9
1  సొలొమోను ప్రఖ్యాతి విషయం షేబ దేశం రాణి విన్నది. చిక్కు ప్రశ్నలతో అతణ్ణి పరీక్ష చేద్దామని ఆమె జెరుసలంకు వచ్చింది. ఆమె ఒంటెలమీద సుగంధ ద్రవ్యాలు, చాలా బంగారం, వెలగల రాళ్ళు ఎక్కించి, గొప్ప పరివారంతో బయలుదేరి జెరుసలంకు చేరింది. ఆమె సొలొమోను దగ్గరికి వచ్చి, తన మనసులో ఉన్నదంతా విడమరచి చెప్పింది. 2 ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను జవాబులు చెప్పాడు. వాటిలో అతడు భావం చెప్పలేని సంగతి ఏదీ లేదు. 3 సొలొమోను జ్ఞానాన్ని షేబ రాణి గుర్తించింది. అతడు కట్టించిన భవనం చూచింది. 4 బల్ల దగ్గర వారు తినే భోజన పదార్థాలనూ అక్కడ కూర్చుని ఉన్న అతడి పరివారాన్నీ నిలబడి ఉన్న అతడి పరిచారకులనూ వారి వస్త్రాలనూ పాత్రలు అందించేవారినీ కూడా కళ్ళారా చూచింది. యెహోవా ఆలయంలో అతడు హోమబలులు అర్పించిన సంగతి కూడా చూచింది. ఆమెకు కలిగిన ఆశ్చర్యం అంతింత కాదు.
5 అప్పుడు రాజుతో ఆమె అంది, “మీ గురించీ మీ జ్ఞానం గురించీ నేను నా దేశంలో విన్న కబురు నిజమే! 6 అయినా నేను వచ్చి కండ్లారా చూచేవరకు నేను వారి మాటలు నమ్మలేకపోయాను. నిజంగా మీ గొప్ప జ్ఞానం గురించి సగమైనా నాకు వినిపించలేదు. నేను విన్నదానికంటే మీరు ఎంతో మించివున్నారు. 7 మీ మనుషులు ఎంత ధన్యజీవులు! మీ సముఖంలో ఎప్పుడూ ఉండి మీ జ్ఞానవాక్కులు వినే మీ పరివారం ఎంత ధన్యం! 8 మీ దేవుడైన యెహోవా మీ గురించి సంతోషించి మీ దేవుడు యెహోవాకోసం రాజుగా పరిపాలించడానికి తన సింహాసనం మిమ్మల్ని ఎక్కించి నందుచేత ఆయనకు స్తుతులు కలుగుతాయి గాక! యెహోవా ఇస్రాయేల్ ప్రజను ప్రేమించేవాడు, వారిని శాశ్వతంగా సుస్థిరం చేయాలనుకొనేవాడు, గనుక న్యాయం, ధర్మం జరిగించడానికి మిమ్మల్ని వారిమీద రాజుగా చేశాడు.”
9 ఆమె రాజుకు నాలుగు వేల కిలోగ్రాముల బంగారం, చాలా సుగంధ ద్రవ్యాలు, వెలగలరాళ్ళు ఇచ్చింది. షేబరాణి సొలొమోనురాజుకు ఇచ్చిన సుగంధ ద్రవ్యాలతో సాటియైనవి అక్కడ ఎప్పుడూ లేవు.
10 (ఓఫీర్‌‌ నుంచి బంగారం తెచ్చిన హీరాం మనుషులూ సొలొమోను మనుషులూ అక్కడనుంచి చందనం దూలాలు వెలగల రాళ్ళూ కూడా తెచ్చారు. 11 ఆ చందనం దూలాలతో రాజు యెహోవా ఆలయానికీ తన భవనానికీ మెట్లు చేయించాడు. గాయకులకు వేరు వేరు తంతి వాద్యాలు కూడా చేయించాడు. అంతకు ముందు అలాంటివి యూదాలో ఎన్నడూ కనిపించలేదు.) 12 షేబ రాణి తనకు తెచ్చిన వాటికి ప్రతి బహుమతులు గాక, ఆమె ఏమీ కోరుకొంటే అవన్నీ కూడా సొలొమోనురాజు ఇచ్చాడు. అప్పుడు ఆమె తన పరివారంతోపాటు స్వదేశానికి వెళ్ళిపోయింది.
13 సొలొమోనుకు సంవత్సరానికి వచ్చే బంగారం బరువు ఇరవై మూడు వేల కిలోగ్రాములు. 14 అదే గాక వ్యాపారస్తుల వల్లా వర్తకులవల్లా కూడా రాబడి ఉంది. అరేబియా రాజులూ దేశాధికారులూ కూడా సొలొమోనుకు బంగారం, వెండి తీసుకువచ్చారు. 15 సాగగొట్టిన బంగారంతో సొలొమోనురాజు రెండు వందల పెద్ద డాళ్ళు చేయించాడు. ఒక్కొక్క డాలుకు ఆరు వందల తులాల బంగారం వినియోగించారు. 16 సాగగొట్టిన బంగారంతో రాజు మరో మూడు వందల చిన్న డాళ్ళు చేయించాడు. వాటిలో ఒక్కొక్కదానికి మూడు వందల తులాల బంగారం వినియోగించారు. రాజు వాటిని “లెబానోను వనం” అనే తన భవనంలో ఉంచాడు.
