19
1 ✝తరువాత అమ్మోనువాళ్ళ రాజు నాహాషు చనిపోయాడు. అతడి స్థానంలో అతడి కొడుకు రాజయ్యాడు. 2 దావీదు “హానూను తండ్రి నాహాషు నామీద దయ చూపాడు. నేను హానూను మీద దయ చూపుతాను” అనుకొన్నాడు. గనుక అతడి తండ్రి మృతి విషయం అతణ్ణి ఓదార్చడానికి దావీదు తన పరివారంలో కొంతమందిని పంపాడు. దావీదు సేవకులు అతణ్ణి ఓదార్చడానికి అమ్మోనువాళ్ళ దేశంలో హానూను దగ్గరికి చేరినప్పుడు 3 అమ్మోనువాళ్ళ నాయకులు హానూనుతో ఇలా అన్నారు: “నిన్ను ఓదార్చడానికి దావీదు మనుషులను పంపింది నీ తండ్రిని గౌరవించడానికే అనుకొంటున్నావా? ఈ దేశాన్ని నాశనం చేయాలని దానిని తనిఖీ చేయడానికి అతడి మనుషులు గూఢచారులుగా వచ్చారు గదా!”4 అందుచేత హానూను దావీదు సేవకులను పట్టుకొని వారిని గొరిగించి వారు తొడుగుకొన్న బట్టలను నడిమికి తుంటి వరకు కత్తిరించి వారిని పంపివేశాడు. 5 వారి సంగతి ఎవరో వచ్చి దావీదుకు తెలియజేశారు. ఆ మనుషులు చాలా సిగ్గుపాలయ్యారు గనుక దావీదు వారిదగ్గరికి కొంతమందిని ఈ సందేశంతో పంపాడు: “మీ గడ్డాలు పెరిగేవరకు యెరికోలో ఆగి ఆ తరువాత తిరిగి రండి.”
6 ✽దావీదుకు తాము అసహ్యమయ్యామని అమ్మోనువాళ్ళు గ్రహించినప్పుడు అరామ్ నహరయీంనుంచీ అరాం మయకానుంచీ సోబానుంచీ రథాలనూ రౌతులనూ బాడుగకు తీసుకోవడానికి హానూను, అమ్మోనువాళ్ళు మూడు వేల మూడు వందల అరవై కిలోగ్రాముల వెండిని ఆ స్థలాలకు పంపారు. 7 వాళ్ళు ముప్ఫయి రెండు వేల రథాలనూ మయకా రాజునూ అతడి జనాన్నీ బాడుగకు తీసుకొన్నారు. వారు వచ్చి మేదెబాకు ఎదురుగా మకాం చేశారు. అంతలో అమ్మోనువాళ్ళు తమ పట్టణాలనుంచి సమకూడి యుద్ధం చేయడానికి వచ్చారు. 8 దావీదు ఈ సంగతి విని యోవాబునూ యుద్ధ వీరులందరినీ అక్కడికి పంపాడు. 9 అమ్మోనువాళ్ళు తమ నగరంలోనుంచి బయటికి వచ్చి నగర ద్వారానికి ఎదురుగానే యుద్ధానికి బారులు తీరారు. అక్కడికి వచ్చిన రాజులు వేరుగా పొలాలలో ఉన్నారు.
10 తనకు వెనకా ముందూ సైన్యవ్యూహాలు ఉండడం చూచి యోవాబు ఇస్రాయేల్ సైనికులందరిలో బలాఢ్యులను ఎన్నుకొని సిరియనులకు ఎదురుగా సైన్యవ్యూహం ఏర్పరచాడు. 11 మిగిలినవారిని తన తోబుట్టువు అబీషైక్రింద ఉంచి అమ్మోనువాళ్ళకు ఎదురుగా సైన్యవ్యూహం ఏర్పరచాడు.
12 యోవాబు “సిరియనుల బలం నాకు మించితే నీవు నాకు సహాయం చేయాలి. అమ్మోనువాళ్ళ బలం నీకు మించితే నేను నీకు సహాయం చేస్తాను. 13 ధైర్యంగా ఉండు. మన ప్రజలకోసం, మన పట్టణాలకోసం ధైర్యంతో పోరాడుదాం. తన దృష్టిలో ఏది మంచిదో యెహోవా అది చేస్తాడు గాక!” అని అబీషైతో అన్నాడు.
14 అప్పుడు యోవాబు, అతడితో ఉన్నవారు సిరియనులతో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళారు. అతడి ఎదుటనుంచి వాళ్ళు పారిపోయారు. 15 సిరియనులు పారిపోవడం చూచి అమ్మోనువాళ్ళు యోవాబు తోబుట్టువు అబీషై ఎదుటనుంచి పారిపోయి నగరంలో చొరబడ్డారు. అప్పుడు యోవాబు జెరుసలంకు తిరిగి వచ్చాడు.
16 తాము ఇస్రాయేల్‌వారిచేత ఓడిపోయామని గ్రహించి సిరియనులు రాయబారులను పంపి యూఫ్రటీసు నది అవతల సిరియనులను పిలవనంపించారు. హదదెజెరు సైన్యానికి అధిపతిగా ఉన్న షోపక్‌వాళ్ళకు నాయకుడుగా ఉన్నాడు. 17 దావీదు ఈ సంగతి విని ఇస్రాయేల్ సైన్యమంతటినీ సమకూర్చి యొర్దానును దాటిపోయాడు. వాళ్ళను ఎదుర్కోవడానికి ముందుకు సాగి వాళ్ళకు ఎదురుగా సైన్యవ్యూహం ఏర్పరచాడు. దావీదు సిరియనులకు ఎదురుగా సైన్యవ్యూహం ఏర్పరచాక వాళ్ళు అతనితో యుద్ధం చేశారు. 18 అయితే వాళ్ళు ఇస్రాయేల్‌వారి దగ్గర నుంచి పారిపోయారు. దావీదు వాళ్ళలో ఏడు వేలమంది రథసారథులనూ నలభై వేలమంది రౌతులనూ హతం చేశాడు. వాళ్ళ సైన్యాధిపతి షోపక్‌ను కూడా చంపాడు. 19 హదదెజెరుకు పాలెవాళ్ళుగా ఉన్న వాళ్ళంతా తాము ఇస్రాయేల్‌వారిచేత ఓడిపోయామని గ్రహించి దావీదుతో సమాధానపడి అతనికి లొంగిపోయారు. అప్పటినుంచి సిరియనులు అమ్మోనువాళ్ళకు సహాయం చేయడానికి ఇష్టపడలేదు.