6
1 ✝అప్పుడు సొలొమోను ఇలా అన్నాడు: “యెహోవా తాను చీకటియైన మేఘంలో నివాసం చేస్తానన్నాడు. 2 ప్రభూ, నీకోసం నేను ఘనమైన ఆలయం కట్టించాను. సదాకాలం నీవు నివాసం చేసే స్థలంగా దానిని నిర్మించాను.”3 ఇస్రాయేల్ సమాజమంతా అక్కడ నిలబడి ఉన్నారు. రాజు వారివైపు తిరిగి, వారిని దీవించాడు. అప్పుడతడు ఇలా అన్నాడు:
4 “ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాకు స్తుతులు కలుగుతాయి గాక! ఆయన నా తండ్రి దావీదుతో చెప్పిన మాటలు నెరవేర్చాడు. 5 ఆయన అన్నాడు, ‘ఈజిప్ట్ నుంచి నేను నా ప్రజను తీసుకువచ్చిన రోజునుంచి నా పేరుకు ఆలయం కట్టించుకోవడానికి ఇస్రాయేల్ గోత్రాలకు చెందిన పట్టణాలలో దేనినీ ఎన్నుకోలేదు. నా ప్రజలమీద నాయకుడుగా ఉండడానికి ఏ మనిషినీ ఎన్నుకోలేదు. 6 అయితే ఇప్పుడు నా పేరు ఉండడానికి జెరుసలంను ఎన్నుకొన్నాను. నా ఇస్రాయేల్ ప్రజను పరిపాలించేందుకు దావీదును ఎన్నుకొన్నాను.’
7 “ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవా పేరుకు ఆలయం కట్టించే ఆశ నా తండ్రి దావీదు హృదయంలో ఉంది. 8 కాని, యెహోవా నా తండ్రి దావీదుతో అన్నాడు, ‘నా పేరుకు ఆలయం కట్టించే ఆశ నీ హృదయంలో ఉంది. నీ హృదయాభిలాష మంచిదే. 9 అయినా ఆ ఆలయం నీవు కట్టించకూడదు. నీకు జన్మించే నీ కొడుకు నా పేరుకు ఆలయం కట్టిస్తాడు.’
10 “యెహోవా తన మాట ప్రకారం చేశాడు. యెహోవా చెప్పినట్టే నేను నా తండ్రి దావీదు స్థానంలో ఇస్రాయేల్ రాజ్య సింహాసనం ఎక్కాను. ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా పేరుకు ఈ ఆలయం కట్టించాను. 11 యెహోవా ఇస్రాయేల్ ప్రజతో చేసిన ఒడంబడిక ఉన్న పెట్టెను ఆలయంలో ఉంచాను.”
12 అప్పుడు సొలొమోను యెహోవా బలిపీఠం ముందు ఇస్రాయేల్ సమాజ సమక్షంలో నిలబడి చేతులు చాపి ప్రార్థన చేశాడు.
13 అంతకు ముందు సొలొమోను కంచుతో ఒక సభావేదికను తయారు చేయించాడు. దాని పొడుగు అయిదు మూరలు, వెడల్పు అయిదు మూరలు, ఎత్తు మూడు మూరలు. దానిని ముంగిటి ఆవరణంలో ఉంచి దానిమీద నిలబడ్డాడు. ఇస్రాయేల్ సర్వసమాజ సమక్షంలో మోకరించి, చేతులు ఆకాశం వైపు చాపి ఇలా ప్రార్థన చేశాడు:
14 “యెహోవా! ఇస్రాయేల్ ప్రజల దేవా! ఆకాశాలలో గానీ భూమిమీద గానీ నీలాంటి దేవుడు మరొకడు లేడు. నీ మార్గంలో మనసారా నడిచే నీ సేవకులమీద దయ చూపుతూ నీ ఒడంబడికను నెరవేరుస్తూవుంటావు. 15 నీ సేవకుడూ నా తండ్రీ అయిన దావీదుతో నీవు చెప్పిన మాటప్రకారం చేశావు. నీ నోటితో చెప్పినది ఈ రోజు నీవు చేతులారా నెరవేర్చావు. 16 యెహోవా! ఇస్రాయేల్ యొక్క దేవా! నీ సేవకుడూ నా తండ్రీ అయిన దావీదుతో ఇలా చెప్పావు: ‘నీ కొడుకులు నీలాగే నా సమక్షంలో నా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకొంటూ, వారి ప్రవర్తన విషయం జాగ్రత్తగా ఉంటే, నీ సంతానం ఇస్రాయేల్ రాజ్య పరిపాలన ఎప్పటికీ చేస్తారు.’ 17 యెహోవా! ఇస్రాయేల్ ప్రజల దేవా! నీ సేవకుడైన దావీదుతో నీవు చెప్పిన మాట నెరవేర్చమని వేడుకొంటున్నాను.
