28
1 ✽ దావీదు జెరుసలంకు ఇస్రాయేల్ ప్రజల అధిపతులందరినీ – గోత్రాల అధికారులనూ, రాజుకు సేవ చేసే సైన్య భాగాల అధిపతులనూ, వెయ్యిమందికి వందమందికి అధిపతులనూ, రాజుకూ రాకుమారులకూ కలిగిన ఆస్తిపాస్తులు, పశువులు, అన్నిటిమీదా ఉన్న అధికారులనూ, రాజ పరివారాన్నీ పరాక్రమవంతులనూ, యుద్ధ వీరులందరినీ సమకూర్చాడు. 2 అప్పుడు దావీదురాజు నిలబడి ఇలా అన్నాడు:“నా సోదరులారా, నా ప్రజలారా, వినండి, యెహోవా మందసానికి, మన దేవుని పాదపీఠా✽నికి స్థిరమైన ఆలయాన్ని కట్టించాలని నేను ఉద్దేశించాను✽. దానిని కట్టించడానికి వస్తువులను సిద్ధపరచాను. 3 ✝అయితే దేవుడు ‘నీవు యోధుడివి, రక్తపాతం చేసినవాడివి గనుక నీవు నా పేరుకు ఆలయాన్ని కట్టించకూడదు’ అని నాతో చెప్పాడు.
4 ✝“అయినా ఇస్రాయేల్ ప్రజమీద శాశ్వతంగా రాజుగా ఉండడానికి ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా నా తండ్రి కుటుంబం వారందరిలో నన్ను ఎన్నుకొన్నాడు. ఆయన యూదాగోత్రాన్ని పరిపాలించే గోత్రంగా ఎన్నుకొన్నాడు. యూదా✽గోత్రంలో నా తండ్రి కుటుంబాన్ని ఎన్నుకొన్నాడు. నా తండ్రి కొడుకులలో నన్ను ఇస్రాయేల్ ప్రజలమీద రాజుగా చేయడానికి ఇష్టపడ్డాడు. 5 యెహోవా చాలమంది✽ కొడుకులను నాకు ప్రసాదించాడు. అయితే ఇస్రాయేల్ ప్రజలమీద యెహోవా రాజ్య సింహాసనమెక్కడానికి ఆయన నా కొడుకులందరిలో సొలొమోనును ఎన్నుకొన్నాడు. 6 ✝ఆయన నాతో ఇలా అన్నాడు: ‘నేను నీ కొడుకు సొలొమోనును నాకు కుమారుడుగా ఎన్నుకొన్నాను. నేను అతనికి తండ్రిగా ఉంటాను. అతడే నా ఆలయాన్నీ ఆవరణాలనూ కట్టిస్తాడు. 7 ఈ రోజుల్లో జరుగుతూ ఉన్నట్లు అతడు నా ఆజ్ఞలనూ న్యాయనిర్ణయాలనూ నిలకడగా అనుసరిస్తే, అతని రాజ్యాన్ని ఎల్లకాలం స్థిరపరుస్తాను.’
8 ✽ “ఇప్పుడు, యెహోవా సమాజంగా ఉన్న ఇస్రాయేల్ ప్రజలందరి కళ్ళెదుట, మన దేవుడు వింటూ ఉండగా, నేను మిమ్ములను ప్రోత్సహించాలని ఉన్నాను – మీ దేవుడు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ పాటించండి. అలా చేస్తే, ఈ మంచి దేశం మీ ఆధీనంలో ఉండిపోతుంది, మీ తరువాత మీ సంతానానికి శాశ్వతమైన వారసత్వం దానిని అప్పగించ గలుగుతారు.
9 “సొలొమోను, నా కుమారా, నీ తండ్రియొక్క దేవుడు యెహోవా అందరి హృదయాలనూ✽ పరిశోధిస్తాడు, ఆలోచనలన్నిటిలో దాక్కొన్న ఉద్దేశాలన్నిటినీ గ్రహిస్తాడు. నీవు ఆయనను తెలుసుకో. మనసారా, హృదయపూర్వకంగా ఆయనకు సేవ చెయ్యి. ఆయనను వెదికితే✽ ఆయన నీకు దొరుకుతాడు. నీవు ఆయనను విడిచిపెడితే✽ ఆయన నిన్ను శాశ్వతంగా విసర్జిస్తాడు. 10 తనకు పవిత్ర స్థలంగా✽ ఆలయాన్ని కట్టించడానికి యెహోవా నిన్ను ఎన్నుకొన్న సంగతి ఆలోచించు, దృఢ చిత్తంతో ఆ పని జరిగించు.”
