15
1 ✽దావీదు తనకోసం కట్టడాలను దావీదునగరం✽లో కట్టించుకొన్నాడు. దేవుని మందసానికి ఒక స్థలం సిద్ధపరచి దానిమీద గుడారం✽ వేయించాడు.2 అప్పుడు దావీదు “దేవుని మందసాన్ని మోయడానికీ నిత్యంగా తనకు సేవ చేయడానికీ యెహోవా లేవీగోత్రికులను✽ ఎన్నుకొన్నాడు. వారు తప్ప ఇంకెవరూ దేవుని మందసాన్ని మోయకూడదు” అన్నాడు.
3 యెహోవా మందసంకోసం తాను సిద్ధపరచిన స్థలానికి దానిని తీసుకురావడానికి దావీదు ఇస్రాయేల్ వారందరినీ జెరుసలంలో సమకూర్చాడు. 4 అప్పుడు అహరోను సంతతివారిలో, లేవీగోత్రికులలో కొంతమందిని పిలిపించాడు. 5 ✽వారెవరంటే, కహాతు వంశంవారిలో నాయకుడైన ఊరీయేల్, అతని బంధువులు నూట ఇరవై మంది; 6 మెరారి వంశంవారిలో నాయకుడైన అశాయా, అతని బంధువులు రెండు వందల ఇరవైమంది; 7 గెర్షోను వంశంలో నాయకుడైన యోవేల్, అతని బంధువులు నూట ముప్ఫయిమంది; 8 ఎలీజాపాను వంశంలో నాయకుడైన షెమయా, అతని బంధువులు రెండు వందలమంది; 9 హెబ్రోను వంశంలో నాయకుడైన ఎలీయేల్, అతని బంధువులు ఎనభైమంది; 10 ఉజ్జీయేల్ వంశంలో నాయకుడైన అమ్మినాదాబ్, అతని బంధువులు నూట పన్నెండు మంది.
11 ✝అప్పుడు దావీదు యాజులైన సాదోకునూ అబియాతారునూ లేవీగోత్రికులైన ఊరియేల్‌నూ అశాయానూ యోనేల్‌నూ షెమయానూ ఎలీయేల్‌నూ అమ్మీనాదాబ్‌నూ పిలిపించి వారితో ఇలా అన్నాడు: 12 “మీరు లేవీ కుటుంబాల నాయకులు. ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవా మందసం కోసం నేను సిద్ధపరచిన స్థలానికి దానిని తీసుకురావడానికి మీరు మిమ్ములనూ మీ బంధువులనూ ప్రతిష్ఠించుకోండి✽. 13 ✝ఆ మొదటిసారి మీరు దానిని మోయలేదు. గనుకనే మన దేవుడు యెహోవా మనలో నాశనం కలిగించాడు. అప్పుడు ఆయన నియమం ప్రకారం ఆయనను మనం వెదకలేదు.”
14 అందుచేత ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా మందసాన్ని తేవడానికి యాజులూ లేవీగోత్రికులూ తమను ప్రతిష్ఠించుకొన్నారు. 15 ✝యెహోవా పలికిన వాక్కు ప్రకారం మోషే ఆదేశించినట్టే లేవీగోత్రికులు దేవుని మందసం కర్రలను తమ భుజాల మీదికి ఎక్కించుకొని దానిని మోశారు.
16 ✝దావీదు “మీ బంధువులైన పాటకులు తంతి వాద్యాలనూ తాళాలనూ ఇతర వాద్యాలనూ వాయిస్తూ, సంతోషంతో స్వరమెత్తి పాటలు పాడేలా ఏర్పాటు చేయండి” అని లేవీగోత్రికుల నాయకులతో చెప్పాడు.
17 ✝లేవీగోత్రికులు దానికి నియమించినవారెవరంటే, యోవేల్ కొడుకు హేమాను; హేమాను తోబుట్టువులలో బెరెకయా కొడుకు ఆసాపు; వారి బంధువులైన మెరారి వంశంవారిలో కూషాయాహు కొడుకు ఏతాను; 18 వారితోకూడా రెండో హోదాలో ఉన్న వారి బంధువులు జెకర్యా, బేను, యహజీయేల్, షెమీరామోతు, యెహీయేల్, ఊనీ, ఏలీయాబ్, బెనాయా, మయశేయా, మత్తితయా, ఎలీపలేహు, మికనేయాహు; ద్వారపాలకులు ఓబేదెదోం, యెహీయేల్. 19 కంచు తాళాలను వాయించడానికి పాటకులైన హేమానునూ ఆసాపునూ ఏతానునూ వారు నియమించారు. 20 హెచ్చు స్వరంగల తంతివాద్యాలు వాయించడానికి జెకర్యానూ అజీయేల్‌నూ షెమీరామోతునూ యెహీయేల్‌నూ ఊనినీ ఏలీయాబ్‌నూ మయశేయానూ బెనాయాను నియమించారు. 21 రాగమెత్తి సితారాలు వాయించడానికి మత్తితయానా ఎలీపలేహునూ మికనేయాహునూ ఓబేదెదోంనూ యెహీయేల్‌నూ అజజయానూ నియమించారు. 22 లేవీగోత్రికుల నాయకుడైన కెననయా సంగీతంలో పాటకులను నడిపించడంలో ప్రవీణుడు గనుక ఆ పనికి అతణ్ణి నియమించారు. 23 దేవుని మందసానికి కాపలాదారులుగా బెకెరయాను ఎల్కానానూ నియమించారు. 24 దేవుని మందసానికి ముందు బూరలు✽ ఊదడానికి షెబనయా, యెహోషాపాతు, నెతనేల్, అమాశయి, జెకర్యా, బెనాయా, ఎలియాజరు అనే యాజులను నియమించారు. దేవుని మందసానికి కాపలాదారులుగా ఓబేదెదోంనూ యెహీయానూ కూడా నియమించారు.
25 ✽ యెహోవా మందసాన్ని ఓబేదెదోం ఇంటినుంచి తేవడానికి దావీదు, ఇస్రాయేల్ ప్రజల పెద్దలు సహస్రాధిపతులు సంతోషంతో వెళ్ళారు. 26 యెహోవా ఒడంబడిక పెట్టెను మోసిన లేవీగోత్రికులకు దేవుడు సహాయం చేశాడు గనుక వారు ఏడు ఎద్దులనూ ఏడు పొట్టేళ్ళనూ బలిగా అర్పించారు. 27 దావీదు, మందసాన్ని మోసిన లేవీగోత్రికులందరూ, గాయకులు, సంగీత నాయకుడైన కెననయా సన్నని నూలుతో నేయబడ్డ వస్త్రాలు ధరించినవారు. సన్నని నారతో నేసిన ఏఫోదు దావీదు తొడుక్కొన్నాడు. 28 ఇస్రాయేల్ వారంతా ఆనందధ్వనులు చేస్తూ పొట్టేలు కొమ్ములూ బూరలూ ఊదుతూ, తాళాలూ తంతివాద్యాలూ స్వరమండలాలూ వాయిస్తూ, యెహోవా మందసాన్ని తీసుకువచ్చారు. 29 యెహోవా మందసం దావీదు నగరంలోకి వస్తూ ఉన్నప్పుడు సౌలు కూతురు మీకాల్ కిటికీలోనుంచి చూస్తూ ఉంది. యెహోవా సన్నిధానంలో దావీదు నాట్యం చేస్తూ, సంబరపడుతూ ఉండడం ఆమె చూచి అతణ్ణి తృణీకరించింది.