21
1 తరువాత సైతాను ఇస్రాయేల్‌ప్రజలకు వ్యతిరేకంగా లేచి వారిని లెక్కపెట్టడానికి దావీదును పురికొలిపాడు. 2 గనుక దావీదు “జనాభా లెక్క ఎంతో నేను తెలుసుకోవాలి. మీరు వెళ్ళి బేర్‌షెబా నుంచి దానువరకు ఉన్న ఇస్రాయేల్‌ప్రజలను లెక్కపెట్టి తిరిగి వచ్చి వారి సంఖ్యను నాకు చెప్పండి” అని యోవాబుకూ ప్రజల నాయకులకూ ఆజ్ఞ జారీ చేశాడు.
3 అందుకు యోవాబు “యెహోవా జనసంఖ్యను నూరంతలు ఎక్కువ చేస్తాడు గాక! అయితే రాజా, నా యజమానీ, వారందరూ నీ సేవకులు కారా? నా యజమాని ఇలా చేయాలని ఎందుకు కోరుతున్నావు? నీవెందుకు ఇస్రాయేల్ ప్రజల మీదికి అపరాధం తెచ్చిపెడతావు?” అని జవాబిచ్చాడు. 4 అయితే రాజాజ్ఞ యోవాబును బలవంతం చేసింది గనుక యోవాబు వెళ్ళి ఇస్రాయేల్ దేశమంతటా సంచారం చేసి జెరుసలంకు తిరిగి వచ్చాడు. 5 యోవాబు జనాభా లెక్కలు దావీదుకు తెలియజేశాడు. ఇస్రాయేల్ ప్రజలందరిలో ఖడ్గం ప్రయోగించేవారు పదకొండు లక్షలమంది ఉన్నారు. యూదావారిలో ఖడ్గం ప్రయోగించేవారు నాలుగు లక్షల డెబ్భై వేలమంది ఉన్నారు. 6 రాజు ఇచ్చిన ఈ ఆజ్ఞ యోవాబుకు అసహ్యంగా ఉంది గనుక అతడు లేవీవారినీ బెన్యామీనువారినీ జనాభా లెక్కలలో చేర్చలేదు. 7 రాజాజ్ఞ యెహోవా దృష్టిలో కూడా చెడ్డగా ఉంది గనుక ఆయన ఇస్రాయేల్ ప్రజలను మొత్తాడు.
8 అప్పుడు దావీదు దేవునికి ప్రార్థన చేసి “నేను అలా జరిగించి ఘోరమైన పాపం చేశాను. చాలా తెలివితక్కువ పని చేశాను. దయచేసి నీ దాసుడైన నా దోషం క్షమించు” అన్నాడు.
9 యెహోవా దావీదుకు దీర్ఘదర్శిగా ఉన్న గాదుతో ఇలా అన్నాడు: 10 “నీవు వెళ్ళి దావీదుతో చెప్పు – యెహోవా చెప్పేదేమిటంటే, మూడు విషయాలలో ఒకదానిని ఎన్నుకొనే అవకాశం నీకు ఇస్తున్నాను. నీవు ఏది కోరుకొంటావో అది నీకు జరిగిస్తాను.”
11 కనుక గాదు దావీదుదగ్గరికి వచ్చి అన్నాడు “యెహోవా చెప్పేదేమిటంటే, ఈ మూడు విషయాలలో ఒకదానిని ఎన్నుకో – 12 మూడు సంవత్సరాల కరవు; మూడు నెలలు నీ శత్రువుల కత్తికి గురి అయి వారిచేత నాశనం కావడం; మూడు రోజులు యెహోవా ఖడ్గం అనే విపత్తు రావడం, అంటే యెహోవా దూత ఇస్రాయేల్‌దేశంలో అంతటా నాశనం చేయడం. నన్ను పంపినవానికి నేను ఏ జవాబివ్వాలో ఆలోచించు.”
13 అందుకు దావీదు “నేను పెద్ద చిక్కులో ఉన్నాను. అయితే యెహోవా అధిక కరుణాసంపద గలవాడు. ఆయన చేతిలోనే నేను పడాలి గాని మనుషుల చేతిలో పడకూడదు” అని గాదుతో అన్నాడు.
14 అందుచేత యెహోవా ఇస్రాయేల్ ప్రజల మీదికి విపత్తు రప్పించాడు. వారిలో డెబ్భై వేలమంది చనిపోయారు. 15 దేవుడు జెరుసలంను నాశనం చేయడానికి ఒక దూతను పంపాడు. ఆ దూత దానిని నాశనం చేయబోయినప్పుడు అది చూచి యెహోవా ఆ విపత్తు విషయం పరితపించాడు. ఆయన “అంతే చాలు! నీ చెయ్యి వెనుకకు తీయి!” అని నాశనం చేసే దూతకు ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు యెహోవా దూత యెబూసివాడైన ఒరనాను కళ్ళం దగ్గర నిలుచున్నాడు. 16 దావీదు తలెత్తి చూచినప్పుడు భూమికీ ఆకాశానికీ మధ్య నిలుచున్న యెహోవా దూత కనిపించాడు. ఆ దూత ఖడ్గం చేతపట్టుకొని దానిని జెరుసలం మీద చాపుతూ ఉన్నాడు. గోనెపట్ట కట్టుకొన్న దావీదు, ప్రజల పెద్దలు సాష్టాంగపడ్డారు.
