2
1 సొలొమోను యెహోవా పేరుకు ఒక ఆలయం, తనకోసం ఒక రాజభవనం కట్టించాలనుకొన్నాడు. 2 అతడు డెబ్భై వేలమందిని బరువులు మోయడానికి, ఎనభై వేలమందిని కొండలలో రాళ్ళు త్రవ్వడానికి ఏర్పాటు చేశాడు. ఆ పని తనిఖీ చేయడానికి వారిమీద మూడు వేల ఆరు వందలమంది అధికారులను కూడా నియమించాడు. 3  తూరు రాజైన హీరామ్కు సొలొమోను కబురంపాడు: “నా తండ్రి అయిన దావీదుకు నివాసంగా ఒక భవనం కట్టడానికి మీరు దేవదారు మ్రానులను పంపించారు. అలాగే నాకూ పంపించండి. 4 ఎందుకంటే, నా దేవుడైన యెహోవా పేరుకు ఒక ఆలయం కట్టిస్తాను. ఆయన సన్నిధానంలో పరిమళ ధూపం వెయ్యడంకోసం, ఎల్లప్పుడూ సన్నిధి రొట్టెలు పెట్టడంకోసం, ప్రతి ఉదయమూ సాయంకాలమూ, విశ్రాంతి దినాల్లో, అమావాస్యలప్పుడు, మా దేవుడైన యెహోవాకు నియామక పండుగల సమయాలలో హోమబలులు అర్పించడంకోసం ఆ ఆలయాన్ని ఆయనకు ప్రతిష్ఠ చేస్తాను. ఈ ఆరాధన ఇస్రాయేల్‌కు ఎప్పటికీ నిలిచివుండే చట్టం. 5 నేను కట్టించే ఆలయం గొప్పదిగా ఉంటుంది. ఎందుకంటే మా దేవుడు దేవుళ్ళందరికంటే గొప్పవాడు. 6 అయితే అసలు ఆయనకు ఆలయం ఎవరు నిర్మించగలరు? ఆకాశం, పై ఆకాశాలు కూడా ఆయనను పట్టలేవు. ఆయనకు ఆలయం కట్టించడానికి నేను ఏపాటివాణ్ణి? ఆయన సన్నిధానంలో ధూపం వెయ్యడంకోసమే, హోమాలకోసమే ఆలయం నిర్మిస్తాను.
7 “జెరుసలంలోనూ యూదా ప్రదేశంలోనూ నా దగ్గర నేర్పరులైన పనివాళ్ళున్నారు. వాళ్ళను నా తండ్రి దావీదు నియమించాడు. వాళ్ళతో కలిసి బంగారం, వెండి, కంచు, ఇనుములతోను, ఊదారంగు నూలుతోను, ఎర్రరంగు నూలుతోను పనులు, అన్ని చెక్కడం పనులు నిర్వహించడానికి నేర్పుగల ఒక మనిషిని పంపండి. 8 లెబానోను అడవులలో మ్రానులు నరకడంలో మీ పనివారు నేర్పరులని నాకు తెలుసు గనుక లెబానోను నుంచి నాకు సరళవృక్షం దూలాలనూ దేవదారు దూలాలనూ చందనం దూలాలనూ పంపించండి. 9 నేను కట్టించబోయే ఆలయం చాలా గొప్పదిగా, ఆశ్చర్యం కొలిపేదిగా ఉంటుంది. గనుక ఎన్నో దూలాలు కావాలి. నాకోసం వాటిని సిద్ధం చేయడానికి నా పనివాళ్ళు మీ పనివాళ్ళతో కలిసి పని చేస్తారు. 10 దూలాలు నరికే మీ పనివాళ్ళకు ఆహారంగా రెండు లక్షల తూముల గోధుమ పిండిని, రెండు లక్షల తూముల యవలను, నాలుగు లక్షల నలభై వేల లీటర్ల ద్రాక్షరసం, నాలుగు లక్షల నలభై వేల లీటర్ల నూనె ఇస్తాను.”
11 దానికి జవాబుగా తూరు రాజైన హీరామ్ సొలొమోనుకు ఒక లేఖ రాశాడు: “యెహోవా తన ప్రజను ప్రేమగా చూస్తున్నాడు. అందుకే మిమ్మల్ని వారిమీద రాజుగా నియమించాడు. 12 ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవా భూమినీ ఆకాశాలనూ సృజించిన దేవుడు. ఆయన స్తుతిపాత్రుడు! ఆయన దావీదురాజుకు బుద్ధిగల కుమారుణ్ణి ప్రసాదించాడు. ఆ కుమారుడు తెలివి, వివేకంగలవాడై, యెహోవా పేరుకు ఆలయం, తనకు రాజభవనం కట్టిస్తాడు. 13 మీ దగ్గరికి హూరామబీ అనే మనిషిని పంపిస్తున్నాను. అతడు మంచి నేర్పుగల పనివాడు, చురుకైనవాడు. 14 అతడి తల్లి దాను వంశీకురాలు. తండ్రి తూరువాడు. బంగారం, వెండి, కంచు, ఇనుము, రాళ్ళు, దూలాలతో పని చేయడం అతడికి బాగా తెలుసు. ఊదా, ఎర్ర, నీల నూలుతోనూ సన్న నూలుతోను పని చేయడం, అన్ని రకాల చెక్కడం పనులు కూడా అతడికి బాగా తెలుసు. అన్ని రకాల నమూనాల ప్రకారం చేయగలడు. నా యజమానీ మీ తండ్రీ అయిన దావీదు, మీరు ఏర్పాటు చేసిన పనివారితో అతడు పని చేస్తాడు. 15 నా యజమానులైన మీరు చెప్పినట్టే ఇప్పుడు గోధుమలు, యవలు, నూనె, ద్రాక్షరసం మీ సేవకులకు పంపించండి. 16 మీరు కావాలన్న దూలాలను మేము లెబానోను అడవులనుంచి నరికి సముద్రంమీద తెప్పలుగా కట్టి, యొప్పే దాకా తెస్తాం. అక్కడనుంచి మీరు వాటిని జెరుసలంకు తీసుకుపోవచ్చు.”
17 సొలొమోను ఇస్రాయేల్‌లో ఉంటున్న పరాయి దేశీయుల జనాభాలెక్కలు తీయించాడు. తన తండ్రి అయిన దావీదు చేయించిన లెక్కలను పాటించాడు. అలాంటివారిని లెక్కించినప్పుడు మొత్తం లక్ష యాభై మూడు వేల ఆరు వందలమంది ఉన్నారు. 18 వారిలో డెబ్భై వేలమందిని బరువులు మోయడానికి, ఎనభై వేలమందిని కొండలలో రాళ్ళు త్రవ్వడానికి నియమించాడు. పని సక్రమంగా జరిగేలా చూడడానికి మూడు వేల ఆరు వందలమందిని పనివారిమీద అధికారులుగా నియమించాడు.