12
1 రెహబాం రాజ్యం సుస్థిరంగా, అతని స్థితి బలంగా అయిన తరువాత అతడూ, ఇస్రాయేల్ ప్రజలంతా యెహోవా ధర్మశాస్త్రం విడిచిపెట్టారు. 2 వారు యెహోవామీద చేసిన ద్రోహం ఫలితంగా రెహబాంరాజు పరిపాలిస్తున్న అయిదో సంవత్సరంలో ఈజిప్ట్ రాజైన షీషక్ జెరుసలంపైకి వచ్చాడు. 3 అతనితో కూడా పన్నెండు వందల రథాలూ, అరవై వేలమంది రౌతులూ, లెక్కలేనంతమంది లూబీయా దేశంవాళ్ళూ, సుక్కీవాళ్ళూ, కూషు దేశంవాళ్ళూ ఈజిప్ట్ నుంచి వచ్చారు. 4 షీషక్ యూదాలో కోటలూ ప్రాకారాలూ ఉన్న పట్టణాలను పట్టుకొని, తరువాత జెరుసలం వరకు వచ్చాడు.
5 అప్పుడు షీషక్‌కు భయపడి యూదా అధిపతులు రెహబాం జెరుసలంలో సమకూడి ఉంటే వారి దగ్గరికి షెమయా ప్రవక్త వచ్చాడు. అతడు వారితో చెప్పాడు “యెహోవా చెప్పేదేమిటంటే, మీరు నన్ను విడిచిపెట్టారు. గనుక మిమ్ములను షీషక్ చేతిలో విడిచిపెట్టాను.”
6 రాజూ ఇస్రాయేల్ అధికారులూ వినయంగా తలవంచుకొని “యెహోవా న్యాయం గలవాడు” అని ఒప్పుకొన్నారు. 7 వారు అలా తలవంచుకోవడం యెహోవా చూశాడు, గనుక యెహోవా నుంచి ఈ వాక్కు షెమయాకు వచ్చింది: “వారు వినయంగా తలవంచుకొన్నారు గదా. గనుక నేను వారిని నాశనం చేయను. త్వరలో వారిని రక్షిస్తాను. షీషక్ ద్వారా నా కోపాగ్ని జెరుసలంమీద కుమ్మరించను. 8 కాని, వారు షీషక్‌కు లొంగిపోవలసి వస్తుంది. ఎందుకంటే, నాకు సేవ చేయడంలో, ఇతర దేశాల రాజులకు సేవ చేయడంలో ఉన్న తేడా వారు గ్రహించాలి.”
9 ఈజిప్ట్ రాజైన షీషక్ జెరుసలం పైకి వచ్చినప్పుడు, అతడు యెహోవా ఆలయంలో, రాజభవనంలో ఉన్న విలువైన వస్తువులన్నిటినీ దోచుకొన్నాడు. సొలొమోను చేయించిన బంగారు డాళ్ళను కూడా తీసుకుపోయాడు. 10 రెహబాంరాజు ఆ డాళ్ళకు బదులు కంచు డాళ్ళు చేయించాడు. వాటిని రాజభవనం ద్వారాన్ని కాపలా కాసే రక్షకభటుల నాయకుడికి అప్పచెప్పాడు. 11 యెహోవా ఆలయానికి రాజు వచ్చినప్పుడెల్లా అతడి వెంట భటులు ఆ డాళ్ళు మోసుకు పోయేవారు. తరువాత వాటిని తమ గదిలో ఉంచేవారు.
12 రెహబాం వినయంగా తలవంచుకొన్నందుచేత, యూదాలో కొన్ని మంచి విషయాలు కనిపించినందుచేత యెహోవా అతణ్ణి పూర్తిగా నాశనం చేయక, అతడి మీదనుంచి తన కోపం మళ్ళించుకొన్నాడు. 13 రెహబాంరాజు జెరుసలంలో సుస్థిరంగా ఉండి పరిపాలిస్తూ వచ్చాడు. రెహబాం పరిపాలనకు వచ్చినప్పుడు అతడి వయస్సు నలభై ఒకటి. అతడు జెరుసలంలో పదిహేడేళ్ళు పరిపాలించాడు. ఆ నగరం తన పేరు ఉంచుకోవడానికి ఇస్రాయేల్ గోత్రాల నివాస స్థలాలన్నిటి లోనుంచి యెహోవా ఎన్నుకొన్న నగరం. రెహబాం తల్లి పేరు నయమా. ఆమె అమ్మోను దేశస్థురాలు. 14 రెహబాం యెహోవాను వెదకడం మీద మనసు నిలుపుకోలేదు, గనుక చెడుగా ప్రవర్తించేవాడు.
15 రెహబాంను గురించిన విషయాలు మొదటినుంచి చివరి వరకు – షెమయా ప్రవక్త వ్రాసిన గ్రంథంలోనూ దీర్ఘదర్శి అయిన ఇద్దో వ్రాసిన వంశవృక్షాల విషయమైన గ్రంథంలోనూ ఉన్నాయి. రెహబాంకు యరొబాంకు ఎప్పుడూ యుద్ధం జరుగుతూ ఉంది. 16 రెహబాం కన్ను మూసి తన పూర్వీకుల దగ్గరికిచేరాడు. దావీదు నగరంలో అతణ్ణి తన పూర్వీకుల దగ్గర సమాధి చేశారు. అతడి స్థానంలో అతడి కొడుకు అబీయా రాజయ్యాడు.