14
1  దావీదు కోసం భవనాన్ని కట్టడానికి తూరు రాజు హీరాం అతని దగ్గరికి రాయబారులనూ వాళ్ళతో కూడా దేవదారు మ్రానులనూ తాపీపనివాళ్ళనూ వడ్రంగులనూ పంపాడు. 2 యెహోవా ఇస్రాయేల్ ప్రజలమీద తనను రాజుగా స్థిరపరచాడనీ తన ఇస్రాయేల్ ప్రజల కోసం రాజ్యాన్ని గొప్ప చేశాడనీ దావీదు గ్రహించాడు.
3 జెరుసలంలో దావీదు ఇంకా కొంతమంది స్త్రీలను పెళ్ళి చేసికొన్నాడు. అతనికి ఇంకా కొంతమంది కొడుకులూ కూతుళ్ళూ జన్మించారు. 4 జెరుసలంలో అతడికి పుట్టినవారి పేర్లు ఇవి: షమ్మూయ, షోబాబ్, నాతాను, సొలొమోను, 5 ఇభారు, ఏలీషూవ, ఎల్‌పాలెట్, 6 నోగహు, నెపెగు, యాఫీయ, 7 ఎలీషామా, బేలెయాదా, ఎలీపేలెట్.
8 ఇస్రాయేల్ ప్రజలందరి మీదా దావీదు రాజుగా అభిషేకం పొందాడని ఫిలిష్తీయవాళ్ళు విన్నప్పుడు అతణ్ణి పట్టుకోవడానికి వాళ్ళంతా దండెత్తి వచ్చారు. దాన్ని గురించి విని దావీదు వాళ్ళను ఎదుర్కోవడానికి బయలుదేరాడు. 9 ఫిలిష్తీయవాళ్ళు వచ్చి రెఫాయీం లోయలో దిగారు.
10 దావీదు “నేను ఫిలిష్తీయవాళ్ళ పైబడాలా? నీవు వాళ్ళను నా వశం చేస్తావా?” అని దేవుణ్ణి ప్రార్థించాడు.
అందుకు యెహోవా “వెళ్ళు. నేను వాళ్ళను నీ వశం చేస్తాను” అని జవాబిచ్చాడు.
11 అందుచేత దావీదు, అతని మనుషులు బేల్‌పెరాజీంకు వెళ్ళి వాళ్ళను ఓడించాడు. అప్పుడు దావీదు “వరదలు కొట్టుకుపోయే విధంగా యెహోవా నా శత్రువులను నా చేత నాశనం చేయించాడు” అని చెప్పాడు. అందుచేత ఆ స్థలాన్ని బేల్‌పెరాజీం అంటారు. 12 అక్కడ ఫిలిష్తీయవాళ్ళు తమ విగ్రహాలను విడిచిపెట్టి పారిపోయారు. వాటిని కాల్చివేయాలని దావీదు ఆజ్ఞ జారీ చేశాడు.
13 మరోసారి ఫిలిష్తీయవాళ్ళు వచ్చి ఆ లోయలో దిగారు. 14 దావీదు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు “నీవు తిన్నగా వెళ్ళవద్దు. చుట్టు తిరిగి వాళ్ళ వెనక్కు వెళ్ళి కంబళి చెట్లకు ఎదురుగా వాళ్ళ పైబడు. 15 కంబళిచెట్ల కొనలలో అడుగుల చప్పుడు వినగానే యుద్ధానికి బయలుదేరు. ఫిలిష్తీయ సైన్యాన్ని మొత్తడానికి దేవుడు నీ ముందు బయలుదేరుతున్నాడన్న మాట” అని జవాబిచ్చాడు. 16 దేవుడు ఆజ్ఞాపించినట్టే దావీదు చేశాడు. వారు గిబియోనునుంచి గెజెరువరకు ఫిలిష్తీయవాళ్ళను తరుముతూ హతం చేశాడు. 17 ఈ విధంగా దావీదు కీర్తి దేశాలన్నిటికీ వ్యాపించింది. యెహోవా అతని భయం ఇతర జనాలన్నిటికీ కలిగించాడు.