11
1  రెహబాం జెరుసలం చేరుకొన్నాడు. అక్కడ యూదా గోత్రంవారిలో, బెన్యామీను గోత్రంవారిలో ఉత్తములైన సిపాయిలను పోగుచేశాడు. వారు లక్ష ఎనభై వేలమంది. వారు ఇస్రాయేల్ రాజ్యంమీద యుద్ధం చేసి, తనకు ఆ రాజ్యం సంపాదించాలని రెహబాం ఉద్దేశించాడు. 2 కాని, దేవుని మనిషి అయిన షెమయాకు యెహోవానుంచి ఈ వాక్కు వచ్చింది. 3 “యూదావారికి రాజుగా ఉన్న సొలొమోను కొడుకు రెహబాంకూ, యూదాలో, బెన్యామీనులో ఉన్న ఇస్రాయేల్ ప్రజలందరికీ ఇలా చెప్పు: 4 యెహోవా ఈవిధంగా చెప్తున్నాడు – మీరు వెళ్ళి మీ బంధువులతో యుద్ధం చేయకూడదు. జరిగినదానిని నేనే జరిగించాను. గనుక మీరంతా మీమీ ఇండ్లకు తిరిగి వెళ్ళండి.” అలాగే వారు యెహోవా మాట విని, యరొబాంతో యుద్ధానికి వెళ్ళడం మాని తిరిగి వచ్చారు.
5 రెహబాం జెరుసలంలో కాపురం ఉంటూ, యూదాలో కొన్ని పట్టణాలలో రక్షణార్థమైన కట్టడాలను కట్టించాడు. 6 ఆ పట్టణాలు ఏవంటే, బేత్లెహేం, ఏతాం, తెకోవ, 7 బేత్‌సూరు, శోకో, అదుల్లాం, 8 గాత్, మారేషా, జీపు, 9 ఆదోరయీం, లాకీషు, అజేకా, 10 జొర్యా, అయ్యాలోను, హెబ్రోను. ఇవన్నీ యూదా, బెన్యామీనులలో ఉన్నాయి. అవి కోటలూ గోడలూ ఉన్న ఊళ్ళు. 11 రెహబాం వాటి కోటలనూ గోడలనూ బలంగా చేసి, వాటిలో అధిపతులను ఉంచాడు. వాటికి ఆహారపదార్థాలు, నూనె, ద్రాక్షరసం సరఫరా చేశాడు. 12 ఆ ఊళ్ళన్నిటిలో డాళ్ళను, ఈటెలను ఉంచి, వాటిని చాలా బలమైన ఊళ్ళుగా చేశాడు. ఈ విధంగా యూదా బెన్యామీనులు అతడి వంశంలో ఉండిపొయ్యాయి.
13 ఇస్రాయేల్‌వారిమధ్య నివసిస్తున్న యాజులు, లేవీ గోత్రికులు తమ ప్రాంతాలన్నిటినుంచి వచ్చి రెహబాం దగ్గరికి చేరారు. 14 యాజి ధర్మం జరిగించనివ్వకుండా లేవీగోత్రికులను యరొబాం, అతడి కొడుకులు త్రోసివేశారు. గనుక వారు తమ పచ్చిక మైదానాలనూ ఆస్తిపాస్తులనూ విడిచి, యూదాకు, జెరుసలంకు వచ్చారు. 15 బలిపీఠాలకు, దయ్యాలకు, తాను చేయించిన దూడ ఆకారాలకు పూజారులుగా ఉండడానికి యరొబాం తానే మనుషులను నియమించాడు. 16 ఇలా ఉండగా, ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాను వెదకుదామని మనసులో నిశ్చయించుకొన్నవారు ఇస్రాయేల్ గోత్రాలన్నిటిలో కొందరు ఉన్నారు. తమ పూర్వీకుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించేందుకు వారు జెరుసలంకు లేవీగోత్రికులను అనుసరించారు. 17 దావీదు, సొలొమోను నడిచిన మార్గాన్నే వారు మూడేళ్ళు అనుసరించారు. ఈ మూడు సంవత్సరాలు యూదా రాజ్యాన్ని బలపరచి, సొలొమోను కొడుకు రెహబాంకు సహాయం చేసేవారు.
18 రెహబాం మహలతునూ అబీహాయిల్‌నూ పెండ్లి చేసుకొన్నాడు. మహలతు దావీదు కొడుకైన యెరీమోతు కూతురు. అబీహాయిల్ యెష్షయి కొడుకైన ఏలీయాబ్ కూతురు. 19 రెహబాంకు యషు, షెమరయా, జహం అనే కొడుకులు పుట్టారు. 20 ఆ తరువాత అతడు అబ్‌షాలోం కూతురైన మయకాను పెండ్లి చేసుకొన్నాడు. ఆమె ద్వారా అతనికి అబీయా, అత్తయి, జీజా, షెలోమీతు పుట్టారు. 21 రెహబాంకు పద్ధెనిమిదిమంది భార్యలు, అరవైమంది ఉంపుడుకత్తెలు ఉన్నారు. ఇరవై ఎనిమిదిమంది కొడుకులు అరవైమంది కూతుళ్ళు పుట్టారు. తన భార్యలందరిలోకి, ఉంపుడుకత్తెలందరిలోకి అబ్‌షాలోం కూతురు మయకా అంటే రెహబాంకు ఎక్కువ ప్రేమ. 22 మయకా కొడుకు అబీయాను రాజుగా చేయాలనుకొని, రెహబాం అతణ్ణి తన సోదరులపైన ప్రముఖుడుగానూ, నాయకుడుగానూ నియమించాడు. 23 రెహబాం తెలివిగా ప్రవర్తిస్తూ, తక్కిన తన కొడుకులను యూదాలో, బెన్యామీనులో వేరు వేరు ప్రాంతాలకూ, కోటలూ గోడలూ ఉన్న ఊళ్ళకు పంపాడు. వారికి సమృద్ధిగా పోషణ ఇచ్చి వారికి అనేక పెండ్లిండ్లు చేశాడు.