13
1 దావీదు వెయ్యిమందికీ వందమందికీ అధిపతులుగా ఉన్నవారందరితో ఆలోచన చేసిన తరువాత 2 అక్కడ సమకూడిన ఇస్రాయేల్‌వారందరితో ఇలా అన్నాడు: “మీకు ఇష్టమైతే, మన దేవుడు యెహోవా చిత్తమైతే ఇస్రాయేల్ దేశంలో అంతటా మిగిలిన మన బంధువులంతా వచ్చి మనతో కలుసుకొనేలా వారికి కబురు పంపుదాం. తమ పట్టణాలలో, వాటి పరిసరాలలో కాపురముంటున్న యాజులూ లేవీగోత్రికులూ కూడా రావాలని కబురు పంపుదాం. 3 ✽మన దేవుని మందసాన్ని మళ్ళీ తీసుకువచ్చి మన దగ్గర ఉంచుదాం. సౌలు రోజులలో దాని విషయం మనం నిర్లక్ష్యంగా ఉన్నాం✽.” 4 ఈ మాట సమకూడినవారందరికీ సమంజసమనిపించింది గనుక ప్రజలంతా అలా చేయడానికి సమ్మతించారు.5 ✽ అప్పుడు దేవుని మందసాన్ని కిర్యత్‌యారీంనుంచి తీసుకురావడానికి దావీదు ఈజిప్ట్‌లో ఉన్న షీహోరు నది నుంచి హమాతు✽కు పోయే దారి వరకు ఉన్న ఇస్రాయేల్ వారందరినీ సమకూర్చాడు. 6 కెరూబులమధ్య ఆసీనుడైన యెహోవాదేవుని పేరు ఉన్న ఆయన మందసాన్ని బయలా (కిర్యత్‌యారీం) నుంచి తీసుకురావడానికి అతడూ ఇస్రాయేల్ వారంతా అక్కడికి వెళ్ళారు. 7 వారు దేవుని మందసాన్ని కొత్త బండిమీద ఎక్కించి అబీనాదాబు ఇంటినుంచి బయలుదేరారు. ఉజ్జా, అహియో బండిని తోలుతూ ఉన్నారు. 8 దావీదు, ఇస్రాయేల్ వారంతా తమ శక్తి అంతటితో పాటలు పాడుతూ, తంతివాద్యాలనూ కంజరీలనూ తాళాలనూ వాయిస్తూ, బూరలు ఊదుతూ, దేవుని సన్నిధానంలో సంబరపడుతూ ఉన్నారు. 9 కీదోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఎద్దులకు కాలు జారింది. వెంటనే ఉజ్జా ఆ మందసాన్ని పట్టుకోవడానికి చెయ్యి చాపాడు. 10 అతడు మందసం మీద చెయ్యి ఉంచినందుచేత యెహోవా ఉజ్జామీద తీవ్రంగా కోపగించుకొని అతణ్ణి మొత్తాడు. అతడు అక్కడే దేవుని సన్నిధానంలో చనిపోయాడు. 11 యెహోవా ఉజ్జాను నాశనం చేసినందుకు దావీదు పరితపించి ఆ స్థలానికి పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. ఈ రోజువరకు దానికి అదే పేరు.
12 ఆ రోజు దావీదు దేవునికి భయపడి “దేవుని మందసాన్ని నా దగ్గరికి ఏవిధంగా తెప్పిస్తాను?” అనుకొన్నాడు.
13 తన దగ్గర ఉండడానికి ఆ మందసాన్ని అతడు దావీదు నగరానికి తీసుకుపోలేదు. దానికి బదులుగా అతడు దారి ప్రక్కన గాతువాడైన ఓబేదెదోం ఇంటికి దానిని తీసుకుపోయాడు. 14 దేవుని మందసం ఓబేదెదోం ఇంటిలో అతడి కుటుంబం దగ్గర మూడు నెలలు ఉండిపోయింది. యెహోవా అతడి ఇంటివారినీ అతడి ఆస్తి అంతటినీ దీవించాడు.