26
1 ద్వారపాలకుల✽ గుంపుల విషయం: కోరహు వంశంలో ఆసాపు కొడుకులలో కోరె కొడుకు మెషెలెమయా. 2 మెషెలెమయా కొడుకులు: మొదట పుట్టినవాడు జెకర్యా, రెండోవాడు యెదీయవేల్, మూడోవాడు జెబదయా, నాలుగోవాడు యతనీయేల్, 3 అయిదోవాడు ఏలాం, ఆరోవాడు యెహోహనాను, ఏడోవాడు ఎల్‌యోయేనయి. 4 దేవుడు ఓబేదెదోం✽ను దీవించి అతనికి కొడుకులను ప్రసాదించాడు. వారెవరంటే, మొదట పుట్టినవాడు షెమయా, రెండోవాడు యెహోజాబాదు, మూడోవాడు యోవాహు, నాలుగోవాడు శాకారు, అయిదోవాడు నేతనేల్, 5 ఆరోవాడు అమ్మీయేల్, ఏడోవాడు ఇశ్శాకారు, ఎనిమిదోవాడు పెముల్లెతయి. 6 అతని కొడుకు షెమయాకు కూడా కొడుకులు ఉన్నారు. వారు పరాక్రమశాలురు గనుక వారు తమ తండ్రి వంశంలో నాయకులయ్యారు. 7 షెమయా కొడుకులు ఒతని, రెఫాయేల్, ఓబేదు, ఎల్‌జాబాదు; సమర్థులైన అతని తోబుట్టువులు ఎలీహు, సెమకయా. 8 వీరందరూ ఓబేదెదోం సంతతివారు. అతని కొడుకులు వారి కొడుకులూ బంధువులూ అరవై ఇద్దరు. వారు సేవకు బలం గల సమర్థులు. 9 మెషెలెమయా కొడుకులు, బంధువులు పద్ధెనిమిదిమంది. వారు కూడా పరాక్రమశాలురు. 10 మెరారి వంశంవాడు హోసాకు కొడుకులు ఉన్నారు. మొదటివాడు షిమ్రీ (అతడు మొదట పుట్టినవాడు కాకపోయినా అతడి తండ్రి అతణ్ణి జ్యేష్ఠుడుగా ఎంచాడు). 11 రెండోవాడు హిల్కీయా, మూడోవాడు టెబలయా, నాలుగోవాడు జెకర్యా. హోసా కొడుకులూ బంధువులూ అందరూ పదముగ్గురు.12 ఈ ద్వారపాలకుల గుంపులకూ వారి నాయకులకూ తమ బంధువులలాగే యెహోవా ఆలయంలో సేవ చేసే బాధ్యతలు ఉన్నాయి. 13 ✝ఒక్కొక్క ద్వారం దగ్గర కాపలా దారులుగా ఉండడానికి తమ వంశాలప్రకారం చిన్నలకేమీ పెద్దలకేమి వారు చీట్లు వేశారు. 14 తూర్పు దిక్కు కావలి షెలెమయాకు పడింది. తెలివైన సలహాదారుడూ అతడి కొడుకూ అయిన జెకర్యాకు కూడా చీటి వేశారు. ఉత్తర దిక్కు కావలి అతనికి పడింది. 15 దక్షిణ దిక్కు కావలి ఓబేదెదోంకు పడింది. గిడ్డంగి కావలి అతడి కొడుకులకు పడింది. 16 పడమటి దిక్కు కావలి, మీది మార్గం దగ్గర ఉన్న షెల్లెకెతు ద్వారం కావలి షుప్పీంకూ, హోసాకూ పడింది. వీరందరూ వరుసలుగా కావలి కాచేవారు. 17 ప్రతి రోజూ తూర్పున ఆరుగురు లేవీగోత్రికులు ఉన్నారు; ఉత్తరాన నలుగురు ఉన్నారు; దక్షిణాన నలుగురు ఉన్నారు; గిడ్డంగి ఇరువైపులా ఇద్దరేసి ఉన్నారు; 18 పడమటి ద్వారం దగ్గర ఉన్న మార్గం దగ్గర నలుగురు ఉన్నారు, ద్వారం దగ్గరే ఇద్దరు ఉన్నారు. 19 కోరహు, మెరారి వంశాలవారైన ద్వారపాలకుల గుంపులు ఇవి.
