7
1 సొలొమోను ప్రార్థన చేయడం ముగించిన తరువాత ఆకాశం నుంచి మంటలు✽ వచ్చి హోమాలనూ బలులనూ బుగ్గి చేశాయి. అప్పుడు యెహోవా మహిమా ప్రకాశంతో ఆలయమంతా నిండిపోయింది. 2 ✝యెహోవా ఆలయమంతా యెహోవా మహిమాప్రకాశంతో నిండిపోయినందుచేత యాజులు లోపల ప్రవేశించలేకపొయ్యారు. 3 ✽మంటలు రావడం, ఆలయంమీద యెహోవా మహిమాప్రకాశం ఉండడం ఇస్రాయేల్ ప్రజలంతా చూచినప్పుడు వారు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ‘యెహోవా దయగలవాడు. ఆయన అనుగ్రహం శాశ్వతంగా ఉంటుంది’ అంటూ ఆయనను ఆరాధించి స్తుతించారు.4 ✝అప్పుడు రాజు, ప్రజలంతా యెహోవా సన్నిధానంలో బలులు అర్పించారు. 5 సొలొమోనురాజు ఇరవై రెండు వేల పశువులనూ లక్ష ఇరవై వేల గొర్రెలనూ బలిగా అర్పించాడు. ఈ విధంగా రాజు, ప్రజలంతా దేవుని ఆలయాన్ని ప్రతిష్ఠించారు. 6 ✝యాజులు తమకు నియమించబడ్డ స్థలాలలో నిలబడి ఉన్నారు. లేవీగోత్రికులు కూడా తమ స్థలాలలో నిలిచి ఉండి ‘యెహోవా అనుగ్రహం శాశ్వతంగా ఉంటుంది’ అని యెహోవా స్తుతికోసం దావీదురాజు వ్రాసిన గీతాలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. యాజులు వారికి ఎదురుగా బూరలు ఊదుతూ ఉన్నారు. ఇస్రాయేల్ ప్రజలంతా అక్కడ నిలబడి ఉన్నారు. 7 సొలొమోను చేయించిన కంచు బలిపీఠం ఆ హోమబలులను, నైవేద్యాలను, బలుల✽ క్రొవ్వును పట్టలేనంత చిన్నదిగా ఉంది. గనుక సొలొమోను యెహోవా ఆలయం ముందున్న ఆవరణం మధ్య భాగాన్ని పవిత్రం చేశాడు. అక్కడే హోమబలులూ శాంతి బలుల కొవ్వు అర్పించారు.
8 ఆ సమయంలో సొలొమోనూ అతడితోపాటు ఇస్రాయేల్ వారంతా ఏడు రోజులు పండుగ✽ ఆచరించారు. హమాత్ పోయే త్రోవనుంచి ఈజిప్ట్✽ వాగు దాకా ఉన్న ప్రాంతమంతటినుంచీ వారు గొప్ప సమూహంగా సమావేశమయ్యారు. 9 బలిపీఠాన్ని ప్రతిష్ఠ చేయడంలో వారు ఏడు రోజులు గడిపారు. ఇంకా ఏడు రోజులు పండుగ ఆచరించారు. 10 ఏడో నెల ఇరవై మూడో రోజున ప్రజలకు వారి వారి నివాసాలకు వెళ్ళిపోయేలా రాజు సెలవిచ్చాడు. దావీదుపట్ల, సొలొమోనుపట్ల, తన ఇస్రాయేల్ ప్రజపట్ల యెహోవా చేసిన మేలుల విషయం ప్రజలు మనసులో సంబరపడుతూ ఆనందిస్తూ ఉన్నారు.
11 ✝సొలొమోను యెహోవా ఆలయాన్ని, రాజభవనాన్ని కట్టించి యెహోవా ఆలయంలోనూ తన భవనంలోనూ చేస్తాననుకొన్నవన్నీ పూర్తిగా సాధించి పని ముగించాడు.
12 తరువాత ఒక రాత్రి సొలొమోనుకు యెహోవా ప్రత్యక్షమై✽ అతనితో అన్నాడు “నేను నీ ప్రార్థన విన్నాను, ఈ స్థలాన్ని బలులు అర్పించే ఆలయంగా ఎన్నుకొన్నాను✽. 13 ✽వాన కురియకుండా నేను ఆకాశాన్ని మూసినప్పుడు దేశాన్ని నాశనం చెయ్యడానికి మిడుతలకు ఆదేశించినప్పుడు, నా ప్రజమీదికి విపత్తును రప్పించినప్పుడు 14 ✽ నా పేరు ధరించిన నా ప్రజ తమను తగ్గించుకొని ప్రార్థన చేసి నా సముఖాన్ని వెదికితే, తమ చెడు మార్గాలను వదలివేస్తే, పరలోకంనుంచి నేను వారి ప్రార్థన వింటాను. వారి పాపాలను క్షమించి వారి దేశాన్ని బాగు చేస్తాను. 15 ✝ఇప్పుడు ఈ స్థలంలో చేసే ప్రార్థనలమీద నా కనుదృష్టి ఉంచుతాను, చెవులారా వింటాను. 16 ఇక్కడ నా పేరు ఎప్పటికీ ఉండాలని నేను ఈ ఆలయాన్ని కోరుకొని పవిత్రం చేశాను. నా చూపు, నా మనసు ఎప్పుడూ దానిమీద ఉంటాయి.
17 ✝“నీ తండ్రి అయిన దావీదు నా త్రోవలలో నడిచినట్లు నీవూ నడుస్తూ, నా శాసనాలూ న్యాయ నిర్ణయాలూ శిరసావహించి నేను నీకు ఆజ్ఞాపించినట్లెల్లా చేస్తూ ఉంటే, 18 నీ రాజవంశాన్ని సుస్థిరం చేస్తాను. నీ తండ్రి అయిన దావీదుతో ‘నీ సంతానం ఎప్పటికీ ఇస్రాయేల్ రాజ్యపరిపాలన చేస్తారు’ అని చేసిన ఒడంబడిక ప్రకారమే నేను జరిగిస్తాను. 19 ✝కానీ మీరు నన్ను అనుసరించడం మానితే, నేను మీకిచ్చిన నా శాసనాలూ ఆజ్ఞలూ వదలివేసి నాకు దూరమైపోయి వేరే దేవుళ్ళను కొలిచి పూజిస్తే, 20 నేను మీకిచ్చిన నా దేశంలో మిమ్ములను లేకుండా చేస్తాను, నా పేరుకు నేను పవిత్రం చేసిన ఈ ఆలయం నా ఎదుట లేకుండా చేస్తాను, దానిని అన్ని జనాలలో సామెతగా, పరిహాసాస్పదంగా చేస్తాను. 21 ఈ ఆలయం తన పరమ స్థితినుంచి పడుతుంది. ఈ దారిన వెళ్ళేవారంతా నిర్ఘాంతపడి ‘యెహోవా ఈ దేశాన్నీ ఈ ఆలయాన్నీ ఇలా చేయడం ఎందుకో!’ అంటారు. 22 వారికి చెప్పే జవాబు ఇలా ఉంటుంది: ‘వారిని ఈజిప్ట్ నుంచి తీసుకువచ్చిన వారి పూర్వీకుల దేవుడైన యెహోవాను వారు విడిచిపెట్టారు. వేరే దేవుళ్ళను అవలంబించి ఆ దేవుళ్ళను కొలిచి పూజించారు. అందుకనే యెహోవా ఈ విపత్తు అంతా వారిమీదికి రప్పించాడు.”