22
1 తరువాత దావీదు “యెహోవా ఆలయం, ఇస్రాయేల్‌ ప్రజల హోమబలిపీఠం ఇక్కడే ఉంటాయి” అన్నాడు. 2 ఇస్రాయేల్‌లో కాపురముంటున్న విదేశీయులను సమకూర్చాలని దావీదు ఆజ్ఞ జారీ చేశాడు, వాళ్ళలో కొంతమందిని దేవుని ఆలయాన్ని కట్టించడానికి రాళ్ళను చెక్కేపనిమీద ఉంచాడు. 3 ద్వారాల తలుపులకు కావలసిన మేకుల కోసం, బందులకోసం చాలా ఇనుమునూ, తూచలేనంత కంచునూ దావీదు సంపాదించాడు. 4 సీదోనువాళ్ళూ తూరువాళ్ళూ దావీదుకు అనేక దేవదారు మ్రానులను తీసుకురావడంచేత వాటిని కూడా లెక్కపెట్టలేనంతగా సమకూర్చాడు.
5 దావీదు “నా కొడుకు సొలొమోను అనుభవం లేని పిల్లవాడు. యెహోవాకు కట్టవలసిన ఆలయం చాలా ఘనంగా ఉండాలి. దాని అందం కారణంగా అది జనాలన్నిటిలో పేరు పొందాలి. కనుక దానికి నేను వస్తువులను సిద్ధం చేయాలి” అనుకొన్నాడు. అతడు చనిపోయేముందు దానికి చాలా వస్తువులను సిద్ధం చేశాడు.
6 తరువాత అతడు తన కొడుకు సొలొమోనును పిలిచి ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాకు ఆలయాన్ని కట్టాలని అతణ్ణి ఆదేశించాడు.
7 దావీదు సొలొమోనుతో ఇలా అన్నాడు: “కుమారా, నా దేవుడు యెహోవా పేరుకు ఆలయాన్ని కట్టించాలని నేను ఉద్దేశించాను. 8 కానీ యెహోవానుంచి ఈ వాక్కు నాకు వచ్చింది: ‘నీవు చాలా రక్తపాతం చేశావు. గొప్ప యుద్ధాలు జరిగించావు. నా ఎదుట చాలా రక్తం ఒలికించినందుచేత నీవు నా పేరుకు ఆలయాన్ని కట్టించకూడదు. 9 అయితే నీకు ఒక కొడుకు జన్మిస్తాడు. అతడు శాంతిపరుడుగా ఉంటాడు. చుట్టుపట్ల ఉన్న అతని శత్రువులందరి విషయమూ నేను అతనికి విశ్రాంతి ప్రసాదిస్తాను. అతనికి సొలొమోను అనే పేరు ఉంటుంది. అతని రోజులలో ఇస్రాయేల్ ప్రజలకు శాంతి, నెమ్మది ప్రసాదిస్తాను. 10 అతడే నా పేరుకు ఆలయాన్ని కట్టిస్తాడు. అతడు నాకు కొడుకుగా ఉంటాడు. నేను అతనికి తండ్రిగా ఉంటాను. ఇస్రాయేల్ ప్రజలమీద అతని రాజ్య సింహాసనం శాశ్వతంగా సుస్థిరంగా ఉండేలా చేస్తాను.’
11 “కుమారా, యెహోవా నీకు తోడుగా ఉంటాడు గాక. నీ దేవుడు యెహోవా నీ విషయం చెప్పినప్రకారం నీవు ఆయనకు ఆలయాన్ని కట్టించేలా నీకు విజయం ఇస్తాడు గాక. 12  నీ దేవుడు యెహోవా యొక్క ధర్మశాస్త్రాన్ని నీవు అనుసరించేలా ఆయన నీకు జ్ఞానవివేకాలు ప్రసాదించి ఇస్రాయేల్ ప్రజలమీద నీకు అధికారం దయ చేస్తాడు గాక. 13 ఇస్రాయేల్ ప్రజల విషయం యెహోవా మోషేకు ఇచ్చిన చట్టాలనూ న్యాయ నిర్ణయాలనూ నీవు జాగ్రత్తగా పాటిస్తే అప్పుడు వర్ధిల్లుతావు. ధైర్యంగా, నిబ్బరంగా ఉండు. భయపడకు, నిరుత్సాహపడకు. 14 చాలా కష్టంతో నేను యెహోవా ఆలయంకోసం ముప్ఫయి నాలుగు లక్షల కిలోగ్రాముల బంగారాన్నీ మూడు కోట్ల నలభై లక్షల కిలోగ్రాముల వెండినీ తూచలేనంత కంచునూ ఇనుమునూ సమకూర్చాను. మ్రానులనూ రాళ్ళనూ కూడా సమకూర్చాను. నీవు ఇంకా సంపాదించవచ్చు. 15 నీ దగ్గర చాలా మంది పనివాళ్ళు – రాళ్ళు చెక్కేవాళ్ళూ తాపీ పనివాళ్ళూ వడ్రంగులూ అన్ని రకాల పనులను చేయగల మంచి పనివాళ్ళూ ఉన్నారు. 16 లెక్కపెట్టలేనంత బంగారం, వెండి, కంచు, ఇనుము నీకు ఉన్నాయి. కనుక పని మొదలుపెట్టు. యెహోవా నీకు తోడుగా ఉంటాడు గాక!”
17 తన కొడుకు సొలొమోనుకు సహాయం చేయాలని దావీదు ఇస్రాయేల్‌ప్రజల నాయకులందరికీ ఆజ్ఞ జారీ చేశాడు. 18 అతడు వారితో అన్నాడు “మీ దేవుడు యెహోవా మీతో కూడా ఉన్నాడు గదా. చుట్టుపట్ల ఉన్న వాళ్ళ విషయం ఆయన మీకు విశ్రాంతి ప్రసాదించాడు గదా. ఎందుకంటే, దేశంలోఉన్న జాతివాళ్ళను ఆయన నా వశం చేశాడు, దేశం యెహోవాకూ ఆయన ప్రజకూ లొంగిపోయింది. 19 ఇప్పుడు మీ దేవుడు యెహోవాను హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో వెదకండి. యెహోవా ఒడంబడిక మందసాన్ని దేవునికి చెందే పవిత్ర వస్తువులనూ ఆయన పేరుకు కట్టబడే ఆలయంలోకి చేర్చేలా మీరు యెహోవా దేవుని పవిత్ర స్థలాన్ని కట్టడం మొదలుపెట్టండి.”