17 రాజు దంతంతో పెద్ద సింహాసనం చేయించాడు. దానికి మేలిమి బంగారు తొడుగు చేయించాడు. 18 సింహాసనానికి ఆరు మెట్లున్నాయి. దానికి ఒక బంగారు పాదపీఠం కట్టి ఉంది. సింహాసనానికి రెండు వైపులా ఊతలు ఉన్నాయి. ఊతల దగ్గర రెండు సింహాల ఆకారాలు నిలబడి ఉన్నాయి. 19 ఆ ఆరు మెట్లు మీద రెండు వైపులా పన్నెండు సింహాల ఆకారాలు నిలబడి ఉన్నాయి. అలాంటిదాన్ని మరే రాజ్యంలోనూ ఎవరూ ఎప్పుడూ చేయలేదు.
20 సొలొమోనురాజు పానపాత్రలన్నీ బంగారంతో చేసినవి. “లెబానోనువనం” అనే తన భవనంలో ఉన్న పాత్రలన్నీ మేలిమి బంగారంతో చేసినవి. వెండిది ఒక్కటి కూడా లేదు. సొలొమోను కాలంలో వెండి లెక్కలోకి రాలేదు. 21 రాజు ఓడలు హీరాం మనుషులతోపాటు తర్షీషుకు వెళ్ళేవి. మూడు సంవత్సరాలకు ఒకసారి బంగారం, వెండి, దంతం, కోతులను, నెమళ్ళను తెస్తూ ఉండేవి.
22 సంపదలో, జ్ఞానంలో సొలొమోనురాజు లోకంలో ఉన్న రాజులందరికంటే మించినవాడు. 23 దేవుడు అతని మనసులో ఉంచిన అతని జ్ఞానవాక్కులు విందామని లోకంలో రాజులంతా సొలొమోను దర్శనం కావాలని కోరారు. 24 అతనిదగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరూ కానుకలుగా వెండి పాత్రలు, బంగారు పాత్రలు, వస్త్రాలు, యుద్ధాయుధాలు, సుగంధ ద్రవ్యాలు, గుర్రాలను, కంచరగాడిదలను తెచ్చారు. ఏటేటా ఇలా జరుగుతూ ఉంది.
25 గుర్రాల కోసం, రథాలకోసం సొలొమోనుకు నాలుగు వేల శాలలు ఉన్నాయి. పన్నెండు వేలమంది రౌతులు ఉన్నారు. రథాలలో కొన్ని వాటికోసం కట్టిన పట్టణాలలో ఉంచాడు. కొన్ని జెరుసలంలో తనదగ్గర ఉంచాడు. 26 యూఫ్రటీసు నది ఒడ్డు నుంచి ఫిలిష్తీయవాళ్ళ దేశం వరకు, ఈజిప్ట్ సరిహద్దు వరకు ఉండే రాజులందరిపై అతడు పరిపాలన చేసేవాడు. 27 రాజువల్ల జెరుసలంలో వెండి రాళ్ళలాగా, దేవదారు మ్రానులు కొండ దిగువ ప్రదేశంలో ఉన్న మేడిచెట్లలాగా విస్తారంగా ఉన్నాయి. 28 ఈజిప్ట్ నుంచి, అన్ని దేశాలనుంచీ సొలొమోనుకు గుర్రాలను తెచ్చారు.
29  సొలొమోనును గురించిన మిగతా విషయాలు – మొదటి దానినుంచి చివరిదాని వరకు – నాతాను ప్రవక్త వ్రాసిన గ్రంథంలోనూ షిలోహు గ్రామంవాడైన అహీయాప్రవక్త వ్రాసిన గ్రంథంలోనూ దీర్ఘదర్శి అయిన ఇద్దో నెబాతు కొడుకైన యరొబాంను గురించి వ్రాసిన గ్రంథంలోనూ ఉన్నాయి. 30 సొలొమోను జెరుసలంలో ఇస్రాయేల్ ప్రజలందరిమీదా నలభై సంవత్సరాలు పరిపాలించాడు. 31 అప్పుడు సొలొమోను కన్ను మూసి తన పూర్వీకులదగ్గరికి చేరాడు. ప్రజలు అతణ్ణి అతని తండ్రి దావీదు నగరంలో సమాధి చేశారు. సొలొమోను స్థానంలో తన కొడుకు రెహబాం రాజయ్యాడు.