29
1 అప్పుడు దావీదురాజు సమకూడిన వారందరితో ఇలా అన్నాడు: “దేవుడు ఎన్నుకొన్న నా కొడుకు సొలొమోను ఇంకా యువకుడు✽, అనుభవం లేనివాడు. కట్టవలసిన ఆలయం మనిషికోసం కాదు, యెహోవాదేవుని కోసమే✽ గనుక ఈ పని చాలా గొప్పది. 2 ✝నా శక్తికొలది ప్రయాసపడి నా దేవుని ఆలయానికి కావలసిన బంగారు వస్తువులకోసం బంగారాన్ని, వెండి వస్తువులకోసం వెండిని, కంచు వస్తువులకోసం కంచును, ఇనుప వస్తువుల కోసం ఇనుమును, కర్ర పనికి కర్రలను, మిశ్రమ వర్ణ రత్నాలను, పొదుగుపనికి రత్నాలను, వింతైన రంగులు గల వేరువేరు రకాల రత్నాలను, చాలా వెలగల అన్నిరకాల రత్నాలను, తెల్ల చలువరాయిని సమృద్ధిగా సమకూర్చాను. 3 పవిత్రాలయం కోసం నేను సమకూర్చిన వస్తువులు గాక, నా దేవుని ఆలయం విషయం నాకు కలిగిన అభిమానం కారణంగా నా సొంత✽ ఖజానాలో ఉన్న వెండి బంగారాలను నా దేవుని ఆలయంకోసం ఇస్తున్నాను – 4 ఓఫీర్ దేశం బంగారాన్ని లక్ష కిలోగ్రాములు, శుద్ధి చేసిన వెండిని రెండు లక్షల ముప్ఫయి అయిదు వేల కిలోగ్రాములు ఇస్తున్నాను. ఈ వెండి బంగారాలు కట్టడాల గోడలకు తొడుగు చేయడానికి 5 బంగారం పనికీ వెండి పనికీ పనివారు చేసే ప్రతి పనికీ ఉంటాయి. “ఇప్పుడు మీలో ఎవరు యెహోవాకు మనసారా అర్పణ ఇస్తారు?”6 అప్పుడు కుటుంబ నాయకులూ ఇస్రాయేల్ గోత్రాల అధికారులూ వెయ్యిమందికి వందమందికి అధిపతులూ రాజు పనులకు పైవిచారణకర్తలూ కలిసి ఇష్టపూర్వకంగా అర్పణలిచ్చారు. 7 వారు దేవుని ఆలయం పనికి లక్షా డెబ్భై మూడు వేల కిలోగ్రాముల బంగారాన్నీ మూడు లక్షల నలభై కిలోగ్రాముల వెండినీ ఆరు లక్షల పద్నాలుగు వేల కిలోగ్రాముల కంచునూ ముప్ఫయి నాలుగు లక్షల కిలోగ్రాముల ఇనుమునూ ఇచ్చారు. 8 తమ దగ్గర రత్నాలున్నవారు వాటిని తెచ్చి యెహోవా ఆలయం ఖజానా అధికారీ గెర్షోం వంశంవాడూ అయిన యెహీయేల్‌కు ఇచ్చారు. 9 వారు మనస్ఫూర్తిగా✽ యెహోవాకు ఇవ్వడం చూచి ప్రజలు సంతోషించారు. దావీదురాజు కూడా అధికంగా సంతోషించాడు.
10 సమకూడిన వారందరి కళ్ళెదుటే దావీదు యెహోవాను ఇలా స్తుతించాడు: “మా పూర్వీకుడైన ఇస్రాయేల్ యొక్క దేవా! యెహోవా! శాశ్వతంగా నీకు స్తుతి కలుగుతుంది గాక!
11 ✝యెహోవా! ఆకాశాలలో, భూమిమీద
ఉన్నవన్నీ నీ సొత్తు
గనుక మహత్తు, ప్రభావం, తేజస్సు, ప్రతాపం,
మహిమ నీకే చెందుతాయి.
యెహోవా! రాజ్యం కూడా నీదే.
నీవు అందరిమీదా అధిపతిగా ఉన్నావు.
12 ✝ఐశ్వర్యం, ఘనత నీ మూలంగా కలుగుతాయి.
నీవు విశ్వాన్ని పరిపాలిస్తున్నావు.
గొప్ప చేయడానికి, అందరికీ బలం ఇవ్వడానికీ
నీ చేతిలో బలప్రభావాలు ఉన్నాయి.
13 మా దేవా! ఇప్పుడు మేము నీకు కృతజ్ఞతలు
అర్పిస్తున్నాం,
నీ ఘనమైన పేరును స్తుతిస్తున్నాం.
