20
1 ✽వసంత రుతువు, రాజులు యుద్ధానికి బయలుదేరే కాలంలో యోవాబు సైన్యాన్ని సమకూర్చి వెళ్ళి అమ్మోనువాళ్ళ దేశాన్ని పాడు చేసి రబ్బాను ముట్టడించాడు. అయితే దావీదు వెళ్ళక జెరుసలంలోనే ఉండిపోయాడు. యోవాబు రబ్బాను ఓడించి దానిని పడగొట్టించివేశాడు. 2 ✝దావీదు వచ్చి వాళ్ళ రాజు తలమీద ఉన్న కిరీటాన్ని తీసుకొన్నాడు. దాని బరువు ముప్ఫయి నాలుగు కిలోగ్రాములు. అది విలువగల రత్నాలు పొదిగినది. వారు దానిని దావీదు తలమీద పెట్టారు. దావీదు ఆ పట్టణంలోనుంచి చాలా దోపిడీసొమ్ము పట్టుకుపోయాడు. 3 అక్కడివాళ్ళను బయటికి తెప్పించి రంపాలతో, వాడి అయిన ఇనుప పనిముట్లతో, గొడ్డండ్లతో వాళ్ళచేత పని చేయించాడు. అమ్మోనువాళ్ళ పట్టణాలన్నిటికీ అతడు ఆవిధంగా చేశాడు. తరువాత దావీదు, సైన్యమంతా జెరుసలంకు తిరిగి వచ్చారు.4 ✝కాలక్రమేణ గెజెరు దగ్గర ఫిలిష్తీయవాళ్ళతో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో హుషా గ్రామంవాడైన సిబ్బెకై సిప్పయి అనే వాణ్ణి చంపాడు. సిప్పయి రెఫా జాతివాడు. అప్పుడు ఫిలిష్తీయవాళ్ళు లొంగిపోయారు. 5 మరోసారి ఫిలిష్తీయ వాళ్ళతో యుద్ధం జరిగినప్పుడు, యాయీరు కొడుకు ఎల్‌హానాను గాతువాడైన గొల్యాతు తోబుట్టువు లహమీని చంపాడు. లహమీ ఈటెకర్ర చేనేతపనివాడి అడ్డకర్రంత పెద్దది. 6 మరో యుద్ధం గాతు దగ్గర జరిగింది. అక్కడ చాలా పొడుగాటి వాడొకడు ఉండేవాడు. ఒక్కొక్క చేతికి ఆరేసి వ్రేళ్ళు – మొత్తం ఇరవై నాలుగు వ్రేళ్ళు – అతడికి ఉన్నాయి. అతడు కూడా రెఫావాళ్ళలో ఒకడు. 7 అతడు ఇస్రాయేల్‌వారిని దూషించినప్పుడు దావీదు తోబుట్టువైన షిమయా కొడుకు యోనాతాను అతణ్ణి చంపాడు. 8 వీళ్ళు గాతువాడైన రెఫా సంతానం. వాళ్ళు దావీదుచేత, దావీదు మనుషులచేత హతమయ్యారు.