17 దావీదు దేవునితో “ప్రజలను లెక్క పెట్టాలని ఆజ్ఞ జారీ చేసినది నేనే గదా. పాపం చేసినది, మూర్ఖంగా ప్రవర్తించినది నేనే. ఈ ప్రజలు గొర్రెలలాంటివాళ్ళు. వాళ్ళు ఏమీ చేయలేదు గదా. యెహోవా! నా దేవా! నన్నూ నా తండ్రి వంశం వాళ్ళనూ శిక్షించు గాని బాధపెట్టే నీ చేయి నీ ప్రజలమీద ఇంకా ఉండకుండా చెయ్యి” అన్నాడు.
18 అప్పుడు దావీదు వెళ్ళి యెబూసివాడైన ఒరనాను కళ్ళంలో యెహోవాకు బలిపీఠం కట్టించాలని దావీదుకు చెప్పమని యెహోవా దూత గాదుకు ఆజ్ఞాపించాడు. 19 యెహోవా పేర గాదు పలికిన మాట విని దావీదు అక్కడికి వెళ్ళాడు. 20 ఒరనాను గోధుమలు నూరుస్తూ ఉన్నాడు. అతడు వెనక్కు తిరిగి ఆ దేవదూతను చూశాడు. అతడూ అతనితో ఉన్న అతని నలుగురు కొడుకులూ దాగుకొన్నారు. 21 దావీదు ఒరనానుదగ్గరికి వస్తూ ఉంటే ఒరనాను అతణ్ణి చూచి కళ్ళంనుంచి బయటికి వచ్చి దావీదు ఎదుట సాష్టాంగపడ్డాడు.
22 దావీదు “ప్రజలమీదికి వచ్చిన ఈ విపత్తు నిలిచిపోయేలా ఈ కళ్ళం ఉన్న స్థలంలో నేను యెహోవాకు బలిపీఠం కట్టించాలి. దాన్ని నాకు సరైన వెలకు అమ్ము” అని ఒరనానుతో అన్నాడు.
23 అందుకు ఒరనాను “దానిని తీసుకోండి! నా యజమానులైన రాజుకు ఏది ఇష్టమో అది చేయవచ్చు. ఇదిగో హోమబలికి ఎడ్లను ఇస్తాను. కట్టెలుగా మార్చే కర్ర సామాను ఇస్తాను. నైవేద్యానికి గోధుమలు ఇస్తాను. ఇదంతా నేనిస్తాను” అని దావీదుతో చెప్పాడు.
24 దావీదురాజు “అలా తీసుకోను. నీకు సరైన వెల ఇచ్చి వాటిని కొంటాను. నేను నీ సొత్తును యెహోవాకోసం తీసుకోను, వెల ఇవ్వక తీసుకొన్నదానిని హోమబలిగా అర్పించను” అని ఒరనానుతో చెప్పాడు.
25 అప్పుడు దావీదు ఆ స్థలం కోసం ఆరు వందల తులాల బంగారం ఒరనానుకు ఇచ్చాడు. 26 అక్కడ దావీదు యెహోవాకు బలిపీఠం కట్టించి హోమబలులూ శాంతిబలులూ అర్పించాడు. అప్పుడతడు యెహోవాను ప్రార్థించాడు, యెహోవా ఆకాశంనుంచి బలిపీఠంమీదికి మంటలు పంపి అతనికి జవాబిచ్చాడు. 27 యెహోవా తన దూతకు ఆజ్ఞ జారీ చేశాడు. దూత తన ఖడ్గం మళ్ళీ ఒరలో ఉంచాడు. 28 యెబూసివాడైన ఒరనాను కళ్ళంలో యెహోవా తనకు జవాబిచ్చాడని గ్రహించి దావీదు అక్కడ బలులు అర్పించాడు. 29 మోషే ఎడారిలో చేయించిన యెహోవా నివాసం, హోమ బలిపీఠం ఆ కాలంలో గిబియోనులో ఎత్తయిన స్థలంలో ఉన్నాయి. 30 అయితే యెహోవా దూత పట్టుకొని ఉన్న ఖడ్గానికి భయపడి దావీదు దేవుని దగ్గర విచారణ చేయడానికి ఆ స్థలానికి వెళ్ళలేకపోయాడు.