14 ✽“అయితే ఇంత ధారాళంగా ఇవ్వగలగడానికి నేను ఏపాటివాణ్ణి? నా ప్రజలు ఏపాటివారు? అన్నీ నీ మూలంగానే చేకూరుతాయి గదా. నీ చేతిలో దొరికినదానిలో కొంత మేము నీకు ఇచ్చాం. 15 మా పూర్వీకులలాగే మేము నీ ఎదుట అతిథులం, విదేశీయులం✽. భూమి మీద మా బ్రతుకు నీడ✽లాంటిది – ఎవరూ స్థిరంగా ఉండరు. 16 మా దేవా! యెహోవా! నీ పవిత్రమైన పేరుకు ఆలయాన్ని కట్టించడానికి మేము సమకూర్చిన ఈ ధనమంతా నీ మూలంగానే కలిగింది. అంతా నీదే. 17 నా దేవా! నీవు అంతరంగాన్ని పరిశోధించేవాడివి. నిజాయితీ✽ అంటే నీకు చాలా ఇష్టం. అది నాకు తెలుసు. నేను ఇవన్నీ మనసారా యథార్థ హృదయంతో ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న నీ ప్రజలు కూడా నీకు మనసారా✽ ఇచ్చారు. ఇది చూచి నేను సంతోషించాను. 18 యెహోవా! మా పూర్వీకులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవా! నీ ప్రజల తలంపులలో ఈ ఉద్దేశం ఎప్పటికీ ఉండేలా వారి హృదయాలను కాపాడు. నీ విషయంలో✽ వారి హృదయాలు సుస్థిరంగా ఉండేలా చెయ్యి. 19 ✝నా కొడుకు సొలొమోను నీ ఆజ్ఞలూ శాసనాలూ చట్టాలూ అన్నిటి ప్రకారం ప్రవర్తించేలా, కట్టించడానికి నేను సిద్ధం చేసిన ఆలయాన్ని అతడు కట్టించేలా అతనికి నిర్దోషమైన హృదయాన్ని ప్రసాదించు.”
20 అప్పుడు దావీదు సమకూడిన వారందరితో “ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించండి” అన్నాడు. వారంతా తమ పూర్వీకుల దేవుడు యెహోవాను స్తుతించి, రాజు ఎదుట యెహోవాకు సాష్టాంగ నమస్కారాలు చేశారు.
21 మరుసటి రోజు వారు యెహోవాకు బలులు అర్పించారు. హోమబలిగా వెయ్యి ఎద్దులనూ వెయ్యి పొట్టేళ్ళనూ వెయ్యి గొర్రె పిల్లలనూ, వాటితోకూడా వాటి పానార్పణలనూ అర్పించారు. ఇస్రాయేల్ ప్రజలందరికోసం ఇతర బలులు అనేకం అర్పించారు. 22 ✝ఆ రోజు వారు యెహోవా సన్నిధానంలో చాలా సంతోషంతో అన్నపానాలు పుచ్చుకొన్నారు. అప్పుడు వారు దావీదు కొడుకైన సొలొమోనుకు రెండో సారి✽ పట్టాభిషేకం చేసి యెహోవా సమక్షంలో అతణ్ణి పరిపాలకుడుగా, సాదోకును యాజిగా అభిషేకించారు.
23 సొలొమోను రాజై తన తండ్రి దావీదు స్థానంలో యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చున్నాడు. అతడు వర్ధిల్లాడు. ఇస్రాయేల్ ప్రజలంతా అతనికి విధేయులయ్యారు. 24 అధిపతులంతా, యుద్ధ వీరులంతా, రాజైన దావీదు కొడుకులందరూ సొలొమోనురాజుకు లోబడడానికి ఒప్పుకొన్నారు. 25 ✝యెహోవా సొలొమోనును ఇస్రాయేల్ ప్రజలందరి కళ్ళెదుటా అధికంగా గొప్ప చేశాడు. అతనికి ముందుగా ఇస్రాయేల్ ప్రజల రాజులలో ఏ రాజుకు కలగని రాజ్య ప్రతాపం అతనికి ప్రసాదించాడు.
26 యెష్షయి కొడుకు దావీదు ఇస్రాయేల్ ప్రజలందరినీ పరిపాలించేవాడు. 27 ✝అతడు ఇస్రాయేల్ ప్రజలను నలభై సంవత్సరాలు పరిపాలించాడు. హెబ్రోనులో ఏడేళ్ళు, జెరుసలంలో ముప్ఫయి మూడు ఏళ్ళు పరిపాలించాడు. 28 అతడు దీర్ఘాయువునూ ఐశ్వర్యాన్నీ గౌరవాన్నీ అనుభవించి పండు ముసలితనంలో చనిపోయాడు. అతని స్థానంలో అతని కొడుకు సొలొమోను రాజయ్యాడు. 29 దావీదురాజు విషయాలన్నీ దీర్ఘదర్శి అయిన సమూయేలు, నాతాను ప్రవక్త, దీర్ఘదర్శి అయిన గాదు✽ రచించిన పుస్తకాలలో వ్రాసి ఉన్నాయి. 30 ఆ పుస్తకాలలో అతని పరిపాలన అంతటి విషయం, అతని పరాక్రమాన్ని గురించి, అతనికీ ఇస్రాయేల్ ప్రజలకూ దేశాల✽ రాజ్యాలన్నిటికీ సంభవించిన పరిస్థితుల వివరణలు కూడా వ్రాసి ఉన్నాయి.