27
1 ఇది ఇస్రాయేల్ ప్రజల లెక్క వివరణ. వారి కుటుంబ నాయకులు, వెయ్యిమందికి వందమందికి అధిపతులు, వారి అధికారులు సైన్య భాగాల విషయాలన్నిటిలో రాజుకు సేవ చేశారు. ఈ సైన్య భాగాలకు సంవత్సరమంతట్లో నెల నెల వంతుల ప్రకారం బాధ్యత ఉంది. ఒక్కొక్క భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు. 2 మొదటి నెలలో మొదటి భాగంమీద జలదీయేల్ కొడుకు యాషాబాం అధిపతిగా ఉన్నాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు. 3 అతడు పెరెజ్ సంతతివాడు, ఆ మొదటి నెల సైన్యాధిపతులందరికీ అధిపతి. 4 రెండో నెలలో రెండో భాగంమీద అహోవా వంశంవాడు దోదయి అధిపతిగా ఉన్నాడు. అతని భాగంలో మికలోత్ అనేవాడు నాయకుడుగా ఉన్నాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు. 5 మూడో నెలలో ప్రముఖయాజి అయిన యెహోయాదా కొడుకు బెనాయా సైన్యాధిపతిగా ఉన్నాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు. 6 ఈ బెనాయా ముప్ఫయిమంది వీరులలో ఒకడు, వారికి అధిపతి. అతని భాగంలో అతని కొడుకు అమ్మీజాబాదు అధిపతిగా ఉన్నాడు. 7 నాలుగో నెలలో యోవాబు తోబుట్టువు అశాహేల్ నాలుగో భాగంమీద అధిపతిగా ఉన్నాడు. అతని తరువాత అతని కొడుకు జెబదయా అధిపతి అయ్యాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు. 8 అయిదో నెలలో అయిదో భాగంమీద ఇజ్రా హేతువాడైన షమహూతు అధిపతిగా ఉన్నాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు. 9 ఆరో నెలలో ఆరో భాగంమీద తెకోవ ఊరివాడైన ఇక్కెషు కొడుకు ఈరా అధిపతిగా ఉన్నాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు. 10 ఏడో నెలలో ఏడో భాగం మీద ఎఫ్రాయిం గోత్రం వాడూ పెలోన్ సంతతివాడు అయిన హేలెసు అధిపతిగా ఉన్నాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు. 11 ఎనిమిదో నెలలో ఎనిమిదో భాగంమీద హుషా గ్రామస్తుడూ జెరహు వంశంవాడూ అయిన సిబ్బెకయి అధిపతిగా ఉన్నాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు. 12 తొమ్మిదో నెలలో తొమ్మిదో భాగంమీద అనాతోతు గ్రామస్తుడూ బెన్‌యామీన్ గోత్రంవాడూ అయిన అబీయెజెరు అధిపతిగా ఉన్నాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు. 13 పదో నెలలో పదో భాగంమీద నెటోపా గ్రామస్తుడూ జెరహు వంశంవాడూ అయిన మహారయి అధిపతిగా ఉన్నాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు. 14 పదకొండో నెలలో పదకొండో భాగంమీద పిరాతోను గ్రామవాసీ ఎఫ్రాయిం గోత్రంవాడూ అయిన బెనాయా అధిపతిగా ఉన్నాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు. 15 పన్నెండో నెలలో పన్నెండో భాగంమీద నెటోపా గ్రామస్తుడూ ఒతనీయేల్ వంశంవాడూ అయిన హెలదయి అధిపతిగా ఉన్నాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు.
