమిదెలు వెలిగిస్తారు. యెహోవా ఏర్పాటు చేసిన క్రమం ప్రకారమే మేము అంతా జరిగిస్తున్నాం. కాని, మీరు ఆయనను విడిచిపెట్టారు.
12 ✝“వినండి! దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఆయనే మా నాయకుడు. మా పక్షంగా బూరలు పట్టుకొని మీమీద ఆర్భాటం చేసేవారు దేవుని యాజులే. ఇస్రాయేల్ ప్రజలారా, మీ పూర్వీకుల దేవుడైన యెహోవాతో యుద్ధం చేయకండి. చేసినా మీరు గెలవరు.”
13 అంతకు ముందు యరొబాం యూదావారి వెనుక మాటు కాయడానికి కొందరిని పంపాడు. వాళ్ళు యూదావారి వెనుక పొంచి ఉంటే, యరొబాం సైన్యం యూదావారికి ముందు ఉంది. 14 యూదావారు వెనుకవైపు చూచినప్పుడు, సైన్యం తమకు ముందూ వెనుకా ముట్టడించి ఉన్నట్టు తెలుసుకొన్నారు. అప్పుడు వారు యెహోవాకు ప్రార్థన చేశారు✽. యాజులు బూరలు ఊదారు, 15 యూదావారు యుద్ధనాదం చేశారు. వారు చేసిన యుద్ధనాదం వినబడడంతోనే దేవుడు అబీయా ఎదుటా, యూదావారి ఎదుటా యరొబాంనూ, ఇస్రాయేల్ సైన్యాన్నంతా మొత్తాడు. 16 ఇస్రాయేల్‌వారు యూదావారి ఎదుటనుంచి పారిపోయారు. దేవుడు వారిని యూదావారి వశం చేశాడు.
17 అబీయా, అతడి మనుషులు వారిని ఓడించి ఘోరంగా హతమార్చారు. ఇస్రాయేల్‌వారిలో అయిదు లక్షలమంది శూరులు హతులయ్యారు.
18 ✝ఆ సమయంలో ఆ విధంగా ఇస్రాయేల్‌వారిని తగ్గించడం జరిగింది. యూదావారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవా మీద నమ్మకం ఉంచారు. గనుకనే వారికి విజయం చేకూరింది. 19 అబీయా యరొబాంను తరిమి, అతడి వశంలోనుంచి బేతేల్‌నూ యెషానానూ ఎఫ్రోనునూ, వాటి చుట్టుప్రక్కల గ్రామాలనూ పట్టుకొన్నాడు.
20 ✝అబీయా రోజుల్లో యరొబాం మళ్ళీ బలాన్ని కూడగట్టుకోలేదు. తరువాత దేవుడు అతణ్ణి మొత్తాడు, అతడు చనిపోయాడు.
21 అయితే అబీయా బలాభివృద్ధి చెందాడు. అతడు పద్నాలుగుమంది స్త్రీలను పెళ్ళి చేసుకొన్నాడు. అతడికి ఇరవై రెండు మంది కొడుకులు, పదహారుమంది కూతుళ్ళు పుట్టారు.
22 ✽ అబీయాను గురించిన ఇతర విషయాలు, అతడి జీవిత విధానం, మాటలు ఇద్దో ప్రవక్త వ్రాసిన వ్యాఖ్యానంలో ఉన్నాయి.