4
1 ✝సొలొమోను కంచు బలిపీఠం చేయించాడు. దాని పొడుగు ఇరవై మూరలు. వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు పది మూరలు. 2 ✝అతడు లోహంతో ఒక “సరస్సు”ను పోత పోయించాడు. ఆ అంచు నుంచి ఈ అంచువరకు దాని కొలత పది మూరలు. దాని ఎత్తు అయిదు మూరలు. దాని చుట్టుకొలత ముప్ఫయి మూరలు. 3 అంచుల క్రింద చుట్టూరా ఎద్దు ఆకారాలు ఉన్నాయి. అవి ఒక్కో మూరకు పదిచొప్పున ఉన్నాయి. అవి ఆ సరస్సును ఆవరించి ఉన్నాయి. ఆ ఎద్దులు రెండు వరుసలుగా ఉన్నాయి. సరస్సుతో కూడా ఒకే పోతగా పోసినవి. 4 ఆ సరస్సు పన్నెండు పోతపోసిన ఎద్దులమీద కూర్చుని ఉంది. ఎద్దుల వెనుక భాగాలు లోపలి వైపుకు ఉన్నాయి. వాటి ముఖాలు మూడు ఉత్తరం వైపుకు, మూడు పడమటి వైపుకు, మూడు దక్షిణం వైపుకు, మూడు తూర్పు వైపుకు ఉన్నాయి. సరస్సు ఆ ఎద్దులమీద కూర్చుని ఉంది. 5 సరస్సు బెత్తెడు మందంగలది. దానిపై అంచు పాత్రపై అంచులాగా కలువపువ్వులాగా ఉంది. అది అరవై ఆరు కిలోలీటర్ల నీళ్ళు పట్టేది. 6 ✝కడగడానికి అతడు పది తొట్లు చేయించాడు. ఆలయం కుడి వైపున అయిదు, ఎడమ వైపున అయిదు ఉంచాడు. అవి హోమబలిగా అర్పించినవాటిని కడగడం కోసం యాజులు కడుగుకోవడానికి ఆ సరస్సు ఉంది.7 ✽ పది బంగారు సప్తదీపస్తంభాలను వాటిని చేయవలసిన విధానం ప్రకారం చేయించాడు, ఆలయంలో కుడి వైపున అయిదు, ఎడమ వైపున అయిదు ఉంచాడు.
8 పది బల్లలను✽ చేయించి ఆలయంలో కుడి వైపున అయిదు, ఎడమవైపున అయిదు ఉంచాడు. బంగారంతో నూరు గిన్నెలను చేయించాడు. 9 “యాజుల ఆవరణాన్నీ”, పెద్ద ఆవరణాన్నీ✽ చేయించాడు. ఆవరణ ద్వారాల తలుపులను చేయించి వాటికి కంచు తొడుగు చేయించాడు. 10 సరస్సును ఆలయానికి కుడి ప్రక్క ఆగ్నేయ దిక్కుగా ఉంచాడు. 11 ✝హూరాం పాత్రలను, పెద్ద పెద్ద గరిటెలను, గిన్నెలను కూడా చేశాడు. యెహోవా ఆలయం కోసం సొలొమోను చేయమన్న వస్తువులన్నీ హూరాం చేసి ఆ పని ముగించాడు. 12 ఆ వస్తువులు ఇవి: రెండు స్తంభాలు, ఆ రెండు స్తంభాల మీద ఉన్న గిన్నెలాంటి పీటలు, స్తంభాలమీద ఉన్న గిన్నెలాంటి ఆ రెండు పీటలను కప్పడానికి ఆ రెండు కంచు వలలు, 13 ఆ రెండు వలలకు నాలుగు వందల దానిమ్మపండ్లు – ఒక్కో వలకు రెండేసి వరుసలు, 14 ఆ పీఠాలు, వాటిపై ఉన్న తొట్లు, 15 సరస్సు, దాని క్రింద ఉన్న పన్నెండు ఎద్దులు, 16 గంగాళాలు, పెద్దపెద్ద గరిటెలు, ముండ్ల కొంకులు, మొదలైన పాత్రలన్నీ.
యెహోవా ఆలయానికి సొలొమోనురాజు చేయమన్న ఈ వస్తువులన్నీ మెరుగు పెట్టిన కంచుతో హూరామబీ చేశాడు. 17 ✝వీటన్నిటినీ యొర్దాను మైదానంలో, సుక్కోతుకు సారెతానుకు మధ్య ఉన్న బంకమట్టి నేలలో సొలొమోనురాజు పోత పోయించాడు. 18 సొలొమోను చేయించిన కంచు వస్తువుల సంఖ్య చాలా ఎక్కువ. ఆ కంచు బరువు ఎంతో ఎవరూ నిర్ణయించలేదు.
19 దేవుని ఆలయానికి తక్కిన వస్తువులను కూడా సొలొమోను చేయించాడు; బంగారు ధూపవేదిక, సన్నిధి రొట్టెలున్న బల్లలు, 20 యథావిధిగా గర్భగృహానికి ముందు వెలుగుతూ ఉండడానికి మేలిమి బంగారు సప్తదీపస్తంభాలు, వాటి దీపాలు, 21 వాటి బంగారు పుష్పాలు, దీపాలు, పట్టకార్లు (అవి మేలిమి బంగారంతో చేసినవి), 22 మేలిమి బంగారు కత్తెరలు, గిన్నెలు, గరిటెలు, ధూపార్తులు, ఆలయం బంగారు తలుపులు, అతి పవిత్ర స్థలానికీ ఆలయం విశాల భాగానికీ ఉన్న బంగారు తలుపులు.