20 వారి సాటి లేవీగోత్రికులు దేవుని ఆలయం ఖజానాల విషయం, దేవుని అంకితమైన వస్తువుల✽ ఖజానాల విషయం బాధ్యత వహించేవారు. 21 గెర్షోను వంశంవాడు లద్దాను సంతతివారు దేవుని ఆలయం ఖజానాల విషయం బాధ్యత వహించేవారు. 22 వారు యెహీయేలీ, యెహీయేలీ కొడుకులు జేతాం, అతడి తోబుట్టువు యోవేల్. వారు గెర్షోను వంశంవారు, తమ కుటుంబాల నాయకులు. 23 అమ్రాం వంశస్థులలో ఇసహారు వంశస్థులలో, హెబ్రోను వంశస్థులలో ఉజ్జీయేల్ వంశస్థులలో ఉన్నవారి విషయం: 24 మోషే కొడుకు గెర్షోను సంతతివాడైన షెబూయేలు ఖజానాల అధికారి. 25 ఎలియెజెరు ద్వారా అతడి బంధువులెవరంటే, ఎలియాజరు కొడుకు రెహబయా, అతడి కొడుకు యెషయా, అతడి కొడుకు యెహోరాం, అతడి కొడుకు జిబ్రీ, అతడి కొడుకు షెలోమీతు. 26 ✝దేవునికి అంకితమైన వస్తువులున్న ఖజానాలన్నిటినీ కాపాడే బాధ్యత షెలోమీతుకూ అతడి బంధువులకూ ఉంది. ఆ వస్తువులను దావీదురాజు, వంశనాయకులు, సహస్రాధిపతులు, శతాధిపతులు ఇతర సైన్యాధిపతులు అంకితం చేశారు. 27 యెహోవా ఆలయాన్ని ఘనంగా కట్టించడానికి వారు యుద్ధంలో పట్టుకొన్న దోపిడీ సొమ్ములో కొంత అంకితం చేశారు. 28 దీర్ఘదర్శి అయిన సమూయేలు, కీషు కొడుకు సౌలు, నేర్ కొడుకు అబ్నేర్, సెరూయా కొడుకు యోవాబు అంకితం చేసినవాటినన్నిటినీ కాపాడే బాధ్యత షెలోమీతుకూ అతడి బంధువులకూ ఉంది.
29 ✝ఇసహారు వంశంవారిలో కెననయా, అతడి కొడుకులు బయటి బాధ్యతలను నిర్వహించడానికి నియమించబడ్డారు. వారు ఇస్రాయేల్ ప్రజలకు లేఖకులుగా, న్యాయాధిపతులుగా ఉన్నారు. 30 హెబ్రోను వంశంవారిలో హషబయా, అతడి బంధువులు యొర్దానునది పడమటి దిక్కున ఉన్న ఇస్రాయేల్ ప్రజల విషయమైన యెహోవా సేవ అంతటికీ రాజు పనులకూ బాధ్యత వహించేవారు. వారు వెయ్యిన్ని ఏడు వందలమంది సమర్థులు. 31 హెబ్రోనువారికి, వారు పూర్వీకుల వంశావళి ప్రకారం, యెరీయా నాయకుడు. దావీదు పరిపాలించిన నలభైయో సంవత్సరంలో వారి విషయం వంశవృక్షాలలో పరిశోధన చేయడం జరిగింది. అప్పుడు గిలాదు ప్రదేశంలోని యాజేరులో పరాక్రమశాలురైన హెబ్రోను వంశంవారు ఉన్నారని తెలిసింది. 32 కుటుంబ నాయకులుగా ఉండి, సామర్థ్యం గల యెరీయా బంధువులు రెండువేల ఏడు వందలమంది. దావీదురాజు దేవుని విషయాలన్నిటిలో, రాజ కార్యాల విషయంలో వారిని రూబేను గోత్రంవారిమీదా గాదు గోత్రంవారిమీదా మనష్షే అర్ధగోత్రంవారిమీదా నియమించాడు.