18 ✝“అయితే దేవుడు భూమిమీద మనుషులతో నిజంగా నివాసం చేస్తాడా? ఆకాశం, పై ఆకాశాలు నీకు సరిపోవు. నేను కట్టించిన ఈ ఆలయం ఏమి సరిపోతుంది? 19 అయినా, నీ దాసుడైన నేను చేసే ప్రార్థన, విన్నపం ఆలకించు. యెహోవా! దేవా! నీ సమక్షంలో నేను పెట్టుకొనే ఈ మొర, నా ప్రార్థన వినిపించుకో. 20 నీవు ఈ ఆలయాన్ని గురించి ‘నా పేరును అక్కడ ఉంచుతాన’న్నావు, గనుక రాత్రింబగళ్ళూ నీ కనుదృష్టి ఈ ఆలయంపై ప్రసరించనియ్యి. నీ దాసుడు ఈ ఆలయంవైపు మళ్ళుకొని, చేసే ప్రార్థన విను. 21 నీ దాసుడు, నీ ఇస్రాయేల్ ప్రజ ఈ ఆలయంవైపు తిరిగి, ప్రార్థన చేసేటప్పుడెల్లా వారి విన్నపం ఆలకించు, నీ నివాసస్థలమైన పరలోకంనుంచి విను. విని క్షమాపణ ప్రసాదించు.
22 “ఎవడైనా తన పొరుగువాడి విషయం అపరాధం చేస్తే, దాని గురించి ఒట్టుపెట్టాలని ఇతరులు ఆ వ్యక్తిని ఈ ఆలయంలోని నీ పీఠం ముందుకు తీసుకువచ్చి ప్రమాణం చేయించుకొంటే, 23 నీవు పరలోకం నుంచి ఆలకించు, నీ దాసులైన వారికి తీర్పు తీర్చు. అపరాధం చేసినవారికి ప్రతీకారం చేసి, వాడి నెత్తిమీదికి శిక్ష రప్పించు. న్యాయవంతుణ్ణి నిర్దోషిగా నిర్ణయించి అతడి నిర్దోషత్వం ప్రకారం ప్రతిఫలం ప్రసాదించు.
24 “నీ ఇస్రాయేల్ ప్రజ నీకు వ్యతిరేకంగా పాపం చేసినందుచేత వారి శత్రువుల చేతిలో ఓడిపోయినప్పుడు, వారు నీవైపు తిరిగి, నీ పేరును ఒప్పుకొని, ఈ ఆలయంలో నీకు ప్రార్థన విన్నపాలు చేస్తే, 25 నీవు పరలోకంనుంచి విను. నీ ఇస్రాయేల్ ప్రజలు చేసే పాపాలు క్షమించి, వారి పూర్వీకులకు నీవు ఇచ్చిన ఈ దేశానికి వారిని మళ్ళీ చేర్చు.
26 వారు నీకు వ్యతిరేకంగా పాపం చేసినందుచేత ఆకాశం మూసుకొని వాన కురిపించకపోయినప్పుడు వారు ఈ స్థలంవైపు తిరిగి, నీకు ప్రార్థన చేస్తే, నీవు వారిమీద పెట్టిన బాధ కారణంగా వారు వారి పాపం విసర్జించి నీ పేరును ఒప్పుకొంటే, 27 నీవు పరలోకంనుంచి ఆలకించు. నీ దాసుల పాపాన్ని, నీ ఇస్రాయేల్ ప్రజల పాపాన్ని క్షమించు. వారు నడవవలసిన మంచి విధానాన్ని వారికి నేర్పించు. నీవు నీ ప్రజలకు వారసత్వంగా ఇచ్చిన దేశం మీద మళ్ళీ వాన కురిపించు.
28 “ఈ దేశంలో కరవు వస్తే, తెగులు గానీ పంటలకు చీడలు గానీ మిడతలు గానీ పురుగులు గానీ వచ్చిపడితే, వారి శత్రువులు వారి పట్టణాలలో వారిని ముట్టడి వేస్తే, ఎలాంటి దెబ్బ గానీ రోగం గానీ వచ్చినా 29 నీ ఇస్రాయేల్ ప్రజలో ఎవరైనా ప్రార్థన, విన్నపం చేస్తే నీవు ఆలకించు, అలాంటి వ్యక్తి తన బాధ, కీడు తెలుసుకొని ఈ ఆలయంవైపు తన చేతులు చాపి ప్రార్థన చేస్తే, 30 నీ నివాసస్థలమైన పరలోకంనుంచి అతడి ప్రార్థన విని, క్షమాపణ ప్రసాదించి, ప్రతివ్యక్తి ప్రవర్తన ప్రకారం ప్రతిఫలం ఇయ్యి. ప్రతి వ్యక్తి హృదయం నీకు తెలుసు గదా. మనుషులందరి హృదయాలలో ఏమి ఉందో నీకు మాత్రమే తెలుసు. 31 ఈ విధంగా నీవు మా పూర్వీకులకు ఇచ్చిన ఈ దేశంలో వారు బ్రతికి ఉన్నంతవరకూ నీ పట్ల భయభక్తులతో బ్రతికేలా చెయ్యి.
