8
1 ✝సొలొమోను యెహోవా ఆలయం, రాజభవనం కట్టించడానికి ఇరవై ఏళ్ళు పట్టింది. 2 ✽ఆ తరువాత హీరాం తనకు ఇచ్చిన ఊళ్ళను సొలొమోను మళ్ళీ కట్టించాడు. వాటిలో ఇస్రాయేల్ వారిని కాపురం ఉంచాడు. 3 అప్పుడు సొలొమోను హమాత్‌సొబా పట్టణం మీదికి వెళ్ళి దానిని పట్టుకొన్నాడు. 4 ఎడారిలో ఉన్న తద్మోరుకూ, భోజన పదార్థాలను కూడబెట్టే పట్టణాలకూ గోడలు కట్టించాడు. 5 మీది బేత్‌హోరోనునూ క్రింది బేత్‌హోరోనునూ కోటలూ గోడలూ ద్వారం తలుపులూ అడ్డగడులూ ఉన్న ఊళ్ళుగా మళ్ళీ కట్టించాడు. 6 బాలాతును, భోజన పదార్థాలను కూడబెట్టే పట్టణాలన్నిటినీ, తన రథాలకూ రౌతులకూ ఏర్పాటైన పట్టణాలను, జెరుసలంలోనూ లెబానోనులోనూ తాను పరిపాలించే రాజ్యమంతట్లోనూ కట్టించదలచుకొన్నవాటిని కూడా కట్టించాడు.7 ✝ఆ కాలంలో ఇస్రాయేల్ ప్రజ కానివారైన హిత్తి, అమోరీ, పెరిజ్జి, హివ్వి, యెబూసి జాతులవాళ్ళు కొంతమంది దేశంలో మిగిలారు. 8 ఇస్రాయేల్‌ప్రజ పూర్తిగా నాశనం చేయని✽ ఆ జాతులవాళ్ళ సంతానమే వీళ్ళు. వాళ్ళందరినీ సొలొమోను వెట్టి పనులకు✽ ఏర్పాటు చేశాడు. ఈ రోజుకూ వాళ్ళు అలాగే ఉన్నారు. 9 కానీ సొలొమోను ఇస్రాయేల్‌ప్రజలో ఎవరినీ బానిసలుగా చేయలేదు. వారు సైనికులూ అతడి సైన్యాధిపతుల్లో ప్రముఖులూ రథాలకూ రౌతులకూ అధిపతులూ. 10 వారిలో రెండు వందల యాభైమంది సొలొమోనురాజు ప్రజలమీద నియమించిన అధికారులలో ప్రముఖులు.
11 ✽సొలొమోను ఫరో కూతురు కోసం భవనం కట్టించి, ఆమెను దావీదునగరం నుంచి ఆ భవనానికి తీసుకువచ్చాడు. ఎందుకంటే, “ఇస్రాయేల్ ప్రజల రాజైన దావీదు భవనంలో నా భార్య నివాసం ఉండకూడదు. యెహోవా ఒడంబడికపెట్టె వచ్చే ప్రతి స్థలం పవిత్రంగా✽ ఉంది” అనుకొన్నాడు.
12 ✝అప్పటినుంచి తాను వసారా ఎదుట యెహోవాకు కట్టించిన బలిపీఠం మీద హోమబలులు అర్పించేవాడు. 13 ✝మోషే ఇచ్చిన ఆజ్ఞలననుసరించి ప్రతి రోజూ పాటించవలసిన విధి ప్రకారం, విశ్రాంతి దినాల్లో, అమావాస్యలప్పుడు, సంవత్సరంలో మూడు నిర్ణయమైన పండుగ కాలాలలో, అంటే “పొంగని రొట్టెల పండుగ”, “వారాల పండుగ”, “పర్ణశాలల పండుగ” కాలాలలో యెహోవాకు హోమబలులు అర్పించేవాడు. 14 ✝తన తండ్రి దావీదు చేసిన నిర్ణయం ప్రకారం సొలొమోను యాజులకు వారి వారి సేవాధర్మాలను జరిగించే వంతులను నియమించాడు. స్తుతించడానికీ ప్రతిరోజూ జరగవలసిన సేవ విషయం యాజులకు సహాయం చేయడానికీ లేవీగోత్రికులను నియమించాడు. ప్రతి ద్వారానికీ వంతుల ప్రకారం ద్వారపాలకులుగా ఉండడానికి మనుషులను నియమించాడు. అలా చేయాలని దేవుని మనిషి అయిన దావీదు ఆజ్ఞ జారీ చేశాడు. 15 ఖజానా విషయం గానీ మరేదైనా విషయం గానీ రాజు యాజులకూ లేవీగోత్రికులకూ ఇచ్చిన ఆజ్ఞలప్రకారం వారు అంతా జరిగించేవారు.
16 యెహోవా ఆలయం పునాది వేయబడ్డప్పటినుంచి ఆలయం పని ముగిసేవరకు సొలొమోను నియమించిన పనంతా వారు సాధించారు. యెహోవా ఆలయం పూర్తి అయింది. 17 అప్పుడు సొలొమోను ఎదోంలో సముద్రతీరాన ఉన్న ఎసోన్‌గెబెరుకూ ఏలతుకూ వెళ్ళాడు. 18 హీరాం తనకు సేవ చేసే వారిచేత ఓడలనూ సముద్రం అంటే బాగా తెలిసినవాళ్ళనూ పంపించాడు. వారు సొలొమోను మనుషులతో పాటు బయలుదేరి ఓఫీర్‌దేశం చేరి అక్కడనుంచి పదహారు వేల కిలోగ్రాముల బంగారం సొలొమోనురాజు దగ్గరికి తీసుకువచ్చారు.