10
1 ✝రెహబాంను రాజుగా చేయడానికి ఇస్రాయేల్ ప్రజలంతా షెకెంకు వెళ్ళినందుచేత రెహబాం అక్కడికి వెళ్ళాడు. 2 నెబాతు కొడుకైన యరొబాం✽ సొలొమోను దగ్గర నుంచి ఈజిప్ట్‌కు పారిపోయి, అక్కడ నివసిస్తున్నాడు. రెహబాం రాజయిన సంగతి విన్నప్పుడు అతడు ఈజిప్ట్ నుంచి తిరిగి వచ్చాడు. 3 ఇస్రాయేల్ వారు అతణ్ణి పిలవనంపించారు. అతడూ ఇస్రాయేల్ వారంతా రెహబాం దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: “మీ తండ్రి మామీద క్రూరమైన కాడి మోపాడు. 4 మీ తండ్రి పెట్టిన కఠినమైన సేవను, మామీద ఉంచిన క్రూరమైన కాడిని తేలిక చేయండి. అప్పుడు మేము మీకు సేవ చేస్తాం.”5 రెహబాం “మీరు మూడు రోజులయ్యాక మళ్ళీ రండి” అని వారితో చెప్పాడు. ప్రజలు వెళ్ళిపోయారు.
6 తన తండ్రి సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతడి పరివారంలో ఉన్న పెద్దలతో రెహబాంరాజు ఆలోచన చేశాడు. “ఈ ప్రజలకు ఏం జవాబు ఇవ్వాలో మీ సలహా చెప్పండి” అని అడిగాడు.
7 అందుకు వారు అన్నారు “మీరు ఈ ప్రజలమీద దయ చూపి వారిని సంతోషపరచి వారికి మృదువుగా జవాబు చెప్పితే వారు ఎప్పటికీ మీకు సేవకులుగా ఉంటారు.”
8 కానీ పెద్దలు చెప్పిన ఆలోచనను రెహబాం పెడచెవిని పెట్టాడు. తనతోపాటు పెరిగి తన పరివారంలో ఉన్న యువకులను పిలిచి సమాలోచన జరిపాడు. 9 “ఈ ప్రజ వారిమీద నా తండ్రి పెట్టిన కాడిని తేలిక చేయండని నాకు మనవి చేస్తున్నారు. వాళ్ళకు ఏమని జవాబు చెప్పాలి? మీ సలహా ఏమిటో చెప్పండి” అని వారితో చెప్పాడు.
10 అతడితోపాటు పెరిగిన ఆ యువకులు చెప్పిన సలహా ఇది: “ఈ ప్రజ ‘మీ తండ్రి మామీద క్రూరమైన కాడి ఉంచాడు. మీరు దానిని తేలిక చేయండి’ అన్నారుగా. నీవు వారితో ఇలా చెప్పాలి – నా తండ్రి నడుంకంటే నా చిటికెన వ్రేలు పెద్దదిగా ఉంటుంది. 11 నా తండ్రి మీమీద క్రూరమైన కాడి ఉంచాడు. సరి గదా! నేను దానిని ఇంకా క్రూరంగా చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని మామూలు కొరడాలతో శిక్షించాడుగా. నేను మిమ్మల్ని తేళ్ళతో దండిస్తాను.”
12 రెహబాంరాజు “మూడో రోజు నా దగ్గరికి మళ్ళీ రండి” అని చెప్పినట్టు యరొబాం, ప్రజలంతా మూడో రోజున అతడిదగ్గరికి వచ్చారు. 13 పెద్దలు చెప్పిన మాట పెడచెవిని బెట్టి రాజు వారికి కటువుగా జవాబిచ్చాడు. 14 ఆ యువకులు చెప్పిన సలహా ప్రకారం ఇలా అన్నాడు: “నా తండ్రి మీమీద క్రూరమైన కాడి ఉంచాడు. సరి గదా! నేను దానిని ఇంకా క్రూరంగా చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని మామూలు కొరడాలతో శిక్షించాడుగా. నేను మిమ్మల్ని తేళ్ళతో దండిస్తాను.”
15 రాజు ప్రజల మాట వినిపించుకోలేదు. దేవునిచేత అలా జరిగింది. యెహోవా షిలోహువాడైన అహీయా✽ ద్వారా నెబాతు కొడుకైన యరొబాంతో పలికించిన మాట అలా నెరవేర్చాడు.
16 ✝తమ విన్నపం రాజు తిరస్కరించడం చూచి ఇస్రాయేల్ వారంతా రాజుకు ఇలా జవాబిచ్చారు: “దావీదు వంశంతో మాకేం సంబంధం! యెష్షయి కొడుకుతో ఇంకా భాగస్థులం కాము. ఇస్రాయేల్ ప్రజలారా! మీమీ నివాసాలకు వెళ్ళిపోండి! దావీదు వంశమా, నీ సంగతి నీవే చూచుకో!” అప్పుడు ఇస్రాయేల్ ప్రజలంతా వారి వారి నివాసాలకు వెళ్ళారు. 17 కాని, యూదాలో ఉన్న పట్టణాలలో నివసించే ఇస్రాయేల్‌వారు రెహబాం అధికారం క్రింద ఉండిపోయారు.
18 తరువాత రెహబాంరాజు వెట్టి పనివాళ్ళమీద అధికారి అయిన అదోరాంను ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి పంపాడు. వారు రాళ్ళు రువ్వి అదోరాంను చంపారు. గనుక, రెహబాంరాజు జెరుసలం పారిపోదామని తొందరగా రథమెక్కాడు. 19 అప్పటినుంచి ఈనాటికీ దావీదు రాజవంశంమీద ఇస్రాయేల్ ప్రజలు తిరగబడుతూ ఉన్నారు.