11 ✽అప్పుడు దావీదు ఆలయం మంటపం కోసం, కట్టడాలకోసం, వస్తువులను కూడబెట్టే గదులకోసం, మేడగదులకోసం, లోపలి గదులకోసం, కరుణాస్థానంగా ఉన్న గదికోసం తాను ఆలోచించి సిద్ధపరచిన నమూనాలను తన కొడుకు సొలొమోనుకు ఇచ్చాడు. 12 యెహోవా ఆలయ ఆవరణాలకోసం, చుట్టూరా ఉన్న గదులకోసం, దేవాలయం ఖజానాల కోసం, దేవునికి అంకితమైన వస్తువులను కూడబెట్టే గదులకోసం కూడా నమూనాలను ఇచ్చాడు. 13 ✝యాజులూ లేవీగోత్రికులూ సేవ చేయవలసిన వంతుల విషయం, యెహోవా ఆలయంలో జరగవలసిన సేవ విషయం, దాని సేవలో ఉపయోగించవలసిన సామాను విషయం కూడా దావీదు ఆదేశాలిచ్చాడు. 14 వేరు వేరు పనులకు కావలసిన బంగారు సామాను అంతటినీ చేయడానికి బంగారం బరువు ఎంతో, వెండి సామాను అంతటినీ చేయడానికి వెండి బరువు ఎంతో ఆ సంగతి కూడా దావీదు అతనికి తెలియజేశాడు. 15 ఈ క్రింది వాటిలో ఒక్కొక్కదానిని చేయడానికి బంగారం బరువు, లేదా వెండి బరువు ఎంతో అతడు తెలియజేశాడు: బంగారు దీపస్తంభాలు, బంగారు దీపాలు, వెండి దీపస్తంభాలు, వెండి దీపాలు, 16 దేవుని సన్నిధానంలో రొట్టెలు ఉంచే బంగారు బల్లలు, వెండి బల్లలు, 17 మేలిమి బంగారు ముండ్లూ గిన్నెలూ పాత్రలూ, ప్రతి బంగారు గిన్నే, ప్రతి వెండి గిన్నే, 18 శుద్ధిచేయబడ్డ బంగారు ధూపవేదిక. అంతేగాక, రెక్కలు విప్పుకొని, యెహోవా ఒడంబడికపెట్టెను కప్పే బంగారు కెరూబుల నమూనా – ఆ వాహనం నమూనాను దావీదు అతనికి ఇచ్చాడు.
19 ✽అప్పుడు దావీదు “ఇదంతా వ్రాసి ఉంది. యెహోవా తన చెయ్యి నామీద ఉంచి ఈ నమూనా వివరణలన్నిటి విషయం నాకు గ్రహింపు ప్రసాదించాడు” అని చెప్పాడు.
20 ✝✽దావీదు తన కొడుకు సొలొమోనుతో ఇంకా అన్నాడు: “దృఢంగా, ధైర్యంతో ఉండి, ఈ పని జరిగించు. భయపడకు. హడలిపోకు. యెహోవా దేవుడు – నా దేవుడు నీతో కూడా ఉంటాడు. యెహోవా ఆలయ సేవ కోసం పని అంతా ముగిసేవరకు ఆయన నిన్ను ఏమాత్రమూ విడువడు. 21 దేవుని ఆలయ సేవంతటికోసం యాజులకూ లేవీగోత్రికులకూ వంతుల ఏర్పాటయింది. ఈ పని అంతటినీ చేయడానికి వేరు వేరు పనులలో నేర్పు పొందినవాళ్ళు✽ మనసారా నీకు సహాయం చేస్తారు. అధిపతులూ ప్రజలందరూ నీ ఆజ్ఞలు శిరసావహిస్తారు.”