3
1 ✝✽ ఆ తరువాత సొలొమోను జెరుసలంలో ఉన్న మోరీయా కొండమీద యెహోవా ఆలయం కట్టించడం ఆరంభించాడు. అక్కడే యెహోవా సొలొమోను తండ్రి అయిన దావీదుకు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోను ఆలయం కట్టించిన స్థలం అంతకుముందు యెబూసి జాతివాడైన ఒరనానుకు కళ్ళంగా ఉంది. దావీదు దానిని సిద్ధం చేశాడు. 2 సొలొమోను పరిపాలించిన నాలుగో సంవత్సరం రెండో నెల రెండో రోజున యెహోవాకు ఆలయం కట్టించడం ఆరంభించాడు.3 సొలొమోను యెహోవా ఆలయానికి పునాది వేయించాడు. పూర్వంలో ఉపయోగించిన మూర కొలత ప్రకారం, దాని పొడుగు అరవై మూరలు✽, వెడల్పు ఇరవై మూరలు.
4 ఆలయం విశాల భాగానికి ముందు వసారా ఉంది. దాని పొడుగు ఇరవై మూరలు. ఎత్తు ఇరవై మూరలు. దాని పొడుగు, ఆలయం వెడల్పు ఒకటే. 5 అతడు లోపలి భాగాన్ని దేవదారు పలకలతో కప్పి దానికి ఖర్జూరం చెట్లలాగా గొలుసులలాగా చెక్కడం పని చేయించాడు.
6 ఆలయాన్ని మేలిరకమైన రత్నాలతో అలంకరించాడు. అతడు ఉపయోగించిన బంగారం పరవయీం నుంచి తెచ్చినది. 7 ఆలయం దూలాలకూ స్తంభాలకూ గోడలకూ తలుపులకూ బంగారు తొడుగు చేయించాడు. గోడలమీద కెరూబుల✽ ఆకారాలు చెక్కించాడు.
8 సొలొమోను ఆలయంలో అతి పవిత్ర స్థలాన్ని✽ కట్టించాడు. ఆలయం వెడల్పును బట్టి దాని పొడుగు ఇరవై మూరలు. వెడల్పు కూడా ఇరవై మూరలు. దానికి మేలిమి బంగారు తొడుగు చేయించాడు. అందుకు ఇరవై వేల కిలోగ్రాముల బంగారం పట్టింది. 9 బంగారు మేకుల బరువు యాభై తులాలు. ఆలయం పైభాగాలకు కూడా బంగారు తొడుగు చేయించాడు 10 అతి పవిత్ర స్థలంలో రెండు కెరూబు ఆకారాలను చెక్కించాడు. వాటికి బంగారు తొడుగు చేయించాడు. 11 ఆ కెరూబు ఆకారాలకు రెక్కలు ఉన్నాయి. వాటి రెక్కల పొడుగు మొత్తం ఇరవై మూరలు. మొదటి కెరూబు రెక్క ఒకటి గోడకు తగిలేది. దాని పొడుగు అయిదు మూరలు. దాని రెండో రెక్క రెండో కెరూబు రెక్కలో ఒకదానికి తగిలేది. దాని పొడుగు కూడా అయిదు మూరలు. 12 అలాగే రెండో కెరూబు రెక్క ఒకటి ఆలయం గోడకు, మరో రెక్క మొదటి కెరూబు రెక్కలో ఒకదానికి తగిలేది. ఒక్కో రెక్క పొడుగు అయిదు మూరలు. 13 ఆ విధంగా ఆ కెరూబుల రెక్కలు ఇరవై మూరలు వ్యాపించేవి. కెరూబుల ముఖాలు ఆలయం లోపలివైపు తిరిగేవి. కెరూబులు కాళ్ళమీద నిలబడి ఉన్నాయి.
14 ✽ సొలొమోను తెరను కూడా చేయించాడు. దానిమీద కెరూబు ఆకారాలను కుట్టించాడు. ఆ తెరను నీల, ఊదా, ఎర్ర రంగుల నూలుతో, సన్న నార నూలుతో చేయించాడు.
15 ✽ ఆలయం ముందు స్థలానికి రెండు స్తంభాలు చేయించాడు. వాటి ఎత్తు ముప్ఫయి అయిదు మూరలు. వాటిమీద అయిదు మూరల ఎత్తుగల పీటలను కూడా చేయించాడు. 16 గర్భాలయానికి చేసినట్టే గొలుసు పని చేయించాడు. దానిని స్తంభాలపైన ఉంచాడు. నూరు దానిమ్మ పండ్లు చేయించి ఆ గొలుసు పనిమీద తగిలించాడు. 17 ఆలయం ఎదుట ఆ రెండు స్తంభాలు, కుడి వైపు ఒకటి, ఎడమ వైపు ఒకటి నిలబెట్టించాడు. కుడి వైపు ఉన్నదానికి “యాకీను” అని, ఎడమ వైపు ఉన్నదానికి “బోయజు” అని పేర్లు పెట్టాడు.