23
1 ✝దావీదు ఏండ్లు నిండిన ముసలివాడయినప్పుడు అతడు తన కొడుకు సొలొమోనును ఇస్రాయేల్ ప్రజలమీద రాజుగా చేశాడు. 2 ✝అతడు ఇస్రాయేల్ ప్రజల నాయకులందరినీ యాజులనూ లేవీగోత్రికులనూ సమకూర్చాడు. 3 ✽ ముప్ఫయి సంవత్సరాలు మొదలుకొని అంతకు పై వయసు గల లేవీగోత్రికులు లెక్కపెట్టబడ్డారు. వారిలో పురుషుల సంఖ్య ముప్ఫయి ఎనిమిది వేలు. 4 ✝వారిలో ఇరవై నాలుగు వేలమంది యెహోవా ఆలయం పని జరిగించడానికి నియమించబడ్డారు. ఆరు వేలమంది అధికారులుగా, న్యాయాధిపతులుగా, 5 నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమించబడ్డారు. నాలుగు వేలమంది దేవసంస్తుతి చేయడానికీ దావీదు చేయించిన వాద్యాలతో యెహోవాను సంకీర్తనం చేయడానికీ నియమించబడ్డారు. 6 ✝లేవీ కొడుకులైన గెర్షోను, కహాతు, మెరారి వంశాలప్రకారం వారిని గుంపులుగా విభాగించాడు దావీదు.7 గెర్షోను వంశంలో లద్దాను, షిమీ ఉన్నారు. 8 లద్దాను కొడుకులు ముగ్గురు – యెహీయేల్, జేతాం, యోవేల్. యెహీయేల్ మొదట పుట్టినవాడు. 9 షిమీ కొడుకులు: షెలోమీతు, హజీయేల్, హారాను అనే ముగ్గురు లద్దాను కుటుంబాల నాయకులు. 10 యహతు, జీనా, యూషు, బెరీయా అనే నలుగురు కూడా షిమీ కొడుకులు. 11 యహతు పెద్దవాడు, జీనా రెండోవాడు, యూషుకూ, బెరీయాకూ చాలామంది కొడుకులు లేరు గనుక వారు ఒకే కుటుంబంగా ఎంచబడ్డారు.
12 కహాతు కొడుకులు నలుగురు – అమ్రాం, ఇసహారు, హెబ్రోను, ఉజ్జీయేల్. 13 అమ్రాం కొడుకులు అహరోను, మోషే. అహరోను, అతని సంతతివారు ఎప్పటికీ ప్రత్యేకించబడ్డారు. వారు చేయవలసిన సేవ అతి పవిత్ర వస్తువులను ప్రతిష్ఠించడం, యెహోవా సన్నిధానంలో ధూపం వేయడం, ఆయన సేవ జరిగించడం, ఆయన పేర ప్రజలను దీవించడం. 14 దేవుని మనిషి అయిన మోషే సంతానం లేవీగోత్రికులలో ఎంచబడ్డారు. 15 మోషే కొడుకులు గెర్షోం, ఎలియాజరు. 16 గెర్షోం సంతతివారిలో మొదటివాడు షెబూయేల్. 17 ఎలియాజరు సంతతివారిలో మొదటివాడు రెహబయా. అతడు తప్ప ఎలియాజరుకు ఇంకా కొడుకులు లేరు. అయితే రెహబయాకు చాలా మంది కొడుకులు ఉన్నారు. 18 ఇసహారు కొడుకులలో షెలోమీతు పెద్దవాడు. 19 హెబ్రోను కొడుకులు: పెద్దవాడు యెరీయా, రెండోవాడు అమరయా, మూడోవాడు యహజీయేల్, నాలుగోవాడు యెకమెయాం. 20 ఉజ్జీయేల్ కొడుకులు: మీకా పెద్దవాడు, యెషీయా రెండోవాడు.
21 మెరారి కొడుకులు మహలి, మూషి. మహలి కొడుకులు ఎలియాజరు, కీషు. 22 ఎలియాజరు చనిపోయినప్పుడు అతనికి కూతుళ్ళు ఉన్నారు గాని కొడుకులు లేరు. వారి బంధువులైన కీషు కొడుకులు వారిని పెళ్ళి చేసుకొన్నారు. 23 మూషి కొడుకులు ముగ్గురు – మహలి, ఏదెరు, యెరీమోతు.
24 ✽వీరు తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం, లేవీ సంతతివారు. వారు కుటుంబ నాయకులు, ఇరవై సంవత్సరాలు మొదలుకొని అంతకు పై వయసు గలిగి పేరునుబట్టి జనాభాలెక్కలలో నమోదైన వ్యక్తులు, యెహోవా ఆలయ సేవ చేయడానికి నియమించబడ్డవారు.
25 దావీదు “ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా తన ప్రజలకు నెమ్మది ప్రసాదించి ఎల్లకాలం జెరుసలంలో నివాసం చేయడానికి వచ్చాడు. 26 కనుక లేవీగోత్రికులకు ఇకనుంచి దైవ నివాసాన్నీ, దాని సేవకోసం ఉన్న వస్తువులనూ మోసే పనిలేదు” అన్నాడు.
27 దావీదు ఇచ్చిన చివరి ఆదేశం ప్రకారం లేవీగోత్రికులలో ఇరవై సంవత్సరాలు మొదలుకొని అంతకు పై వయసుగలవారు లెక్కపెట్టడం జరిగింది. 28 ✽ వారు చేయవలసిన సేవ ఏమిటంటే, అహరోను సంతతివారికి సహాయం చేస్తూ ఆవరణాల్లో గదులలో పనిచేయడం, పవిత్ర వస్తువులన్నిటినీ శుద్ధి చేయడం, దేవుని ఆలయంలో ఇతర పనులు చేయడం, 29 బల్లమీద సన్నిధి రొట్టెలు ఉంచడం, నైవేద్యాల కోసం పిండిని సిద్ధం చేయడం, పొంగజేసే పదార్థం లేని అప్పడాలు చేయడం, పేల్చడం, కలపడం, అన్ని పరిమాణాలూ కొలతలూ చూడడం, 30 ప్రతి రోజూ ఉదయం, సాయంకాలం✽ నిలబడి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు✽ అర్పించడం, 31 విశ్రాంతి దినాలలో, అమావాస్యలలో, నియామకమైన పండుగల✽లో, యెహోవాకు హోమబలులు అర్పించవలసిన సమయాలన్నిటిలో అలా చేయడం. వారు లెక్కకు సరిగా, వంతుల ప్రకారం, క్రమంగా యెహోవా సన్నిధానంలో సేవ చేయవలసినవారు. 32 ✝ఈ విధంగా లేవీగోత్రికులు సన్నిధి గుడారం, పవిత్ర స్థలం విషయాల్లో బాధ్యత వహిస్తూ, వారి బంధువులైన అహరోను సంతతివారి చేతి క్రింద, యెహోవా ఆలయ సేవ చేయవలసినవారు.