5
1 ఈ విధంగా యెహోవా ఆలయానికి సొలొమోను చేయించిన పనంతా పూర్తి అయింది. తన తండ్రి దావీదు ప్రతిష్ఠించిన వెండి, బంగారం పాత్రలు కూడా సొలొమోను తెప్పించి దేవుని ఆలయంలోని ఖజానాలో ఉంచాడు. 2  అప్పుడు యెహోవా ఒడంబడిక పెట్టెను తెప్పించాలని కోరాడు. అది సీయోను అనే దావీదు నగరంలో ఉంది. గనుక ఇస్రాయేల్‌ప్రజల పెద్దలను – గోత్రాల నాయకులందరినీ ఇస్రాయేల్‌ప్రజల పూర్వీకుల వంశ ప్రధానులందరినీ సొలొమోను జెరుసలంకు పిలిపించాడు. 3 ఈ ఇస్రాయేల్ మనుషులంతా ఏడో నెలలో జరిగే పండుగ సమయంలో రాజుదగ్గర సమావేశమయ్యారు.
4 ఇస్రాయేల్ ప్రజల పెద్దలంతా వచ్చాక లేవీగోత్రికులు యెహోవా ఒడంబడికపెట్టెను ఎత్తుకొని, 5 దానినీ సన్నిధి గుడారాన్నీ గుడారంలో ఉన్న ఆ పవిత్ర సామానంతటినీ తీసుకువచ్చారు. 6 అప్పుడు సొలొమోనురాజు, అతనిదగ్గర సమావేశం అయిన ఆ ఇస్రాయేల్ వారంతా ఒడంబడిక పెట్టె ముందు నిలబడ్డారు. లెక్కించ వీలులేనన్ని గొర్రెలనూ ఎద్దులనూ బలి చేశారు.
7 ఆ తరువాత యాజులు యెహోవా ఒడంబడికపెట్టెను దాని స్థలానికి తీసుకువచ్చారు. గర్భగృహం అనే అతి పవిత్ర స్థలంలో, కెరూబు ఆకారాల రెక్కల క్రింద ఉంచారు. 8 కెరూబుల రెక్కలు ఒడంబడికపెట్టె ఉన్న స్థలం వరకు చాపి ఉన్నాయి. ఆ రెక్కలు పెట్టెకూ దాని మోత కర్రలకూ పైగా ఉండి వాటిని కప్పివేశాయి. 9 ఆ కర్రలు చాలా పొడుగుగా ఉన్నాయి. గర్భగృహానికి ముందునుంచి చూస్తే అవి కనబడ్డాయి గానీ పవిత్ర స్థలం బయటనుంచి కనబడలేదు. ఈ రోజుకూ అవి అక్కడే ఉన్నాయి. 10 హోరేబుపర్వతం దగ్గర మోషే ఒడంబడికపెట్టెలో ఉంచిన ఆ రెండు పలకలు అందులో ఉన్నాయి గానీ మరేమీ లేదు. (ఇస్రాయేల్ ప్రజ ఈజిప్ట్ నుంచి వచ్చినప్పుడు వారితో యెహోవా ఒడంబడిక చేసిన సమయంలో మోషే ఆ పలకలు ఆ పెట్టెలో ఉంచాడు.)
11 తరువాత యాజులు అతి పవిత్ర స్థలంనుంచి బయటికి వచ్చారు. అంతకుముందు అక్కడ ఉన్న యాజులందరూ, తమ వంతుల గుంపులను లెక్క చెయ్యక తమను తాము ప్రతిష్ఠించుకొన్నారు. 12 గాయకులైన లేవీగోత్రికులంతా, అంటే ఆసాపు, హేమాను, యెదూతూను, వారి కొడుకులూ బంధువులూ మేలి రకమైన బట్టలు ధరించి తాళాలూ తంతివాద్యాలూ స్వరమండలాలూ చేతపట్టుకొని ధూపవేదిక తూర్పు వైపున నిలబడి ఉన్నారు. వారితో కలిసి బూరలు ఊదడానికి నూట ఇరవైమంది యాజులు ఉన్నారు. 13 బూరలు ఊదేవారూ పాటలు పాడేవారూ కలిసి ఒకే స్వరంగా యెహోవాకు కృతజ్ఞతలూ స్తుతులూ చెల్లిస్తూ ఉన్నారు. బూరలూ తాళాలూ ఇతర వాయిద్యాలూ వాయించడం జరుగుతూ ఉంటే వారు ఇలా పాడుతూ స్తుతిస్తూ ఉన్నారు: “యెహోవా దయ గలవాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.”
14  అప్పుడు యెహోవా ఆలయం ఒక మేఘంతో నిండిపోయింది. అలా యెహోవా మహిమా ప్రకాశంతో దేవుని ఆలయం నిండిపోవడం వల్ల – ఆ మేఘం కారణంగా – యాజులు అక్కడ నిలబడి సేవ జరిగించలేక ఉన్నారు.