32 “ఇస్రాయేల్‌వారు గాక, దూర ప్రదేశంలోని పరాయివాళ్ళు నీ గొప్ప పేరు కారణంగా నీ బలమైన హస్తం, చాపిన చేయి కారణంగా తమ దేశం నుంచి వచ్చి ఈ ఆలయం వైపు నీకు ప్రార్థన చేస్తే, 33 నీవు నీ నివాస స్థలమైన పరలోకంనుంచి ఆలకించు. ఆ విదేశీయులు నిన్ను వేడుకొనేవన్నీ వారికి ప్రసాదించు. ఆ విధంగా లోకంలో అన్ని జాతులవారు నీ పేరు ప్రతిష్ఠలు తెలుసుకొని, నీ ఇస్రాయేల్‌ప్రజలాగే నీయందు భయభక్తులు కలిగి ఉంటారు. నేను కట్టించిన ఈ ఆలయమే నీ పేరు పెట్టబడ్డ ఆలయమని తెలుసుకొంటారు.
34 “వారి శత్రువులతో యుద్ధం చేయడానికి నీవు నీ ప్రజను ఎక్కడికైనా పంపించినప్పుడు, నీవు ఎన్నుకొన్న ఈ నగరంవైపూ, నీ పేరుకు నేను కట్టించిన ఈ ఆలయంవైపూ వారు తిరిగి, నీకు ప్రార్థన చేస్తే, 35 వారి ప్రార్థన విన్నపాలు పరలోకంనుంచి ఆలకించు, వారి పక్షం వహించు.
36 “నీ ప్రజ నీకు వ్యతిరేకంగా పాపం చేసేటప్పుడు – బొత్తిగా పాపం చేయకుండా ఉండేవాడెవడూ లేడు గదా – నీవు వారిమీద కోపపడి, వారిని శత్రువుల వశం చేసినందుచేత వారు వేరే దేశానికి బందీలుగా వెళ్ళిన తరువాత, ఆ దేశం దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా, 37 అప్పుడు బందీలుగా వెళ్ళిన ఆ దేశంలో వారు తలంచుకొని, పశ్చాత్తాపపడి, ‘మేము పాపాలు చేశాం, మూర్ఖంగా ప్రవర్తించాం, దుర్మార్గులమయ్యాం’ అంటూ తాము బందీలుగా వెళ్ళిన ఆ దేశంలో నీకు విన్నపం చేస్తే, నీవు ఆలకించు. 38 తాము బందీలుగా వెళ్ళిన ఆ దేశంలో ఉండి వారు హృదయపూర్వకంగా, మనసారా నీవైపు తిరిగి, నీవు వారి పూర్వీకులకు ఇచ్చిన ఈ దేశంవైపూ, నీవు ఎన్నుకొన్న పట్టణంవైపూ, నీ పేరుకు నేను కట్టించిన ఈ ఆలయంవైపూ చూస్తూ నీకు ప్రార్థన చేస్తే, 39 నీవు నీ నివాస స్థలమైన పరలోకం నుంచి వారి ప్రార్థన విన్నపాలు ఆలకించు. వారి పక్షం వహించు. నీకు వ్యతిరేకంగా పాపం చేసిన నీ ప్రజను క్షమించు.
40 “నా దేవా! ఈ స్థలంలో చేసిన ప్రార్థనలపై నీ కనుదృష్టి నిలుపు. చెవులారా ఆలకించు. 41 ✝యెహోవాదేవా! నీవు నీ బలాన్ని సూచించే ఒడంబడిక పెట్టెతోకూడా నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించు. యెహోవా, నా దేవా! నీ యాజులు రక్షణ ధరించుకొంటారు గాక! నీ దయ కారణంగా నీ భక్తులు సంతోషిస్తారు గాక! 42 యెహోవాదేవా! నీవు అభిషేకించిన వాణ్ణి విసర్జించవద్దు. నీ సేవకుడైన దావీదుమీద అనుగ్రహం చూపుతావని నీవు చేసిన వాగ్దానాలు జ్ఞాపకముంచుకో.”