2 దినవృత్తాంతాలు
1
1 దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యంలో రాజుగా స్థిరపడ్డాడు. అతని దేవుడు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు, గొప్పగా అతణ్ణి హెచ్చించాడు. 2  ఎడారిలో యెహోవా సేవకుడైన మోషే నిర్మించిన సన్నిధిగుడారం గిబియోనులో ఉంది. 3 అక్కడికి రమ్మని సొలొమోను వెయ్యి మందికీ నూరు మందికీ అధిపతులతో, న్యాయాధిపతులతో, పూర్వీకుల కుటుంబం పెద్దలతో ఇస్రాయేల్ వారందరితో చెప్పాడు. సొలొమోను, ఆ సర్వసమాజం గిబియోనులో ఉన్న ఎత్తు స్థలానికి వెళ్ళారు. 4 అంతకుముందు దావీదు దేవుని మందసాన్ని కిర్యత్‌యారీం నుంచి జెరుసలంలో దానికి సిద్ధం చేసిన స్థలానికి తెప్పించాడు. తాను వేయించిన గుడారంలో దానిని ఉంచాడు. 5 అయితే హూర్ మనుమడూ ఊరి కొడుకూ అయిన బసెలేల్ చేసిన కంచు బలిపీఠం గిబియోనులో యెహోవా సన్నిధిగుడారం ముందు ఉంది. సొలొమోను, ఆ సమాజమంతా బలిపీఠం దగ్గర విచారణ చేశారు. 6 సన్నిధిగుడారంలో ఉన్న యెహోవా సన్నిధానం ఎదుట ఉన్న బలిపీఠం దగ్గరికి వెళ్ళి సొలొమోను దానిమీద వెయ్యి హోమ బలులు అర్పించాడు.
7 ఆ రాత్రి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై “నేను నీకు ఏమి ఇవ్వాలో కోరుకో” అన్నాడు.
8 అందుకు సొలొమోను దేవునితో అన్నాడు “నీవు నా తండ్రి దావీదుమీద ఎంతో అనుగ్రహం చూపావు. ఆయన స్థానంలో నన్ను రాజుగా చేశావు. 9 నీవు నా తండ్రి దావీదుతో చేసిన వాగ్దానాన్ని ఇప్పుడు నెరవేర్చు. యెహోవాదేవా, భూమిమీది ధూళి అంత విస్తారమైన ఈ ప్రజలమీద నన్ను రాజుగా నియమించావు. 10 ఈ గొప్ప ప్రజ నీవారు. వీరికి న్యాయం తీర్చడం ఎవరికి సాధ్యం? గనుక ఈ ప్రజ వెళ్ళవలసిన మార్గాలు నేను చూపించేలా నాకు జ్ఞానం, తెలివి ప్రసాదించు.”
11 అందుకు దేవుడు సొలొమోనుతో ఇలా చెప్పాడు: “ఈ విధంగా నీవు ఆలోచన చేసుకొన్నావు. ఆస్తిపాస్తులను గానీ ఐశ్వర్యాన్ని గానీ ఘనతను గానీ నీ విరోధుల ప్రాణాలను గానీ దీర్ఘయుష్షును గానీ అడగలేదు. నేను నిన్ను రాజుగా నియమించిన నా ప్రజను న్యాయంగా పరిపాలించడానికి జ్ఞానం, తెలివి అడిగావు. 12 గనుక జ్ఞానం, తెలివి నీకు ప్రసాదిస్తున్నాను. అంతేగాక నీకు ఆస్తిపాస్తులనూ ఐశ్వర్యాన్నీ ఘనతనూ కూడా ఇస్తాను. నీకు ముందుగా ఉన్న రాజులకంటే, నీ తరువాత వచ్చే రాజులకంటే కూడా అవి నీకు ఎక్కువగా కలిగిస్తాను.”
13 తరువాత సొలొమోను గిబియోనులో ఉన్న సన్నిధిగుడారం ముందు ఉన్న బలిపీఠం విడిచి జెరుసలం వెళ్ళాడు. అక్కడ ఇస్రాయేల్ ప్రజను పరిపాలించాడు.
14 సొలొమోను రథాలనూ గుర్రాలనూ చేకూర్చుకొన్నాడు. అతడికి వెయ్యిన్ని నాలుగు వందల రథాలూ పన్నెండు వేల గుర్రాలూ ఉన్నాయి. వాటిలో కొన్నిటిని రథాల పట్టణాలలో ఉంచాడు, కొన్నిటిని జెరుసలంలో తనదగ్గరే ఉంచాడు. 15 సొలొమోనురాజు జెరుసలంలో వెండి బంగారాలు రాళ్ళలాగా, దేవదారు మ్రానులు కొండ దిగువ ప్రాంతాలలో ఉన్న మేడిచెట్లలాగా అతి విస్తారంగా ఉండేలా చేశాడు. 16 సొలొమోను గుర్రాలను ఈజిప్ట్ నుంచీ కవేనుంచీ దిగుమతి చేసుకొన్నాడు. రాజు నియమించిన వర్తకులు వాటిని కొని తెచ్చారు. 17 ఒక్కో రథం ఆరు వందల తులాల వెండికి, ఒక్కో గుర్రం నూట యాభై తులాల వెండికి ఈజిప్ట్ నుంచి దిగుమతి చేసుకొన్నారు. హిత్తీజాతివాళ్ళ రాజులందరికీ, సిరియా రాజులకు అమ్మడానికి కూడా అదే విధంగా దిగుమతి చేశారు.