18
1 ✝కాలక్రమేణ దావీదు ఫిలిష్తీయవాళ్ళును ఓడించి లొంగదీశాడు, గాతు, దాని గ్రామాలు ఫిలిష్తీయవాళ్ళ వశంలో నుంచి పట్టుకొన్నాడు. 2 అంతే గాక, దావీదు మోయాబు దేశస్తులను కూడా ఓడించాడు. వాళ్ళు అతనికి లొంగిపోయి కప్పం చెల్లించేవాళ్ళయ్యారు.3 సోబా రాజైన హదదెజరు యూఫ్రటీసు నది వరకు తన పరిపాలన స్థాపించడానికి బయలుదేరినప్పుడు హమాతు దగ్గర దావీదు అతణ్ణి ఓడించాడు. 4 దావీదు అతడి దగ్గర నుంచి వెయ్యి రథాలనూ ఏడు వేలమంది రౌతులనూ ఇరవై వేలమంది పదాతులనూ పట్టుకొన్నాడు. రథాల గుర్రాలలో ఒక వందను ఉంచుకొని మిగిలినవాటికి చీలమండ నరాలను తెగవేయించాడు. 5 దమస్కులో ఉన్న సిరియనులు సోబా రాజైన హదదెజెరుకు సహాయం చేయడానికి వచ్చినప్పుడు దావీదు వాళ్ళలో ఇరవై రెండు వేలమందిని హతమార్చాడు. 6 దమస్కుకు చెందిన సిరియా రాజ్యంలో దావీదు తన సైనికుల శిబిరాలను ఉంచాడు. సిరియనులు దావీదుకు లొంగిపోయి, కప్పం చెల్లించే వాళ్ళయ్యారు. దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతనికి విజయం ప్రసాదించాడు.
7 హదదెజెరు అధిపతులు ధరించిన బంగారు డాళ్ళను దావీదు పట్టుకొని జెరుసలంకు తీసుకువచ్చాడు. 8 హదదెజెరు వశంలో ఉన్న తిబహత్, కూన్ అనే పట్టణాలలో దావీదు చాలా కంచును పట్టుకొన్నాడు. తరువాత దానితో సొలొమోను కంచు✽ సరస్సునూ స్తంభాలనూ ఇతర కంచు వస్తువులనూ చేయించాడు.
9 దావీదు సోబా రాజైన హదదెజెరు సైన్యాన్నంతా ఓడించిన సంగతి హమాతు రాజైన తోయికి వినబడింది. 10 అంతకు ముందు హదదెజెరు తోయిమీద యుద్ధాలు చేసేవాడు గనుక దావీదు యుద్ధంలో హదదెజెరును ఓడించాడని విని తోయి కుశల ప్రశ్నలడగడానికీ దావీదుతోకూడా సంతోషించడానికీ తన కొడుకు హదోరంను దావీదు దగ్గరకు పంపాడు. హదోరం అన్ని రకాల వెండి బంగారు కంచు వస్తువులను కానుకలుగా తెచ్చాడు. 11 దావీదురాజు వాటిని యెహోవాకు అంకితం చేశాడు. అదివరకు అతడు ఎదోం, మోయాబు, అమ్మోను, ఫిలిష్తీయ, అమాలేకు అనే జనాల దగ్గరనుంచి పట్టుకొన్న వెండి బంగారులను కూడా యెహోవాకు అంకితం చేశాడు.
12 ✽సెరూయా కొడుకు అబీషై “ఉప్పులోయ” లో పద్ధెనిమిది వేలమంది ఎదోం సైనికులను హతమార్చాడు. 13 అతడు ఎదోంలో సైనికుల శిబిరాలను ఉంచాడు. ఎదోం దేశస్తులంతా దావీదుకు లొంగిపోయారు. దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతనికి విజయమిచ్చాడు.
14 దావీదు ఇస్రాయేల్ ప్రజలందరి మీదా పరిపాలించాడు. తన ప్రజలందరిపట్లా ధర్మాన్నీ న్యాయాన్నీ జరిగించాడు. 15 సెరూయా కొడుకు యోవాబు సైన్యానికి అధిపతిగా ఉన్నాడు. అహీలూద్ కొడుకు యెహోషాపాతు రాజ్య దస్తావేజులు రాసిపెట్టాడు. 16 అహీటూబ్ కొడుకు సాదోకు, అబ్యాతారు కొడుకు అహీమెలెకు యాజులు. షవషా ధర్మశాస్త్రి. 17 యెహోయాదా కొడుకు బెనాయా కెరేతివారికీ పెలేతీవారికీ✽ అధిపతి. దావీదు కొడుకులు రాజుకు సహాయం చేసే ప్రధానాధికారులు.