16 ఇస్రాయేల్ ప్రజల గోత్రాలపై అధికారులు రూబేను గోత్రంవారిమీద జిఖ్రీ కొడుకు ఎలియాజరు ఉన్నాడు; షిమ్యోను గోత్రంవారిమీద మయకా కొడుకు షెపటయా ఉన్నాడు; 17 లేవీ గోత్రంవారిమీద కెమూయేల్ కొడుకు హషబయా ఉన్నాడు; అహరోను వంశంవారిమీద సాదోకు ఉన్నాడు; 18 యూదా గోత్రంవారిమీద దావీదు సోదరులలో ఎలీహు అనేవాడు ఉన్నాడు; ఇశ్శాకారు గోత్రంవారిమీద మికాయేల్ కొడుకు ఒమ్రీ ఉన్నాడు; 19 జెబూలూను గోత్రంవారిమీద జబదయా కొడుకు ఇషమయా ఉన్నాడు; నఫ్తాలి గోత్రంవారిమీద అజ్రీయేల్ కొడుకు యెరీమోతు ఉన్నాడు; 20 ఎఫ్రాయిం గోత్రంవారిమీద అజయా కొడుకు హోషేయ ఉన్నాడు; మనష్షే అర్ధ గోత్రం వారి మీద పెదాయా కొడుకు యోవేల్ ఉన్నాడు; 21 గిలాదులో ఉన్న మనష్షే అర్ధగోత్రం వారి మీద జెకర్యా కొడుకు ఇద్దో ఉన్నాడు: బెన్యామీను గోత్రం వారి మీద అబ్నేర్ కొడుకు యహశీయేల్ ఉన్నాడు; 22 దాను గోత్రంవారిమీద యెరోహాం కొడుకు అజరేల్ ఉన్నాడు; వీరు ఇస్రాయేల్ గోత్రాలకు అధికారులు.
23 ఇస్రాయేల్ ప్రజలను ఆకాశ నక్షత్రాలంత మందిగా చేస్తానని యెహోవా వాగ్దత్తం చేశాడు గనుక ఇరవై ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయసు ఉన్న వారిని లెక్కపెట్టించలేదు. 24 జనాభా లెక్కలు వ్రాయడం సెరూయా కొడుకు యోవాబు ఆరంభించాడు గానీ ఆ పని ముగించలేదు. జనాభా లెక్కలు వ్రాయడం కారణంగా ఇస్రాయేల్ ప్రజలమీదికి దేవుని కోపం వచ్చింది. జనసంఖ్య మొత్తం దావీదురాజు వృత్తాంత గ్రంథంలో చేరలేదు.
25 రాజు గిడ్డంగులకు అదీయేల్ కొడుకు అజమావెతు అధికారి. పల్లెటూళ్ళ ప్రాంతాలలో, పట్టణాలలో, గ్రామాలలో, కోటలలో కూడబెట్టినవి ఉజ్జియా కొడుకు యోనాతాను ఆధీనంలో ఉన్నాయి. 26 భూమి సాగు చేసే పొలం పనివారిమీద కెలూబు కొడుకు ఎజ్రీ అధికారిగా ఉన్నాడు. 27 ద్రాక్ష తోటలమీద రమా గ్రామం వాడు షిమీ అధికారిగా ఉన్నాడు. ద్రాక్షరసం కోసమైన ద్రాక్షపండ్లు, ద్రాక్షరసం కూడబెట్టిన కొట్లమీద షిపమోతు గ్రామం వాడు జబది అధికారిగా ఉన్నాడు. 28 షెఫెలా ప్రాంతంలో ఉన్న ఆలీవ్ చెట్లమీద, మేడిచెట్లమీద గెదేరు గ్రామం వాడు బేల్ హనాను అధికారిగా ఉన్నాడు. నూనె కొట్లమీద యోవాషు అధికారిగా ఉన్నాడు. 29 షారోను ప్రాంతంలో మేసే పశువులమీద షారోనువాడైన షిట్రయి అధికారిగా ఉన్నాడు. లోయలలో ఉన్న పశువులమీద అదలయి కొడుకు షాపాతు అధికారిగా ఉన్నాడు. 30 ఒంటెలమీద ఇస్మాయేల్ జాతివాడైన ఓబీల్ అధికారిగా ఉన్నాడు. గాడిదలమీద మేరోనోతు గ్రామం వాడు యెహెదయా అధికారిగా ఉన్నాడు. 31 గొర్రెల, మేకల మందలమీద హగరిజాతివాడైన యాజీజ్ అధికారిగా ఉన్నాడు. వీరందరూ దావీదురాజుకు ఉన్న ఆస్తిపాస్తుల మీద నియమించబడ్డ అధికారులు.
32 దావీదు పినతండ్రి యోనాతాను తెలివైన సలహాదారుడు, ధర్మశాస్త్రి. రాజు కొడుకుల దగ్గర ఉండడానికి హక్మోనీ కొడుకు యెహీయేలు నియమించబడ్డవాడు. 33 అహీతోపెల్ రాజుకు సలహాదారుడు. అర్కీ జాతివాడైన హూషయి రాజుకు మిత్రుడు. 34 అహీతోపెల్ చనిపోయిన తరువాత బెనాయా కొడుకు యెహోయాదా, అబియాతారు మంత్రులయ్యారు. రాజు సైన్యానికి యోవాబు అధిపతిగా ఉన్నాడు.